Rainfall Prediction: 2-8 ఏళ్ల ముందే వర్షపాతం అంచనా! 

దేశంలో వచ్చే 2-8 ఏళ్లలో వర్షపాతం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగలిగితే ప్రయోజనాలు అనూహ్యంగా ఉంటాయి.

Updated : 05 Oct 2021 13:46 IST

ఐవోడీ సంకేతాలతో సాధ్యమే.. హెచ్‌సీయూ పరిశోధకుల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో వచ్చే 2-8 ఏళ్లలో వర్షపాతం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగలిగితే ప్రయోజనాలు అనూహ్యంగా ఉంటాయి. ఈ దిశగా ముందడుగు వేసినట్లు చెబుతున్నారు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం(హెచ్‌సీయూ) పరిశోధకులు. హిందూ మహాసముద్రం డైపోల్‌ (ఐవోడీ) ఆధారంగా ఇప్పటివరకూ ఆరు నెలల ముందుగా మాత్రమే దేశంలో రుతుపవనాల తీరును అంచనా వేస్తున్నారు. తమ పరిశోధన ఫలితాలతో 2 నుంచి 8 ఏళ్లలో కురిసే వర్షపాతాన్ని ముందే గుర్తించడం సాధ్యమవుతుందని వీరు స్పష్టం చేస్తున్నారు. ఐవోడీ ఆధారంగా వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు హెచ్‌సీయూలోని భూమి, సముద్ర, వాతావరణ శాస్త్ర కేంద్రం ఆచార్యుడు అశోక్‌ నేతృత్వంలో పీహెచ్‌డీ విద్యార్థిని ఫెబాఫ్రాన్సిస్, ఈ కేంద్రం మాజీ ఛైర్‌ ప్రొఫెసర్‌ సతీష్‌షెత్యే పరిశోధన చేపట్టారు. వీరికి యూకేకు చెందిన ఎగ్జెటర్‌ వర్సిటీ ఆచార్యుడు మ్యాట్‌ కొలిన్స్‌ సహకారం అందించారు. 1960 నుంచి 2011 మధ్య ఉన్న వాతావరణ పరిస్థితులను వీరు విశ్లేషించారు. ఇందులో ఐవోడీ సూచీల ఆధారంగా 2 నుంచి 8 సంవత్సరాల ముందే రుతుపవనాలు, ఇతర వాతావరణ స్థితిగతులను అంచనా వేసేందుకు అవకాశం ఉందని తేల్చారు.

దక్షిణ మహాసముద్రం జలాల ఆధారంగా..

ఐవోడీలో ప్రతికూల సూచీలు కనిపిస్తే వర్షపాతం తక్కువగా ఉంటుందని, సానుకూల సూచీలు కనిపిస్తే వర్షాలు ఎక్కువగా కురుస్తాయని అంచనా వేస్తారు. ఐవోడీ అనేది దక్షిణ మహా సముద్రం నుంచి వచ్చే జలాలపై ఆధారపడి ఉందని హెచ్‌సీయూ పరిశోధకులు గుర్తించారు. దక్షిణ మహా సముద్రం నుంచి నీటి ప్రవాహం హిందూ మహాసముద్రాన్ని చేరేందుకు ఎనిమిదేళ్లు పడుతుంది. ఆ మేరకు 8 ఏళ్ల ముందుగానే వాతావరణ పరిస్థితులను అంచనా వేసేందుకు సంకేతాలను గుర్తించే వీలుందని ప్రొ.అశోక్‌ వివరించారు. ఐవోడీలో పాజిటివ్‌ సూచీలు రావడంతో 1961, 1963, 1967, 1994, 1997, 2007, 2019లో దేశంలో భారీ వర్షాలు కురిశాయని వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని