ఫైజర్‌ టీకాకు సింగపూర్‌ అనుమతి!

అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌కు తాజాగా సింగపూర్ కూడా‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Published : 14 Dec 2020 21:50 IST

నెల చివరలో వ్యాక్సిన్‌ పంపిణీకి ఏర్పాట్లు

సింగపూర్‌: ఇప్పటికే అమెరికాలో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ వ్యాక్సిన్‌కు తాజాగా సింగపూర్ కూడా‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఆసియాలో ఫైజర్‌ వ్యాక్సిన్‌కు అనుమతి ఇచ్చిన తొలిదేశంగా సింగపూర్‌ నిలిచింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిన్‌ పంపిణీని మాత్రం ఈ నెల చివరి వారంలో ప్రారంభిస్తామని సింగపూర్‌ ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ వెల్లడించారు. 57లక్షల జనాభా కలిగిన సింగపూర్‌లో ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందిస్తామని సింగపూర్‌ ప్రధాని వెల్లడించారు. అంతేకాకుండా అక్కడ చాలాకాలంగా నివాసముంటున్న వారికి కూడా వ్యాక్సిన్‌ ఉచితంగానే పంపిణీ చేస్తామని తెలిపారు. వచ్చే ఏడాది మూడో త్రైమాసికం వరకు సింగపూర్‌లోని ప్రజలందరికీ వ్యాక్సిన్‌ అందించే ప్రక్రియ పూర్తిచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

స్వచ్ఛందంగా వచ్చే వారికే వ్యాక్సిన్‌ను అందిస్తామని.. ముందుగా తనతో పాటు ప్రభుత్వ అధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, కరోనా పోరులో ముందున్న ఇతర సిబ్బందికి, వృద్ధులకు వ్యాక్సిన్‌ను అందిస్తామని తెలిపారు. తద్వారా వ్యాక్సిన్‌ సురక్షితమనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించేందుకు కృషి చేస్తామని సింగపూర్‌ ప్రధాని లీ పేర్కొన్నారు.

ఇక, ఫైజర్‌తో పాటు మోడెర్నా, సినోవాక్‌ వ్యాక్సిన్‌ కంపెనీలతోనూ సింగపూర్‌ ఒప్పందాలు కుదుర్చుకుంది. నియంత్రణ సంస్థల నుంచి అవి అనుమతి పొందిన తర్వాత ఆ వ్యాక్సిన్‌ డోసులను కూడా ప్రజలకు అందించే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..
టీకా పంపిణీపై కేంద్ర మార్గదర్శకాలివే..
అమెరికా.. ఊపిరి పీల్చుకో..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని