Masood Azhar: లాడెన్‌లా చనిపోకూడదని.. రక్షణ కల్పిస్తోన్న పాక్‌!

ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ భూతల స్వర్గం. ఒసామా బిన్‌ లాడెన్‌ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయమిచ్చింది. రక్షణ కల్పించింది. ఇప్పుడు జైషే మహమ్మద్‌ అధిపతి..

Updated : 02 Aug 2021 10:32 IST

ప్రభుత్వ అతిథిగా విలాసవంతమైన భవంతుల్లో నివాసం 

దిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్థాన్‌ భూతల స్వర్గం. ఒసామా బిన్‌ లాడెన్‌ సహా ఎంతో మందికి ఆ దేశం ఆశ్రయమిచ్చింది. రక్షణ కల్పించింది. ఇప్పుడు జైషే మహమ్మద్‌ అధిపతి.. 2001 భారత్‌ పార్లమెంట్‌పై దాడి సహా పలు ఉగ్రదాడుల్లో ప్రధాన కుట్రదారుడైన మసూద్‌ అజార్‌ను పాక్‌ ప్రభుత్వం తన అతిథిగా చూసుకుంటోంది. మతం పేరుతో యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఈ కరడుగట్టిన ఉగ్రవాదికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రస్తుతం అజార్‌..బహవల్‌పుర్‌లో రెండు విలాసవంతమైన భవంతుల్లో నివాసం ఉంటున్నాడు. అందులో ఒకటి ఒస్మాన్‌-ఒ-అలీ మసీదు పక్కన, ఇంకోటి అక్కడికి 4 కిలోమీటర్ల దూరంలో జామియా మసీదు సమీపంలో ఉంది. ఈ రెండింటికి పాక్‌ సైన్యం రక్షణ కల్పిస్తోంది. 

ఎన్ని సాక్ష్యాలు చూపినా...
1999లో కాందహార్‌ విమాన హైజాక్‌ ఘటనలో భారత ప్రభుత్వం విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల్లో అజార్‌ ఒకడు. ఆ తర్వాత పాకిస్థాన్‌ చేరుకొని కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాల కోసం జైషే మహమ్మద్‌ అనే ఉగ్రవాద సంస్థను ప్రారంభించాడు. 2001 పార్లమెంట్‌ దాడి వెనుక అజార్‌ హస్తం ఉంది. 2016 పఠాన్‌కోట్‌ దాడి ప్రణాళికను కూడా తన సోదరుడితో కలిసి రచించాడు. 2019లో పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనశ్రేణిపై ఆత్మాహుతి దాడిలోనూ అజార్‌ ప్రమేయం ఉంది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా భారత్‌ ప్రభుత్వం చాలా సార్లు పాక్‌కు పంపింది. అయినా ఆ దేశం పట్టించుకోలేదు.

అక్కడే ఎందుకు?
అల్‌ఖైదా అధిపతి ఒసామా బిన్‌ లాడెన్‌ పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లో పెద్దగా జనసంచారం లేని ప్రాంతంలో తలదాచుకున్నాడు. దీంతో అమెరికాకు చెందిన సీల్స్‌ దళాలు చడీచప్పుడు లేకుండా దాడి చేసి హతమార్చాయి. అలాంటి ప్రమాదం తనకూ భారత ప్రభుత్వం నుంచి పొంచి ఉందన్న భయంతోనే బహవల్‌పుర్‌లో అజార్‌ తన మకాం పెట్టాడు. నివాసానికి ఎంపిక చేసుకున్న రెండు భవంతులు.. రద్దీ ప్రాంతాల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. పైగా బహవల్‌పుర్.. అజార్‌ పుట్టి పెరిగిన ప్రాంతం. ఇక్కడ చీమ చిటుక్కుమన్నా అతని అనుచరులకు తెలిసిపోతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని