China: వందేళ్ల పిడికిలి!

కారణం- చైనా కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న క్షణం!

Updated : 01 Jul 2021 08:29 IST

చైనా కమ్యూనిస్టు పార్టీ శత వసంతోత్సవం

జులై-1....మరోమారు ప్రపంచం దృష్టి చైనాపై పడుతున్న రోజిది!
కారణం- చైనా కమ్యూనిస్టు పార్టీ శతవసంతాలు పూర్తి చేసుకుంటున్న క్షణం!
ప్రపంచమంతా కమ్యూనిజం ప్రభతగ్గినా చైనాలో మాత్రం ఎలా వెలుగుతోంది?
140 కోట్ల ప్రజల్ని చైనా కమ్యూనిస్టులెలా ఏలుతున్నారు?
వందేళ్ల చైనా కమ్యూనిస్టుల ప్రస్థానాన్ని ఓసారి చూస్తే....

 

చైనా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్లటానికి ప్రధాన కారణం- రైతులు, భూపంపిణీ. 1911 నుంచి 1945 మధ్య చైనా విప్లవాత్మక సంఘటనల్ని చూసింది. భూస్వాములపై పోరాటం, చైంగ్‌కైషేక్‌ సారథ్యంలోని నేషనలిస్టులు, మావో జెడాంగ్‌ సారథ్యంలోని కమ్యూనిస్టుల మధ్య అంతర్యుద్ధం, జపాన్‌ దాడులు... ఇలా నిరంతర పోరాటాలతో అతలాకుతలమైంది. ఈ పోరులో అంతిమంగా తక్కువ బలగమున్నా మావో సారథ్యంలోని కమ్యూనిస్టులు విజయం సాధించారు. కారణం- రెండో ప్రపంచయుద్ధంలో జపాన్‌ ఓడిపోయి బలహీనమవటం, చైంగ్‌ కై షేక్‌ సారథ్యంలోని నేషనలిస్టుల సేనల్లో అంకితభావం లేకపోవటం, ఇదే సమయంలో భూస్వాములపై దాడులు చేసి భూమిని రైతులకు పంచుతూ కమ్యూనిస్టులు ప్రజలకు దగ్గరయ్యారు!

సోవియట్‌ నీడ వీడి

అలా 1949లో అధికారాన్ని చేపట్టిన మావో క్రమంగా దేశాన్ని కమ్యూనిస్టుల బలగంగా మార్చారు. ఇందుకు తమ గురువు సోవియట్‌ యూనియన్‌ మద్దతు తీసుకున్నారు. కానీ ఆ అనుకరణను తొలి మెట్టులోనే ఆపేసింది చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ).  తనదైన కమ్యూనిజాన్ని సృష్టించుకుంది. సామ్యవాదానికి తనదైన నిర్వచనమిచ్చుకుంది! ఈ క్రమంలో ఉక్కుపిడికిలితో బలాన్ని, బలగాల్ని పెంచుకుంది. అంతకుముందు ఏ భూమినైతే భూస్వాముల నుంచి లాక్కొని రైతులకు పంచిపెట్టారో... అధికారంలోకి రాగానే ఆ భూమినంతా లాక్కొని ప్రభుత్వం చేతుల్లోకి పరోక్షంగా పార్టీ చేతుల్లోకి తెచ్చుకోవటం విశేషం! గ్రేట్‌లీప్‌ ఫార్వర్డ్‌ సాంస్కృతిక విప్లవం పేరిట మావో తీసుకున్న నిర్ణయాలు... దేశంలో కనీవినీ ఎరగని క్షామాన్ని సృషించి కోట్ల మంది మరణానికి కారణమయ్యాయి. మావో మరణించగానే... మార్కెట్‌ శక్తులకు తలుపులు తెరిచి... సరికొత్త కమ్యూనిజాన్ని ఆవిష్కరించారు.

మార్క్సిజం ప్రకారం- ఆర్థికవ్యవస్థే అన్నిరకాల అభివృద్ధికి మూలం! కాబట్టి ఆర్థికాభివృద్ధి సాధించినంతకాలం సమాజం మద్దతుంటుంది. ఇది నమ్మిన చైనా కమ్యూనిస్టు పార్టీ ఆ ఆర్థికాభివృద్ధి సాధనకు కమ్యూనిస్టు సిద్ధాంతాలను సైతం తాకట్టుపెట్టేందుకు వెనకాడలేదు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగవటంతో ఎర్రజెండా పిడికిలి వందేళ్ళయినా సడలటం లేదు. చైనా ఇంతగా పట్టు సంపాదించటానికి కారణాలేంటని చూస్తే చైనా కమ్యూనిస్టు పార్టీ పనితీరేంటో అర్థమవుతుంది!

నిర్దాక్షిణ్యత

చిన్నపామునైనా పెద్ద కర్రతో కొట్టడం చైనా కమ్యూనిస్టు పార్టీ నైజం! ఎంత చిన్న వ్యతిరేకతనైనా నిర్దాక్షిణ్యంగా అణచివేయటంలో, నోరు నొక్కేయటంలో సీపీపీ వెనకాడదు. 1989లోతియానన్మెన్‌ స్క్వేర్‌లో లక్షలమంది తమ విద్యార్థులు, యువతరంపై నిర్ధాక్షిణ్యంగా బుల్లెట్ల వర్షం కురిపించింది... యుద్ధట్యాంకులను నడిపించింది. దేశంలో మళ్లీ ఎవ్వరూ ప్రజాస్వామ్యం అని అనటానికి కూడా భయపడేలా చేసింది. పార్టీ అధినాయకత్వాన్ని ధిక్కరిస్తున్నట్లు అనిపించినా, పార్టీ ప్రయోజనాలకు భిన్నంగా ఉన్నట్లనిపించినా ఎంతటి ఒప్పందమైనా, ఎంతటి కంపెనీనైనా, ఎంతటి దేశాన్నైనా వదలుకునేందుకు సిద్ధంగా ఉంటుంది. ... కోట్లకు పడగలెత్తిన ప్రముఖ వ్యాపారవేత్త అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌ మా మూడునెలల పాటు గాయబ్‌ కావటం సీపీసీ పనితీరుకు తాజా ఉదాహరణ. ఏమాత్రం అసంతృప్తినైనా చైనా ఇట్టే పట్టేస్తుంది. మొక్కగానే నొక్కేస్తుంది. చైనా వీథులన్నింటా... కెమెరాలు, ముఖాల్ని గుర్తించే సాఫ్ట్‌వేర్లు నిండి ఉన్నాయి. సోషల్‌ మీడియా రాతలపై అనుక్షణం నిఘా ఉంటుంది. ఏమాత్రం గీత దాటినా ‘మాయమై’పోతారు.

సిద్ధాంత రాద్ధాంతం లేదు

కమ్యూనిస్టులంటే తాము పట్టిన కుందేలుకు మూడుకాళ్లే అన్నట్లు సిద్ధాంతాన్ని బలంగా పట్టుకొని కూర్చుంటారనుకుంటారు చాలామంది. కానీ చైనా కమ్యూనిస్టు పార్టీ రూటే సెపరేటు. మార్క్స్‌ దగ్గరే ఆగిపోలేదు! ఒక సిద్ధాంతానికే మడికట్టుకొని కూర్చోలేదు. తమ జాతిపితగా భావించే మావో సిద్ధాంతాలను సైతం అటకెక్కించి, ఏకంగా కేపిటలిస్టు విధానాల్ని కూడా కౌగిలించుకోవటానికి సిద్ధమయ్యిందంటే సీపీసీ ‘విశాల హృదయం’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మావో బతికున్నన్నాళ్లు బ్రహ్మరథం పట్టిన చైనా... 1976లో మరణించగానే ఆయన నమ్మిన పీపుల్స్‌ కమ్యూన్స్‌ల సిద్ధాంతాన్ని మూలనపడేసింది. తర్వాత వచ్చిన కొత్త అధ్యక్షుడు డెంగ్‌ జియావో పెంగ్‌... చైనా గ్రామీణప్రాంతాల్లోకి సైతం మార్కెట్‌ శక్తులకు తలుపులు బార్లా తెరిచారు. కమ్యూనిస్టులు క్యాపిటలిజాన్ని అమెరికాకంటే ఆబగా కౌగిలించుకున్న క్షణమది! ఈ నిర్ణయం ఫలితంగా చైనాలో ప్రభుత్వరంగంలోని అనేక సంస్థలు మూతపడ్డాయి. చాలామంది ఉద్యోగాలు పోయాయి... కానీ చైనా ఆర్థికవ్యవస్థ మాత్రం ఉరకలెత్తింది! ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ గతంలో వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివారు. మావోను మించి తన ముద్రను వేయటానికి ప్రయత్నిస్తున్నారు. అవినీతిపై యుద్ధం పేరిట ఇంటింటా నిఘా... మీ ఇంటిపై మీ పక్కింటివాడి నిఘా పెట్టేశారు. ప్రైవేటు సంస్థల్లో కూడా పార్టీ కేడర్‌ను చొప్పించారు. రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంలా... ప్రపంచంలో చాలా దేశాల్ని పరోక్షంగా తమ చెప్పుచేతుల్లో ఉంచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు.

ఖాళీ ఉంచకుండా

ఇటు తమ పట్టును పెంచుకుంటూనే... తమకు ఎదురులేకుండా చూసుకుంటూనే... అటు ప్రజలకు కూడా ఫలాలందేలా... వారి కడుపులు చల్లబడేలా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ వచ్చింది చైనా కమ్యూనిస్టు నాయకత్వం. జనాభా పరంగా ప్రపంచంలో అత్యంత పెద్ద మార్కెట్‌ చైనా. అక్కడా అవినీతుంది... అక్కడా పేదరికముంది.... అక్కడా మార్కెట్‌ సృష్టించే అవలక్షణాలున్నాయి... అక్కడా ఆర్థిక అసమానతలున్నాయి... కూడుకు లేనివారున్నారు... కోట్లకు పడగలెత్తినవారున్నారు... వీటన్నింటి మధ్యే- తమ జీవితాలు మెరుగుపడుతున్న భావన అందరికీ కల్గించేలా ఎప్పటికప్పుడు పథకాలు, నిర్ణయాలు తీసుకుంటూ నడుపుకొస్తోంది సీపీసీ. గ్రామీణప్రాంతాల్లో పన్నులు రద్దు చేశారు... అందరికీ ఆరోగ్యం, పెన్షన్లు ఇచ్చారు. నిరుద్యోగాన్ని కట్టడి చేయటానికి... భారీ ప్రాజెక్టులు, పథకాలతో నిర్మాణాలు చేపట్టారు. అవసరం ఉన్నా లేకపోయినా చాలా పట్టణాలు నిర్మించారు. తద్వారా ప్రజల్ని ఖాళీ ఉంచకుండా పనికల్పించారు. ఇలా నిర్మించినవాటిలో చాలా పట్టణాలు ఖాళీగా ఉంటాయి. వాటిని ఘోస్ట్‌ సిటీస్‌ అని పిలుస్తుంటారు. అలాగే మానవ వనరుల్ని నిరంతరం పనుల్లో ఉంచుతూ మౌలిక సదుపాయాల్ని ప్రణాళికాబద్ధంగా పెంచుకుంటూ పోయారు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చైనా కంపెనీలు పని చేయని దేశం లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు వివిధ ఖండాల గుండా చైనా చేపట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్డు భారీ ప్రాజెక్టు కూడా ఇందులో భాగమే. అలా చైనీయులకు చేతినిండా పనిచ్చే కార్యక్రమాలు చేస్తునే ఉంటారు. ఉచిత చదువు, విదేశాల్లో చదువు, విదేశాల్లో పనులు... అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచేలా సీపీసీ జాగ్రత్తపడుతూ వస్తోంది.

బుర్రలు కడిగేస్తారు

ఇవన్నీ ఎలా ఉన్నా అసలైన స్వేచ్ఛ లేకుంటే ఏం లాభం? నిర్బంధాలను ఎన్నాళ్లు సహిస్తారనే ప్రశ్న ఉందయించవచ్చు. అక్కడే సీపీసీ తెలివిగా వ్యవహరిస్తుంది. ఇంత భారీ దేశంలో... చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనుంది కాబట్టి ఇవన్నీ సాధ్యమౌతున్నాయనీ లేదంటే దేశం అల్లకల్లోలమవుతుందనే భావనను అందరిలో నాటింది. నాటుతోంది. ప్రజాస్వామ్యం అందించే ప్రయోజనాలకు దీటుగానే సీపీసీ పాలనా ఇస్తోందనే భావన కల్గించింది. అందుకే దేశంపై, వ్యవస్థలపై సీపీసీ ఉడుంపట్టును చాలామంది సమర్థిస్తారు. చైనీయుల్లో జాతీయతా భావాన్ని అనునిత్యం రగిలిస్తుంటుంది కూడా. అంతర్గతంగా సమస్యలున్నప్పుడల్లా ఆ దృష్టి మళ్లించటానికి ఇరుగుపొరుగులతో ఘర్షణకు దిగటం సీపీసీ అనుసరిస్తున్న విధానాల్లో ఒకటిగా చెబుతారు. 1962లో భారత్‌తో యుద్ధం అలాంటిదే!

ఆచరణాత్మక వ్యవస్థలు

చైనా ఎదుగుదలలో అత్యంత కీలకమైంది అక్కడి కమ్యూనిస్టు పార్టీ తయారు చేసుకున్న రాజకీయ వ్యవస్థ. సిద్ధాంతాల మడికట్టుకోకుండా... ఆచరణ సాధ్యమైన వ్యవస్థల్ని రూపొందించుకోవటం; అవసరార్థం మారిపోవటం; నిరంతర ప్రయోగాలు, దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలు... ఈ వ్యవస్థలోని కీలకాంశాలు. ప్రజాస్వామ్య దేశాల్లో ప్రణాళికలు రచించి, చట్టాలు చేస్తే వాటిని సివిల్‌ సర్వెంట్లు, అధికార యంత్రాంగం అమలు చేస్తుంది. ఏదైనా చేయాలంటే పై నుంచి అనుమతిలేనిదే బ్యూరోక్రసీలో కుదరదు. చైనాలో... అంతా పార్టీ కేడర్‌ ఆధారంగా సాగుతుంది. లక్ష్యం చెబుతారు. కొన్ని నియమాలుంటాయి. గడువిస్తారు. కేడర్‌ ఆ పనిచేసేస్తుంది. మన దేశంలో ఏదైనా రాష్ట్రానికి వెళ్లి ఓ పరిశ్రమ పెట్టాలంటే సవాలక్ష అనుమతులు కావాలి. కానీ చైనాలో ఎక్కడైతే పరిశ్రమ పెట్టాలనుకుంటారో అక్కడి స్థానిక అధికారులు ఓకే అంటే చాలు.  దీర్ఘకాలిక రాజకీయ లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఉదాహరణకు... పారిశ్రామిక ఆధునికీకరణ; మౌలిక సదుపాయాల కల్పన. ఒకసారి అనుకుంటే... వాటికనుగుణంగా... వనరులను ప్రాధాన్య క్రమంలో వాడుకుంటూ వెళ్లిపోవటమే. అన్నింటికమించి... చైనా వ్యవస్థల్లో ఆసక్తికరమైంది- ప్రయోగశీలత. ఎక్కడికక్కడే ప్రయోగాలు చేస్తారు. వాటిలోని మంచిని ఇతర ప్రాంతాలకూ ఆచరణ సాధ్యమైనంత మేరకు విస్తరిస్తారు.

మావో... పక్కనే మాల్‌!

1949లో దేశంలో అధికార పగ్గాలు చేపట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ 1921లో ఆరంభమైంది. సోవియట్‌ బోల్షివిక్‌ విప్లవం స్ఫూర్తితో... షాంఘై లేన్‌హౌస్‌లో జరిగిన ఓ రహస్య సమావేశంలో చైనా కమ్యూనిస్టు పార్టీ పురుడుపోసుకుంది. రికార్డుల ప్రకారం 1921 జులై 23న పార్టీ తొలి కాంగ్రెస్‌ సమావేశం జరిగినట్లున్నా.. చైనా కమ్యూనిస్టు అధినేత మావోకు తొలి సమావేశం తేదీ సరిగ్గా గుర్తు లేక జులై 1గా ప్రకటించారు. అదే నిలిచిపోయింది. మావోతో పాటు 12 మంది విప్లవకారులు ఆ సమావేశానికి హాజరయ్యారు. ఆ సమావేశం జరిగిన ఇల్లునిప్పుడు మ్యూజియంగా మార్చారు. ప్రతి ఏటా లక్షలమంది పర్యాటకులు దీన్ని సందర్శించి వెళుతుంటారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు మూలమైన ఈ మ్యూజియం పక్కనే నిర్మించిన అత్యంత అధునాతన షాపింగ్‌ మాల్‌ ఆధునిక చైనా కమ్యూనిస్టు నేతల పోకడను చెప్పకనే చెబుతుంది.

మాయని మచ్చ

ఈ వందేళ్లలో చైనా కమ్యూనిస్టు పార్టీ చేసినవన్నీ ఒకెత్తు... రెండు దారుణాలు ఒకెత్తు! ఎంత చెరిపినా చెరగని మచ్చలవి! ఒకటి- గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌ పేరిట మావో చేసిన ఆకృత్యాలు! వాటి పరిణామాలు. రెండు- తియానన్మెన్‌ స్క్వేర్‌లో ప్రజాస్వామ్య వాదులపై మారణకాండ.

వ్యవసాయ, పారిశ్రామిక ప్రగతిని సమాంతరంగా ఉరకలు పెట్టించాలనే ఉద్దేశంతో మావో 1958-1960 దాకా గ్రేట్‌ లీప్‌ ఫార్వర్డ్‌ పిలుపునిచ్చారు. ప్రైవేటు వ్యవసాయాన్ని రద్దు చేశారు. ఇదే సమయంలో... పిట్టలను (ఎలుకలు, దోమలు, ఈగలు కూడా) చంపాలని ఆదేశించారు. ఎందుకంటే ధాన్యపు గింజలను తింటున్నాయనే ఉద్దేశంతో పిట్టల్ని చంపమన్నారు. ఇదో ఉద్యమంగా సాగింది. దీంతో... పిట్టల్లేకుండా పోయాయి. పిట్టలు కేవలం ధాన్యపు గింజలనే కాకుండా పంటలకు నష్టం కలిగించే ఇతర క్రిమికీటకాలను కూడా తింటాయి. కానీ మావో పిలుపుతో పిట్టలు లేకుండా పోవటంతో... తర్వాతి రోజుల్లో... దాని ప్రభావం కనిపించింది. పంటలన్నీ నాశనమై.... చైనాలో తీవ్రమైన క్షామం నెలకొంది. ప్రపంచంలోనే అత్యంత దారుణమైన క్షామంగా చెబుతారు దీన్ని! ఈ సమయంలో తిండికి లేక, కమ్యూనిస్టు ప్రభుత్వ కఠిన చర్యల కారణంగా సుమారు 4-5 కోట్ల మంది మరణించినట్లు అంచనా. ఇది దేశంలో అరాచకపరిస్థితులకు దారి తీయటంతో... మావో... ప్రజలందరి దృష్టిని మళ్లించేందుకు భారత్‌పై యుద్ధం (1962లో) ప్రకటించారనే వాదనా ఉంది. అంతేకాకుండా... ఆనాటి క్షామం కారణంగానే... చైనాలో ఏ ప్రాణినైనా తినే అలవాటు పెరిగిందంటారు.

విస్తరణ కాంక్ష 

చైనా తన ఎదుగుదలపై దృష్టిపెట్టిన తొలి వందేళ్లు బాగానే గడిచాయి. కానీ ఇప్పుడు చైనాలో కన్పిస్తున్నది విస్తరణాభిలాష. చైనా వ్యవస్థలన్నింటిలోనూ విస్తరణాభిలాష అణువణువునా కనిపిస్తుంది. ఆర్థికమైనా, రాజకీయమైనా... రంగం ఏదైనా విస్తరణ కాంక్ష కొట్టొచ్చినట్లుంటుంది. ప్రజల ఓటు లేకుండా 72 సంవత్సరాలుగా ప్రపంచంలో జనాభా పరంగా అతిపెద్ద దేశాన్ని ఏలుతున్న చైనా కమ్యూనిస్టు పార్టీ ఇప్పుడు అనేక దేశాలను కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావితం చేస్తోంది! తన సారథ్యంలో ఆధునిక వలస రాజ్యాలను నిర్మిస్తోంది! అసహాయత, అశక్తతలో ప్రస్తుతానికి తలొగ్గినా మునుముందు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేం. అమెరికా సహా చాలా దేశాలు చైనాను కట్టడి చేయటానికి అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాయి. ఇంటాబయటా పొంచి ఉన్న సవాళ్లను ఎలా ఎదుర్కొంటున్నదానిపైనే సీపీసీ రెండో సెంచరీ ప్రస్థానం ఆధారపడి ఉంటుంది. పిడికిలి తెరిస్తే ఏమవుతుందనేది అప్పుడు తెలుస్తుంది.

రెండో సెంచరీ ఎన్నాళ్లు?

మొత్తానికి బిగించిన పిడికిలికి తోడు ప్రజల ఆర్థిక స్థితిగతుల్ని పెంచుతూ, ప్రపంచశక్తిగా దేశాన్ని మల్చటం చైనాకమ్యూనిస్టు పార్టీకి కలసి వస్తోంది. ఇవన్నీ ఎన్నేళ్లు చైనాను విజయపథంలో నడిపిస్తాయనేది ఆసక్తికరం. ఆర్థికశక్తిగా ఎదిగినా చైనాలో అంతా సవ్యంగా ఏమీ లేదు. అదేమీ స్వర్గం కాదు. పేదరికం ఉంది, నిరుద్యోగముంది అసమానతలున్నాయి. వీటికితోడు కొన్ని రాష్ట్రాల్లో ముస్లింలపై ఊచకోత సాగుతోంది. మానవ హక్కుల ఉల్లంఘనలున్నాయి. వీటన్నింటినీ తన ఉక్కుపిడికిలితో బయటకు రాకుండా సీపీసీ ఆపగలుగుతోంది. అయితే తర్వాతి సమర్థ తరానికి అధికారాన్ని అందిస్తూ పాతతరం ఎప్పటికప్పుడు పక్కకు తప్పుకుంది కాబట్టి సీపీసీ ఇన్నాళ్లూ సఫలమవుతూ వచ్చింది. కానీ ప్రస్తుత అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ తానే బతికున్నంతకాలం అధికారంలో ఉండేలా రాజ్యాంగాన్ని సవరించుకున్నారు! పార్టీపైనా, ప్రభుత్వంపైనా పూర్తి పట్టు బిగించి... తన ప్రత్యర్థులే లేకుండా చేయాలనుకుంటున్నారు. వ్యవస్థలు క్రమంగా కేంద్రీకృత పద్ధతిలోకి మారుతున్నాయి. పైనుంచి అనుమతుంటేనే ముందుకెళ్లాలనే ధోరణి ప్రబలుతోంది. మరి మార్పు స్థిరమని నమ్ముతూ గతిశీలంగా ప్రయాణిస్తున్న చైనా కమ్యూనిస్టు పార్టీ- ఈ నయా ‘రాజరిక’ ధోరణిని ఎంత మేరకు సహిస్తుందనేది కీలకం!

- ఈనాడు ప్రత్యేకవిభాగం  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని