‘ఆర్టికల్‌370పై కాంగ్రెస్‌ తమ వైఖరి చెప్పాలి’

జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని తెలపాలంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఆర్టికల్‌370 పునరుద్ధరిస్తామంటూ ఎన్సీ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబాముఫ్తీలు

Published : 17 Nov 2020 01:49 IST

దిల్లీ‌: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని తెలపాలంటూ కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఆర్టికల్‌370 పునరుద్ధరిస్తామంటూ ఎన్సీ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా, పీడీపీ నాయకురాలు మెహబూబాముఫ్తీలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ మద్దతు పలుకుతోందా అని ప్రశ్నించారు. ఈ అంశంపై కాంగ్రెస్‌ దేశానికి తమ వైఖరిని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఈ మేరకు ప్రసాద్‌ సోమవారం ఓ మీడియా సమావేశంలో మాట్లాడారు. 

‘కాంగ్రెస్‌ పార్టీ జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరణను కోరుకుంటోందా? ఆ విషయంలో కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌, ముఫ్తీలు ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు పలుకుతోందా? ఆ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ వైఖరి  సోనియా, రాహుల్‌గాంధీలు దేశానికి స్పష్టంగా తెలియజేయాలి’ అంటూ ప్రసాద్‌ కాంగ్రెస్‌ నాయకులపై మండిపడ్డారు. అదేవిధంగా ఆర్టికల్‌ 370 విషయంలో ఫరూఖ్‌, ముఫ్తీలు చేసిన వ్యాఖ్యలు జాతీయ వ్యతిరేక కార్యకలాపాల పరిగణలోకి వస్తాయని ప్రసాద్‌ పేర్కొన్నారు. 

జమ్మూకశ్మీర్‌లో పలు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి ‘పీపుల్స్‌ అలయన్స్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేకహోదా కల్పించే ఆర్టికల్‌ 370 పునరుద్ధరించాలని కోరుతూ కూటమి తమ ఎజెండాను ప్రకటించింది. ఈ క్రమంలో ఎన్సీ నేత ఫరూఖ్‌ అబ్దుల్లా ప్రత్యేక హోదా పునరుద్ధరించేందుకు చైనా సాయం కోరతామనగా.. మరోవైపు ముఫ్తీ తాను జాతీయ పతాకాన్ని ఎగరవేయనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని