Covid: ప్లాసిబో ముందు అజిత్రోమైసిన్‌ దిగదుడుపే 

ఇళ్లలో ఉంటూ, కొవిడ్‌ చికిత్స పొందే వారికి ప్లాసిబో ఔషధం కంటే అజిత్రోమైసిన్‌ ఏమాత్రం

Updated : 20 Jul 2021 14:00 IST

 తాజా అధ్యయనంలో వెల్లడి

లాస్‌ ఏంజెలెస్‌: ఇళ్లలో ఉంటూ, కొవిడ్‌ చికిత్స పొందే వారికి ప్లాసిబో కంటే అజిత్రోమైసిన్‌ ఏమాత్రం ప్రభావవంతం కాదని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ యాంటీబయోటిక్‌ ఔషధం కారణంగా కొవిడ్‌ బాధితులు ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం ఏర్పడవచ్చని హెచ్చరించింది! కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయన వివరాలను అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పత్రిక అందించింది. ఇప్పటివరకూ ఆసుపత్రుల్లో కోలుకుంటున్న కొవిడ్‌ బాధితులకు అజిత్రోమైసిన్‌ ఇవ్వడంపై కొన్ని పరిశోధనలు జరిగాయి. అయితే తొలిసారిగా- ఇళ్లలో కోలుకుంటున్న మొత్తం 263 మంది మహమ్మారి బాధితుల ఆరోగ్య పరిస్థితిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తూ వచ్చారు. వీరిలో 171 మందికి 1.2 గ్రాముల అజిత్రోమైసిన్‌ సింగిల్‌ డోసు; 92 మందికి ప్లాసిబో మాత్రలను అందించారు. 14 రోజుల తర్వాత వీరిలో సగం మందికి నెగెటివ్‌ ఫలితం వచ్చింది. కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే, 21వ రోజు నాటికి అజిత్రోమైసిన్‌ తీసుకున్నవారిలో 5% మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ప్లాసిబో మాత్రలు వేసుకున్నవారిలో ఒక్కరు కూడా ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాలేదు.

‘‘ప్లాసిబోతో పోల్చితే సింగిల్‌ డోసు అజిత్రోమైసిన్‌ వల్ల కొవిడ్‌ బాధితులకు పెద్ద ఉపశమనం ఉండటం లేదని గుర్తించాం. ఆసుపత్రి వెలుపల చికిత్స పొందే కొవిడ్‌ బాధితులకు అజిత్రోమైసిన్‌ ఇవ్వడాన్ని అధ్యయనం సమర్థించడం లేదు. కరోనా బాధితులకు దీన్ని వీలైనంత త్వరగా ఇవ్వడం వల్ల అంతర్గత వాపులు తలెత్తవని మొదట భావించాం. కానీ, అలాంటిదేమీ లేదని అధ్యయనంలో తేలింది’’ అని పరిశోధనకర్త కేథరీన్‌ ఓల్డెన్‌బర్గ్‌ వివరించారు. ప్రపంచ వ్యాప్తంగా వైద్యులు కొవిడ్‌ చికిత్సలో భాగంగా అజిత్రోమైసిన్‌ను వాడాలని సూచిస్తున్న సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని