రైతుల ఆందోళనలపై అమర్త్యసేన్‌ కీలక వ్యాఖ్యలు!

దేశంలో అసమ్మతి తెలియజేయడం, పలు సమస్యలపై చర్చించే వేదికలు కుచించుకుపోతున్నాయని నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 28 Dec 2020 18:46 IST

కోల్‌కతా: దేశంలో అసమ్మతి తెలిపే, పలు సమస్యలపై చర్చించే వేదికలు కుచించుకుపోతున్నాయని నోబెల్‌ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశ ద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా సరైన విచారణ లేకుండానే శిక్షలకు గురవుతున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఆందోళనకు మద్దతు పలికిన ఆయన.. చట్టాలను సమీక్షించాల్సిన అవసరాన్ని తాజా నిరసనలు స్పష్టం చేస్తున్నాయని నొక్కిచెప్పారు. అయితే, అంతకు ముందు నిరసన చేస్తోన్న రైతులతో చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వానికి సూచించారు.

‘ప్రజలకు నిరసన తెలిపే అవకాశాలు, స్వేచ్ఛగా నిర్వహించుకునే చర్చా వేదికలకు దారులు మూసుకుపోతున్నాయి. ప్రభుత్వానికి నచ్చని వ్యక్తిని ప్రభుత్వమే ద్రోహిగా ప్రకటిస్తూ శిక్షిస్తోంది. ముఖ్యంగా అసమ్మతి తెలియజేసే అవకాశాలు, చర్చలకు తావు లేకుండా పోతోంది. ఏకపక్షంగా విధిస్తోన్న దేశద్రోహ ఆరోపణలను ఎదుర్కొనే వారిపై సరైన విచారణ లేకుండానే జైలుపాలు అవుతున్నారు’ అని ఓవార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమర్త్యసేన్‌ ఘాటుగా విమర్శించారు. కన్హయ్య కుమార్, శేహ్లా రషీద్‌, ఉమర్‌ ఖాలీద్‌ వంటి యువ ఉద్యమకారులను శత్రువులుగా చిత్రీకరించే బదులు.. పేదప్రజల పక్షాన నిలబడుతోన్న ఇలాంటి యువనేతలకు శాంతియుత మార్గంలో పోరాడేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరముందని అమర్త్యసేన్‌ అభిప్రాయపడ్డారు. ఇక కరోనా మహమ్మారిని భారత్ ఎదుర్కొంటోన్న తీరుపై స్పందించిన అమర్త్యసేన్‌.. భౌతిక దూరాన్ని పాటించడంలో భారత్‌ సరైన మార్గంలోనే నడుస్తోందని.. కానీ, ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లాక్‌డౌన్‌ విధించడంలో తప్పు దారిలో వెళ్లిందని అన్నారు.

తిప్పికొట్టిన భాజపా..

అమర్త్యసేన్‌ చేసిన ఆరోపణలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. అవి నిరాధారమైనవి పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ స్పష్టంచేశారు. అసహనం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే పశ్చిమ బెంగాల్ వచ్చి చూడాలని సూచించారు. ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే కార్యక్రమాలకు ఇక్కడి ప్రభుత్వం ఎలా అడ్డుతగులుతుందో తెలుసుకోవాలని దిలీప్‌ ఘోష్‌ పేర్కొన్నారు. ఇక అమర్త్యసేన్‌ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా జనరల్‌ సెక్రటరీ కైలాష్‌ విజయ్‌ వర్జియా, రైతులతో చర్చలు జరిపేందుకు ఉన్న అన్ని అవకాశాలను ప్రభుత్వం కల్పించిందని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..
రైతులకోసం నిరాహార దీక్ష చేస్తా: అన్నా హజారే
భూ వివాదంలో అమర్త్యసేన్‌కు మమత అండ

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts