రష్యా టీకా: తాజా ఫలితాల్లోనూ 91శాతం సమర్థత

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ తాజా ఫలితాల్లోనూ 91.4శాతం సమర్థత కలిగివున్నట్లు మరోసారి వెల్లడైంది.

Published : 14 Dec 2020 23:56 IST

వెల్లడించిన గమలేయా ఇన్‌స్టిట్యూట్‌

మాస్కో: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ తాజా ఫలితాల్లోనూ 91.4శాతం సమర్థత కలిగి ఉన్నట్లు మరోసారి వెల్లడైంది. మూడో దశ క్లినికల్‌ ప్రయోగాల్లో పాల్గొన్న వారిలో దాదాపు 22వేల మంది వాలంటీర్ల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ తాజా ప్రకటన విడుదల చేసింది.

స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ మొదటి డోసు ఇచ్చిన 21 రోజుల తర్వాత విశ్లేషణ జరపగా 91.4 శాతం సమర్థత కలిగి ఉన్నట్లు తేలింది. తాజాగా రెండు డోసులను తీసుకున్న 22,714 మంది వాలంటీర్ల సమాచారాన్ని 21 రోజుల తర్వాత విశ్లేషించారు. అనంతరం వీరిలో 78 మందికి వైరస్‌ సోకినట్లు వెల్లడైంది. అయితే, వైరస్‌ సోకిన 78 మందిలో 62 మంది ప్లెసిబో గ్రూపునకు చెందిన వారేనని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ వెల్లడించింది. తాజా ఫలితాల ద్వారా తమ వ్యాక్సిన్‌ 90 శాతానికి పైగా సమర్థత కలిగి ఉన్న విషయాన్ని రుజువు చేస్తోందని స్పుత్నిక్‌-వి రూపకర్తలు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో వ్యాక్సిన్‌ 100 శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ఇప్పటికే స్పుత్నిక్‌ స్పష్టంచేసింది. విశ్లేషణలో భాగంగా వాలంటీర్లలో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురికాగా.. వారిలో అందరూ ప్లెసిబో గ్రూపునకు చెందిన వారేనని స్పష్టంచేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని పేర్కొంది. మూడోదశ క్లినికల్‌ ప్రయోగాల నిబంధనల ప్రకారం, వ్యాక్సిన్‌ సమర్థతపై మధ్యంతర ఫలితాలను మూడు దశల్లో లెక్కించినట్లు గమలేయా పేర్కొంది. వ్యాక్సిన్‌, ప్లెసిబో తీసుకున్న వారిలో 20 కేసులు నమోదైనపుడు ఒకసారి, 39 కేసులకు మరోసారి, 78 కేసులు నమోదైనప్పుడు వాటి సమర్థతను విశ్లేషించామని వెల్లడించింది. మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా కేవలం రష్యాలోనే 26వేల మందికి ప్రయోగ వ్యాక్సిన్‌ అందించారు.  

ఇవీ చదవండి..
వచ్చే 4-6 నెలలు కరోనా మరింత తీవ్రం-బిల్‌గేట్స్‌
జర్మనీలో మళ్లీ లాక్‌డౌన్‌

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని