
Ramayana Yatra: తక్కువ బడ్జెట్లో ‘రామాయణ యాత్ర’
తక్కువ ఖర్చుతో దేశాన్ని చుట్టేయాలనుకునే పర్యాటకుల కలను నిజం చేయడానికి భారతీయ రైల్వే ఆధ్వర్యంలోని ఐఆర్సీటీసీ ముందుకొచ్చింది. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశాలను కలుపుతూ దాదాపు 17 రోజుల చౌకైన యాత్రకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ‘దేఖో అప్నే దేశ్’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) లిమిటెడ్ ఆధ్వర్యంలో.. శ్రీ రామాయణ యాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ యాత్ర దిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుంది. రాముడి జీవిత విశేషాలతో ముడిపడి ఉన్న ప్రదేశాలను కలుపుతూ సాగుతుంది. అయోధ్య రామ జన్మభూమి, హనుమాన్ దేవాలయం, నందిగ్రామ్‌లోని భారత్ మందిర్లు దర్శించవచ్చు. అయోధ్య అనంతరం బిహార్‌లో సీతా జన్మస్థలం, సీతామఢిలు యాత్రలో ఉన్నాయి. నేపాల్‌లోని జానక్‌పుర్ రామ్-జానకి దేవాలయాన్ని కూడా రోడ్డు మార్గం ద్వారా చూసే అవకాశాన్ని కల్పిస్తారు. అనంతరం వారణాసికి రైలు ప్రయాణం ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా వారణాసి, ప్రయాగ, శ్రీంగవేర్పుర్, చిత్రకూట్‌లోని దేవాలయ సముదాయాలను రోడ్డు మార్గం ద్వారా యాత్రికులు దర్శించుకోవచ్చు. నాసిక్, త్రయంబకేశ్వర్ దేవాలయం, పంచవటి, హంపి, హనుమాన్ జన్మస్థలం, రామేశ్వరం వరకు అనేక పుణ్యక్షేత్రాలను కలుపుతూ యాత్ర సాగుతుంది.
ఎప్పటి నుంచి ప్రారంభం?
ఈ యాత్రను భారతీయ రైల్వే శాఖ నవంబరు 7, 2021 నుంచి ప్రారంభించనుంది. దాదాపు 7500 కి.మీ పాటు యాత్ర కొనసాగుతుంది. డీలక్స్ ఏసీ స్లీపర్ క్లాస్ రైలును యాత్ర కోసం వినియోగిస్తారు. రైలులో అధునాతన సౌకర్యాలు ఉంటాయి. మంచి ఎయిర్ కండిషనింగ్ ఉన్న ఈ రైలులో ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం యాత్రకు గాను ఫస్ట్ క్లాస్ ఏసీకి రూ.1,02,095, సెకండ్ క్లాస్ ఏసీకి రూ.82,950 ఉంటుంది. కొవిడ్ నిబంధనల నడుమ యాత్ర నడుస్తుంది. యాత్ర చేయాలనుకునేవారు (18+) ముందే వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.