సుశాంత్ ఎప్పుడూ అలా చెప్పుకోలేదు: శివసేన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ రగడకు కారణమయింది. తాజాగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడంపై శివసేన...

Updated : 09 Aug 2020 19:55 IST

ముంబయి: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ ఆత్మహత్య కేసు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ రగడకు కారణమయింది. తాజాగా ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయడంపై శివసేన పార్టీ నితీష్ కుమార్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసింది. ఈ మేరకు శివసేన అనుబంధ పత్రిక సామ్నాలో ఒక వ్యాసం ప్రచురించారు. సుశాంత్ సింగ్ కేసులో బిహార్‌ ప్రభుత్వం కలుగజేసుకోకుండా ఉండాల్సిందని పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా సుశాంత్ ముంబయిలోనే ఉంటున్నాడని, ముంబయి అతనికి ఎంతో పేరు ప్రఖ్యాతులను ఇచ్చిందని వ్యాసంలో పేర్కొన్నారు. సుశాంత్ కష్టకాలంలో బిహార్‌ అతనికి అండగా లేదని విమర్శించారు. ఇప్పటి వరకు సుశాంత్ తన బిహార్‌ మూలలను ఎక్కడా ప్రస్తావించలేదని పేర్కొన్నారు.

ఈ కేసును సీబీఐతో దర్యాప్తు చేయించడం మహారాష్ట్ర ప్రభుత్వ స్వయంప్రతిపత్తిపై జరిగిన దాడిగా శివసేన అభివర్ణించింది. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ వ్యవహారంలో జోక్య చేసుకోవడం ద్వారా ముంబయి పోలీసులను అవమానించారని పేర్కొన్నారు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు సీబీఐని నిషేధించాయని, పశ్చిమబెంగాల్‌లో శారదా స్కాం వ్యవహారంలో సీబీఐ జోక్యాన్ని నిరసిస్తూ ప్రజలు వీధుల్లో ఆందోళనలు చేపట్టారని అన్నారు. అలానే సుశాంత్ కేసును ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నాయని విమర్శించారు. సుశాంత్ కేసును, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు ముడిపెట్టడం ప్రతిపక్షాల కుట్రని అని వ్యాసంలో పేర్కొన్నారు.

సుశాంత్ ఆత్మహత్యకు కారణం రియా చక్రవర్తి, ఆమె కుటుంబసభ్యులేనని ఆరోపిస్తూ ఆయన తండ్రి పట్నా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దాని ఆధారంగా కేసు దర్యాప్తు చేసేందుకు ముంబయి వెళ్లిన బిహార్‌ పోలీసులకు అడ్డంకులు ఎదురుకావడంతో, కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయంగా కూడా ఈ విషయం పెను దుమారం రేపింది. ఈ తరుణంలో కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రియాతో సహా మొత్తం ఆరుగురిపై సీబీఐ ఎఫ్ఐఆర్‌ నమోదు చేసింది.  మరోవైపు ఈ కేసులో మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఇప్పటికే రియా చక్రవర్తితో పాటు పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని