తాజ్‌ వీక్షణ నేటి నుంచే..

ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది.

Updated : 21 Sep 2020 11:24 IST

రోజుకు 5,000 మందికి మాత్రమే అనుమతి

దిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత కట్టడం తాజ్‌మహల్‌ సోమవారం నుంచి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. కరోనా వైరస్‌ ప్రభావం ఈ పర్యాటక స్థలంపై కూడా పడటంతో, మార్చి 17న మూసివేశారు. కాగా, ఇప్పటి వరకు 160 టికెట్లు బుక్‌ అయ్యాయని, భారత్‌లో ఉంటున్న తైవాన్‌ పర్యాటకుడు మొదటి సందర్శకుడని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించారు. 

భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) అధికారులు మాట్లాడుతూ..‘ఆరు నెలలుగా సందర్శకులకు అనుమతి లేకున్నా, తాజ్‌ మహల్‌ నిర్వహణను కొనసాగించాం. సందర్శనకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో..కొవిడ్ కట్టడి చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయనున్నాం. దానిలో భాగంగా ప్రతి పర్యాటకుడి ఉష్ణోగ్రతను పరిశీలించడంతో పాటు శానిటైజర్‌ అందించనున్నాం. అలాగే రెండు స్లాట్లుగా మొత్తం 5,000 మందిని అనుమతించనున్నాం. ఒక్కోస్లాటుకు గరిష్టంగా 2,500 మందికి అనుమతి ఉంటుంది’ అని వెల్లడించారు. అలాగే ఆన్‌లైన్‌, కోడ్ స్కానింగ్ ద్వారానే టికెట్లు కోనుగోలు చేయాల్సి ఉంటుందని, అందుకోసం ఏఎస్ఐ వెబ్‌సైట్‌, మొబైల్ యాప్‌ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. తక్షణ వైద్య సేవల నిమిత్తం అంబులెన్స్‌ సేవలను సిద్ధంగా ఉంచామని వెల్లడించారు. 

అయితే, ఇంత ఎక్కువ కాలం తాజ్‌మహల్‌ను మూసివేసిన సందర్భాలు లేవని పర్యాటక రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు. అలాగే అన్నీ సజావుగా సాగేలా ఏఎస్‌ఐ అధికారులు చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం కూడా అంతర్జాతీయ విమానాలు నడిపే అంశంపై యోచించాలని వారు కోరుతున్నారు. కరోనాతోనే సహజీవనం చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని