Updated : 26 Aug 2020 17:12 IST

నీట్‌, జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్దామా..?

ముఖ్యమంత్రుల భేటీలో మమతా బెనర్జీ సూచన
పలురాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోనియా సమావేశం

దిల్లీ: దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి జరుగనున్న నీట్‌, జేఈఈపై మరోసారి సుప్రీంకోర్టు గడపతొక్కే యోచనలో విపక్షాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ విపక్ష పార్టీల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. పరీక్షలను వాయిదా వేయాలంటూ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిద్దామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సూచించినట్లు సమాచారం. ఇప్పటికే దీనిపై ప్రధానమంత్రికి లేఖ రాసినప్పటికీ ఎలాంటి స్పందన లేదని మమతా బెనర్జీ అన్నారు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేద్దామని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సమావేశంలో పంజాబ్‌, ఝార్ఖండ్‌, పుదుచ్చేరి, రాజస్థాన్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

ఇతర ముఖ్యమంత్రులదీ అదే అభిప్రాయం..

ఈ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రులందరం కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేస్తే బాగుంటుందని పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేదా రాష్ట్రపతిని కలుద్దామని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ అభిప్రాయపడ్డారు. ఇక అమెరికాలో దాదాపు 95వేల మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారనే నివేదికలు ఉన్నాయి. అలాంటి పరిస్థితే ఇక్కడ ఎదురైతే మనమేం చేయగలమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశంలో పేర్కొన్నారు. పరీక్షలను నిర్వహిస్తే దేశంలో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే జరిగితే దీనికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ సమస్య గురించి కేంద్రంపై కలిసికట్టుగా పోరాడాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి స్పష్టం చేశారు.

నీట్‌, జేఈఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలతో పాటు మరిన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్‌, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. వీరితో పాటు సుబ్రహ్మణ్యస్వామి, రాహుల్‌ గాంధీ, ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, డీఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ లు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. అటు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ కూడా పరీక్షలను వ్యతిరేకిస్తూ విద్యార్థులకు మద్దతు పలికారు. తాజాగా దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా కూడా నీట్‌ పరీక్షలపై కేంద్రం మరోసారి పునరాలోచించాలని కోరారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని