Speed Limit: వాహనాల వేగం తగ్గాల్సిందే.. కేంద్రం ఉత్తర్వుల రద్దు  

జాతీయ రహదారులపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చంటూ కేంద్రం ఇచ్చిన ప్రకటన(నోటిఫికేషన్‌)ను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు మంగళవారం...

Updated : 15 Sep 2021 15:36 IST

మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

ఈనాడు డిజిటల్, చెన్నై: జాతీయ రహదారులపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చంటూ కేంద్రం ఇచ్చిన ప్రకటన(నోటిఫికేషన్‌)ను రద్దు చేస్తూ మద్రాస్‌ హైకోర్టు మంగళవారం ఉత్తర్వులిచ్చింది. 2013లో కాంచీపురం రహదారిపై జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న దంత వైద్యుడు 90% పక్షవాతానికి గురయ్యారు. దీనిపై కేసు నమోదు కాగా... ఆయనకు పరిహారంగా రూ.1.49 కోట్లు ఇవ్వాలని న్యాయమూర్తి జస్టిస్‌ కృపాకరన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వుల్లో ఎక్స్‌ప్రెస్‌ హైవేల్లో గంటకు 120 కి.మీ., జాతీయ రహదారుల్లో 100 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని కేంద్రం 2018లో ప్రకటించిన ఉత్తర్వులను మరోమారు పరిశీలించాలని గత విచారణలో భాగంగా పేర్కొంది. దేశీయంగా ఉత్పత్తి అవుతున్న, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న అన్ని ద్విచక్ర వాహనాలకు వేగ నిరోధక పరికరాన్ని (స్పీడ్‌ లిమిటర్‌ను) అమర్చాలని సూచించింది. కేసు మంగళవారం విచారణకు రాగా... రోడ్లను మెరుగుపరచడం, ఇంజిన్‌ల పనితీరు పెంచడం వంటి కారణాలతో స్పీడ్‌ను పెంచినట్లు కేంద్రం కోర్టుకు విన్నవించింది. ఈ వివరణతో సంతృప్తి చెందని కోర్టు 2018 నాటి ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు ఆదేశించింది.

బంపర్‌ టూ బంపర్‌ బీమా ఉత్తర్వుల ఉపసంహరణ

సెప్టెంబరు ఒకటి నుంచి విక్రయించే అన్ని వాహనాలకు బంపర్‌ టూ బంపర్‌ ప్రాతిపదికన అయిదేళ్లపాటు బీమా తప్పనిసరి చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకొంటున్నట్లు మద్రాస్‌ హైకోర్టు వెల్లడించింది. హొగేనకల్‌ ప్రాంతంలో 2016 ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సడయప్పన్‌ కుటుంబ సభ్యులు వేసిన పిటిషన్‌ను విచారించిన ఈరోడ్‌ జిల్లా కోర్టు... రూ.14.65 లక్షల పరిహారం అందించాలని ఆదేశించింది. దీన్ని వ్యతిరేకిస్తూ చెన్నై న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్‌ వైద్యనాథన్‌ ఈరోడ్‌ న్యాయస్థానం ఉత్తర్వులను రద్దుచేశారు. అదే సమయంలో సెప్టెంబరు ఒకటి నుంచి విక్రయించే కొత్త వాహనాలకు బంపర్‌ టూ బంపర్‌ ప్రాతిపదికన అయిదేళ్లపాటు బీమాను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చారు. జనరల్‌ ఇన్సూరెన్స్‌... మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించి మూడు నెలల సమయం కోరింది. ఈ కేసు తిరిగి మంగళవారం విచారణకు రాగా గత ఉత్తర్వులను ఉపసంహరించుకొంటున్నట్లు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని