ఆ విద్యార్థులకు 7.5శాతం రిజర్వేషన్‌

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రాధాన్యత కల్పించే రిజర్వేషన్ బిల్లుకు తమిళనాడు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

Published : 30 Oct 2020 23:49 IST

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రాధాన్యత
ఆమోదం తెలిపిన తమిళనాడు గవర్నర్‌

చెన్నై: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులకు వైద్యవిద్యలో ప్రాధాన్యం కల్పించే రిజర్వేషన్ బిల్లుకు తమిళనాడు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుకు గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌ అంగీకరించినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థులు.. నీట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులై, వైద్య విద్యనభ్యసించాలనుకునే వారికి 7.5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పళనిస్వామి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని తమిళనాడు మంత్రివర్గం కూడా ఆమోదించింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలుచేయాలని పళనిస్వామి సర్కార్‌ సంకల్పించింది. అయితే, ఈ బిల్లుకు తొలుత గవర్నర్‌ ఆమోదం లభించలేదు. దీన్ని ఎలాగైనా అమలుచేయాలనే ఉద్దేశంతో తాజాగా ప్రత్యేక జీవో కూడా తీసుకొచ్చింది. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే గవర్నర్‌ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు.

ఈ బిల్లు విషయంలో గవర్నర్‌ కావాలనే ఆలస్యం చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. బిల్లును ఆమోదించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కూడా ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైంది. మరోవైపు నీట్‌ కౌన్సిలింగ్‌ కూడా దగ్గర పడుతుండడంతో గవర్నర్‌ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై న్యాయపరమైన సలహాలు తీసుకున్న వెంటనే బిల్లుకు ఆమోదం తెలిపినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. ఈ చట్టం ద్వారా 6 నుంచి 12వ తరగతి వరకు అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న, నీట్‌లో ఉత్తీర్ణులైన వారికి 7.5శాతం రిజర్వేషన్‌ లభించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని