
కొవిడ్ బాధితులను గుర్తించే బ్లూటూత్!
సింగపూర్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. బయటకు వెళ్లాలంటే వైరస్ సోకుతుందేమోనన్న భయం. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో తప్పడం లేదు. మనం వెళ్లే చోట ఎవరైనా కరోనా బాధితులు ఉన్నారా? ఆ ప్రాంతంలో కరోనా ఎక్కువగా ఉందా? అన్నది ఎవరూ కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. దీని కోసం భారత్ ఆరోగ్యసేతు యాప్‌ను విడుదల చేసినట్లే గతంలో సింగపూర్ కూడా ఓ యాప్‌ను అభివృద్ధి చేసింది. అయితే, ఇది కొన్న భద్రతాపరమైన సమస్యలు ఎదుర్కోవడంతో తాజాగా అక్కడి ప్రజలందరికీ ‘కోవిడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టోకెన్స్’ను ఇస్తోంది. ఎక్కడికి వెళ్లినా తమ వెంట వీటిని తీసుకెళ్లాల్సిందే. అదెలా పని చేస్తుందో తెలుసుకుందామా?
కొవిడ్ కాంటాక్ట్ ట్రేసింగ్ టోకెన్ ఓ బ్లూటూత్ పరికరం. దీంతో చుట్టు పక్కల ఇటువంటి పరికరాలతో అనుసంధానమయ్యేందుకు వీలుంటుంది. ఓ వ్యక్తికి కరోనా నిర్ధారణ అయ్యాక బాధితుడి ఊరు, పేరు, ఫోన్‌నంబర్ తదితర వ్యక్తిగత వివరాలను అధికారులు దానిలో నమోదు చేస్తారు. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లినా ఆ చుట్టుపక్కల ఉండే మిగతా పరికరాలు అతడికి కరోనా ఉన్నట్లు గుర్తించి చెప్పేస్తాయి. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమయ్యే అవకాశముంది. అంతేకాకుండా ఎవరైనా మాల్స్‌లోకి, ఇతర రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లేటప్పుడు ఈ పరికరాన్ని కచ్చితంగా తీసుకెళ్లాలి. కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. తిరిగి నెగటివ్ రిపోర్టు వచ్చిన తర్వాత అధికారులే దీనిలో మార్పులు చేస్తారు.
గతంలో ఇలాంటిదే ఓ స్మార్ట్‌ఫోన్ యాప్‌ను సింగపూర్ విడుదల చేసింది. అయితే, అందులో భద్రత తక్కువగా ఉందని, వ్యక్తిగత సమాచారమంతా పబ్లిక్ సర్వర్లలో నిక్షిప్తమవుతోందని వార్తలు వచ్చాయి. వృద్ధులు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడానికి అంతగా ఆసక్తి చూపరు. అలాంటి వారికి ఈ యాప్ చేరువ కాలేకపోయింది. దీంతో అందరికీ ప్రయోజనం కలిగేలా సింగపూర్ ఈ సరికొత్త పరికరాన్ని రూపొందించింది. ప్రస్తుతం సింగపూర్ ప్రజలంతా షాప్‌లకు, ఆఫీసులకు వెళ్లేందుకు క్యూఆర్ కోడ్ ఆధారంగా పని చేసే ‘సేఫ్ ఎంట్రీ సిస్టం’ను ఉపయోగిస్తున్నారు.
ఈ హార్డ్‌వేర్ పరికరాన్ని ఎక్కడికైనా తీసుకెళ్లిపోవచ్చు. ప్రాథమిక వ్యక్తిగత సమాచారం మాత్రమే అందులో ఉంటుంది. స్మార్ట్ యాప్‌లో అయితే మొబైల్ డేటాను ఎప్పుడూ ఆన్‌లోనే ఉంచాలి. అంతేకాకుండా ఎక్కడెక్కడికి వెళ్తున్నామో సులభంగా పట్టేయొచ్చు. కానీ, ఈ బ్లూటూత్‌తో అలాంటి సమస్యలేవీ ఉండబోవు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.