దిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలివ్వండి: సుప్రీం

హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంట వ్యర్థాల దహనాల నివారణ పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్ బి లోకూర్ నేతృత్వంలో అత్యు్న్నత న్యాయయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి అవసరమైన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల దహనాలు...

Published : 16 Oct 2020 19:18 IST

పంటల వ్యర్థాల దహనంపై కమిటీ ఏర్పాటు

దిల్లీ: హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. పంట వ్యర్థాల దహనాల నివారణ పర్యవేక్షణకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ మదన్ బి లోకూర్ నేతృత్వంలో అత్యున్నత న్యాయయస్థానం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి అవసరమైన సహకారం అందించాలని మూడు రాష్ట్రాల సీఎస్‌లకు ఆదేశాలు జారీ చేసింది. పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్‌ అండ్ గైడ్స్ బృందాల వినియోగం సరైనదేనని సుప్రీం అభిప్రాయపడింది. 15 రోజులకోసారి లేదా అవసరమైనప్పుడు కమిటీ నివేదిక అందించాలని సుప్రీం కోర్టు కోరింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే మాట్లాడుతూ.. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చుకోగలగాలి అని వ్యాఖ్యానించారు. గాలి కాలుష్య కారక పంటవ్యర్థాల దహనాలను నివారించడమే లక్ష్యంగా రాష్ట్రాలు పని చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది.

గత కొన్నేళ్లుగా దిల్లీ పరిసరాల్లో గాలి కాలుష్యం కావడానికి చుట్టుపక్కలున్న హరియాణా, ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌లో పంటవ్యర్థాల దహనమే కారణమని.. దీనికి నివారణ చర్యలుతీసుకోవాల్సిందిగా సుప్రీంలో పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కమిటీని వేయడాన్ని కేంద్రం వ్యతిరేకించింది. ఇప్పటికే ఈ అంశాన్ని ఎన్విరాన్‌మెంటల్‌ పొల్యూషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ అథారిటీ (ఈపీసీఏ) పరిశీలిస్తోందని కోర్టుకు తెలిపింది. అమికస్‌ క్యూరీని కూడా ఏర్పాటు చేసినట్లు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకు వివరించారు. మరోవైపు దిల్లీలో వాయు కాలుష్యానికి తమకు ఎలాంటి సంబంధం లేదని, వాతావరణ కాలుష్యాన్ని గుర్తించడానికి రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నామని పంజాబ్‌ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

అయితే ఈ మూడు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడం వల్లే దిల్లీలో వాయుకాలుష్యం పెరిగిపోతోందని గ్రేడెడ్‌ రెస్పాన్స్‌ యాక్షన్‌ ప్లాన్‌ (జీఆర్‌ఏపీ) తన నివేదికలో పేర్కొంది. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా విద్యుత్‌ జనరేట్ల వాడకాన్ని కూడా దిల్లీ ప్రభుత్వం నిషేధించింది. వాయు కాలుష్యంతో దిల్లీ ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతుండటంతో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సచివాలయ ప్రాంగణంలో ‘ గ్రీన్‌ వార్‌ రూం’ను ప్రారంభించారు. ఇక్కడ దిల్లీ పరిసర రాష్ట్రాల్లో జరుగుతున్న పంటల వ్యర్ధాల దహన ప్రక్రియను శాటిలైట్‌ ద్వారా పరిశీలించే అవకాశముంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని