మొహర్రం ర్యాలీలకు సుప్రీం ‘నో’

మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే బహిరంగ ఊరేగింపులకు సుప్రీం అనుమతి నిరాకరించింది. అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశమున్నందున అనుమతివ్వలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది...

Published : 27 Aug 2020 18:19 IST

దిల్లీ: మొహర్రం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించే బహిరంగ ఊరేగింపులకు సుప్రీం అనుమతి నిరాకరించింది. అధిక సంఖ్యలో ప్రజలు గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశమున్నందున అనుమతివ్వలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం తేల్చి చెప్పింది. మొహర్రం సందర్భంగా ఈ నెల 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సయ్యద్‌ కబే జావేద్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తాజాగా తీర్పు వెలువరించింది.

ఇటీవల చేపట్టిన పూరీ రథయాత్రకు అనుతులిచ్చినట్లు విచారణ సమయంలో పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన అత్యున్నత ధర్మాసనం పూరీ రథయాత్ర ఒక ప్రాంతానికి మాత్రమే చెందిందని, అంతేకాకుండా యాత్రను ఓ ప్రత్యేకమైన మార్గంలోనే నిర్వహిస్తారని చెప్పింది.  అలాంటి సందర్భంలో కరోనా వ్యాప్తిని తగ్గించే అవకాశముందని, కానీ, దేశవ్యాప్తంగా ర్యాలీలు చేపడితే ఒకే సామాజిక వర్గానికి చెందిన వారంతా గుమిగూడి కరోనా వ్యాప్తికి కారకులవుతారని అభిప్రాయడింది. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అనుమతులివ్వలేమని తేల్చిచెప్పింది. కనీసం, లఖ్‌నవూలోనైనా ర్యాలీల నిర్వహణకు అనుమతివ్వాలని పిటిషనర్‌ కోరగా.. అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం సూచించింది.

మరోవైపు హైదరాబాద్‌లోనూ మొహర్రం బహిరంగ ఊరేగింపులకు తెలంగాణ హైకోర్టు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే మసీదు ఆవరణలో నిర్వహించుకునే కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులకు సూచించింది. మొహర్రం సందర్భంగా ఏనుగులపై ఊరేగింపునకు అనుమతి మంజూరు చేసేలా హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఫాతిమా సేవాదళ్‌ సొసైటీ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ బుధవారం విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని