
సినీ నటి, ఎంపీ నుస్రత్‌కు బెదిరింపులు
కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీనటి నుస్రత్ జహాన్‌కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. దుర్గామాత వేషధారణలో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఆమెను చంపేస్తామంటూ సామాజిక మాధ్యమాల వేదికగా గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆమె ఓ అడ్వర్టైజ్‌మెంట్ కోసం దుర్గామాత వేషధారణలో వస్త్రాలు ధరించి, చేతిలో త్రిశూలం పట్టుకున్న ఓ ఫొటోను సెప్టెంబర్ 17న ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు.
మరోవైపు, ఈ నెల 27న ఆమె ఓ సినిమా షూటింగ్ కోసం లండన్‌కు వెళ్లడంతో నుస్రత్ కార్యాలయ సిబ్బంది ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వంతో పాటు కేంద్ర విదేశాంగ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఆమె సన్నిహితులు ఒకరు తెలిపారు. అలాగే, నుస్రత్ భద్రత, అదనపు రక్షణ కల్పించే అంశంపై లండన్‌లోని భారత రాయబార కార్యాలయంతో సమన్వయం చేస్తున్నట్టు తెలిపారు. నుస్రత్ ఎప్పుడూ లౌకిక, సమగ్ర దృక్పథంతో మాట్లాడతారని, ఇలాంటి ట్రోల్స్ ఆమెను ఆపలేవని పేర్కొన్నారు.