8 సెకన్లు క్వారంటైన్‌ నుంచి వచ్చి, చిక్కాడు

కేవలం ఎనిమిది సెకన్ల పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లఘించినందుకు ఓ వ్యక్తిపై తైవాన్ ప్రభుత్వం 3,500 డాలర్ల జరిమానా విధించింది.

Published : 09 Dec 2020 01:59 IST

3,500 డాలర్ల జరిమానా విధించిన తైవాన్ ప్రభుత్వం

తైపీ: కేవలం ఎనిమిది సెకన్ల పాటు క్వారంటైన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తిపై తైవాన్ ప్రభుత్వం 3,500 డాలర్ల జరిమానా విధించింది. అంటే అక్షరాల 2,61,036 రూపాయలు. అది కూడా ఫిలిప్పైన్ నుంచి వచ్చిన ఓ వలస కార్మికుడిపై. వివరాల్లోకి వెళ్తే..

23 మిలియన్ల జనాభా కలిగిన తైవాన్‌లో ఇప్పటివరకు 700 కరోనా వైరస్ కేసులే వెలుగుచూశాయి. అంటే ఆ దేశం కరోనా నిబంధనలను ఎంత కట్టుదిట్టంగా అమలు చేస్తుందో అర్థమవుతోంది. అలా అని కఠిన లాక్‌డౌన్‌ను విధించిన దాఖలాలు మాత్రం లేవు. క్వారంటైన్ నిబంధనలు, మాస్‌ టెస్టింగ్, త్వరితగతిన కాంటాక్ట్‌లను గుర్తించడం వంటి చర్యలపై దృష్టిపెట్టి, అలసత్వం లేకుండా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన వలస కార్మికుడికి 14 రోజుల క్వారంటైన్‌ను విధించింది. కావోసీంగ్‌లోని హోటల్‌ గదిని అతడికి కేటాయించింది. అయితే ఆ వ్యక్తి ఎనిమిది సెకన్ల పాటు గది బయటకు వచ్చి, నిల్చున్నట్లు సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు అధికారుల కంట పడింది. పక్కగదిలో ఉన్న  తన స్నేహితుడికి ఓ వస్తువును అందించే ఉద్దేశంతో అతడు బయటకు వచ్చినట్లు, తన తోటి వ్యక్తి దాన్ని తీసుకునేందుకు వీలుగా అక్కడ పెట్టివెళ్లినట్లు దానిలో రికార్డైంది. అయితే అనుమతి లేకుండా క్వారంటైన్ సమయంలో బయటకు రావడం, నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని భావించిన అధికారులు ఆయనపై 3,500 డాలర్లు జరిమానా విధించారు. అయితే ఆ వస్తువును తీసుకోవాలంటే అతడి స్నేహితుడు కూడా బయటకు రావాల్సింది ఉంది కాబట్టి, అతడిపై ఈ చర్యే తీసుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. ఈ తీరుగా ఆ దేశం వ్యవహరిస్తుంది కాబట్టే అక్కడ గత ఎనిమిది నెలలుగా కొత్త కేసులు వెలుగుచూడలేదు. కాకపోతే, విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతో కేసులు పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని