Operation Malabar: ‘ఆపరేషన్‌ మలబార్‌’తో చైనాకు భారత్‌ సవాల్‌

భారత్‌ - చైనాల సైనిక ఉన్నతాధికారుల మధ్య 13వ దఫా చర్చలు సఫలం కాని నేపథ్యంలో.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో..

Updated : 13 Oct 2021 11:37 IST

క్వాడ్‌ కూటమి భాగస్వామ్యం
అమెరికా నౌకా దళాధిపతి పర్యటన

దిల్లీ: భారత్‌ - చైనాల సైనిక ఉన్నతాధికారుల మధ్య 13వ దఫా చర్చలు సఫలం కాని నేపథ్యంలో.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్‌లతో కలసి భారత నౌకాదళం బంగాళాఖాతంలో ‘ఆపరేషన్‌ మలబార్‌’ విన్యాసాలు నిర్వహించడం ద్వారా డ్రాగన్‌కు గట్టి సందేశం పంపించింది. ఈ నెల 11 నుంచి 15 వరకు ఈ విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే అమెరికా నౌకాదళ అధిపతి అడ్మిరల్‌ మైఖేల్‌ గిల్డే దిల్లీకి వచ్చి భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ కరమ్‌బీర్‌ సింగ్‌తో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాధారణంగా భారత్‌ - చైనా సైనిక ఉన్నతాధికారుల చర్చలు ముగిశాక విడుదల చేసే ప్రకటనల్లో సరిహద్దులో శాంతిసామరస్యాలు నెలకొనాలనే అభిలాష వ్యక్తమవుతూ ఉంటుంది. తాజా భేటీ తర్వాత మాత్రం సరిహద్దు చర్చల్లో చైనా సైన్యం వైఖరి తమకు సమ్మతంగా లేదని, పరిష్కారం కోసం ముందడుగు వేసే ప్రతిపాదనలేమీ రాలేదని భారత్‌ అధికార ప్రకటన పేర్కొంది. మరోవైపు చైనా సైన్యం (పీఎల్‌ఏ) కూడా.. భారత సైన్యం అవాస్తవిక, అసమంజస వైఖరిని అవలంబించిందని, చర్చలు ముందుకు సాగలేని స్థితి కల్పించిందని వ్యాఖ్యానించింది. ఈ భేటీ అనంతరం భారత్‌ క్వాడ్‌ దేశాలతో కలసి ఆపరేషన్‌ మలబార్‌ రెండో దశ విన్యాసాలను బంగాళాఖాతంలో ప్రారంభించింది. దీనికి ముందు మొదటి దశ విన్యాసాలు ఫిలిప్పీన్‌ సముద్రంలో ఆగస్టు 26-29 తేదీల మధ్య జరిగాయి. ఇండో-పసిఫిక్‌లో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి క్వాడ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీనిపై చైనా రుసరుసలాడుతున్నా క్వాడ్‌ దేశాలు ఖాతరు చేయడం లేదు. బంగాళాఖాతంలో ఇటీవల చైనా యుద్ధనౌకలు, జలాంతర్గాముల సంచారం పెరిగింది. దీంతో క్వాడ్‌ దేశాలు శత్రు నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే అభ్యాసాలను నిర్వహిస్తున్నాయి. తమ నావికుల మధ్య సమన్వయం పెంచుకోవడం, అధునాతన ఆయుధాలను ప్రయోగించడంలో ఉమ్మడి అనుభవం సంపాదిస్తున్నాయి.

గిల్డే భారత పర్యటన..
అమెరికా నౌకాదళాధికారి అడ్మిరల్‌ మైకేల్‌ గిల్డే భారత్‌ పర్యటన ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముంబయి, విశాఖపట్నంలలోని భారత నౌకాదళ పశ్చిమ, తూర్పు కమాండ్‌ కార్యాలయాలను సందర్శించడంతో పాటు, వాటి అధిపతులతో భేటీ అవుతారు. అనంతరం భారతీయ ప్రతినిధులతో కలసి బంగాళాఖాతంలోని అమెరికా యుద్ధనౌకలను సందర్శిస్తారు. 2016లో భారతదేశాన్ని రక్షణపరంగా ప్రధాన భాగస్వామిగా అమెరికా గుర్తించినప్పటి నుంచి రెండు దేశాలూ పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుని వ్యూహాత్మకంగా దగ్గరవుతున్నాయి.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని