Updated : 13 Sep 2021 11:29 IST

Taliban: ఇంద్రభవనంలో తాలిబన్లు.. అధీనంలోకి అఫ్గాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు దోస్తమ్‌ నివాసం!

కాబుల్‌: విశాలమైన గదులు.. సుతిమెత్తని పరుపులు.. ఇంట్లోనే ఈతకొలను.. వ్యాయామశాల, విదేశీ మద్యం సీసాలతో నిండిన బార్‌.. వీటన్నింటితో కూడిన ఇంద్రభవనం లాంటి ఓ ఇల్లు అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల చేతికి చిక్కింది. ఆధునిక సదుపాయాలతో ఉన్న ఆ నివాసంలో ఇప్పుడు దాదాపు 150 మంది ముఠా సభ్యులు ఉంటున్నారు. సర్వాంగ సుందరంగా ఉన్న ఇంటిని చూసి అచ్చెరువొందుతున్నారు. ఇంతకీ ఆ నివాసం ఎవరిదో తెలుసా..? అఫ్గానిస్థాన్‌ మాజీ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రషీద్‌ దోస్తమ్‌ది. దోస్తమ్‌ (67) తాలిబన్లకు బద్ధ శత్రువు. గతంలో పారాట్రూపర్‌గా, కమ్యూనిస్టు కమాండర్‌గా, దేశానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 2001లో రెండు వేల మందికి పైగా తాలిబన్‌ ముఠా సభ్యులను హతమార్చినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. కంటెయినర్లలో బంధించి ఎడారిలో వదిలేయడంతో.. ఊపిరాడక వారంతా మరణించినట్లు చెబుతుంటారు. ఇటీవల తాలిబన్లు విజృంభించాక ప్రాణభయంతో దోస్తమ్‌ అఫ్గాన్‌ను వీడి ఉజ్బెకిస్థాన్‌కు పరారయ్యారు. దీంతో కాబుల్‌లో సకల వసతులతో ఆయన నిర్మించుకున్న ఇంటిని తాలిబన్లు గత నెల 15న స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్లలోని శక్తిమంతమైన కమాండర్లలో ఒకరైన కారీ సలాహుద్దీన్‌ అయౌబీ తన భద్రత సిబ్బందితో కలిసి అందులో ఉంటున్నారు. ఇన్నాళ్లూ కొండలు, లోయల్లో నివసించిన.. ముఠా సభ్యులు ఆ ఇంట్లోని హంగులను ఆశ్చర్యంగా చూస్తున్న ఫొటోలు తాజాగా బయటికొచ్చాయి. అయితే- తమ ముఠా సభ్యులు ఆ భవనంలోని విలాసాలకు అలవాటు పడబోరని అయౌబీ చెప్పారు.

అఫ్గాన్‌లోనే అహ్మద్‌ మసూద్‌! 

అఫ్గానిస్థాన్‌లోని పంజ్‌షేర్‌ బలగాల నాయకుడు అహ్మద్‌ మసూద్‌ దేశం విడిచి వెళ్లారంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని ఇరాన్‌ అధికారిక వార్తాసంస్థ ‘ఫార్స్‌ న్యూస్‌’ ఓ కథనంలో తెలిపింది. ఆయన అఫ్గాన్‌లోనే ఓ సురక్షిత ప్రదేశంలో ఉన్నారని స్పష్టం చేసింది. అక్కడి నుంచే పంజ్‌షేర్‌లోనే ‘నేషనల్‌ రెసిస్టెన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌)’ బలగాలతో సంబంధాలు కొనసాగిస్తున్నారని వెల్లడించింది. మరోవైపు- పంజ్‌షేర్‌లో పరిస్థితులపై అహ్మద్‌ మసూద్‌ సన్నిహితుడు ఖాసీ మహమ్మదీ మాట్లాడుతూ.. ప్రావిన్సులో 70 శాతం రహదారులు తాలిబన్ల అధీనంలోకి వెళ్లాయన్నారు. కీలకమైన లోయలు మాత్రం ఇప్పటికీ ఎన్‌ఆర్‌ఎఫ్‌ బలగాల అధీనంలోనే ఉన్నాయని చెప్పారు.  

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని