Rajkundra: కుంద్రా.. అశ్లీల కథాచిత్రమ్‌

ఆశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో సోమవారం అరెస్టయిన వ్యాపార వేత్త, ప్రముఖ బాలీవుడ్‌ నటి

Updated : 22 Jul 2021 11:00 IST

ఐపీఎల్‌ బెట్టింగ్‌ నుంచి పోర్న్‌ యాప్‌ల వరకు

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం కేసులో సోమవారం అరెస్టయిన వ్యాపార వేత్త, ప్రముఖ బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాకు వివాదాలు కొత్త కాదు. 2013లో ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణం నుంచి ఆరంభిస్తే, దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్‌ మిర్చితో సన్నిహిత సంబంధాల వరకు ఎప్పుడూ ఏదో వివాదం ఆయన్ను వెన్నాడుతూనే ఉంది.
రాజ్‌కుంద్రా.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొకొచ్చేది బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి. ఈ లండన్‌ వ్యాపారవేత్త 2009లో శిల్పను వివాహం చేసుకోవడం ద్వారా వార్తల్లోకి వచ్చారు. తర్వాత ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ రాజస్థాన్‌ రాయల్స్‌లో పెట్టుబడులు పెట్టారు. 2013లో ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంతో కుంద్రా చీకటి నేపథ్యం వెలుగులోకి వచ్చింది. ఆ కుంభకోణంలో కుంద్రాపై బెట్టింగ్, ఫిక్సింగ్‌ వంటి తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. గంటల తరబడి దిల్లీ పోలీసులు కుంద్రాను విచారించారు. ఈ సందర్భంగా తాను బెట్టింగ్‌లకు పాల్పడినట్లు కుంద్రా అంగీకరించారు. ఏడుగురు బుకీలతో సంప్రదింపులు జరిపానని,  మ్యాచ్‌లు మాత్రం ఫిక్స్‌ చేయలేదని పేర్కొన్నారు. దీంతో 2015లో బీసీసీఐ... కుంద్రాను శాశ్వతంగా ఐపీఎల్‌ నుంచి వెలివేసింది.

అయినా క్రీడల్లో కుంద్రా భారీగా పెట్టుబడులు పెడుతూనే వచ్చారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్‌ భాగస్వామ్యంతో మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ లీగ్‌ను, తర్వాత ఐపీఎల్‌ పేరుతో ఇండియన్‌ పోకర్‌ లీగ్‌ను ప్రారంభించారు. బెస్ట్‌ డీల్‌ టీవీ పేరుతో ఓ టెలీ షాపింగ్‌ ఛానల్‌ కూడా ఉంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌కు వాటాలు ఉన్నాయి. 2018లో బిట్‌కాయిన్‌ కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కుంద్రాను ప్రశ్నించింది. రియల్‌ ఎస్టేట్‌ కుంభకోణంలో దావూద్‌ ఇబ్రహీం అనుచరుడు ఇక్బాల్‌ మిర్చితో సంబంధాలపై కూడా కుంద్రాను విచారించారు. దాదాపు తొమ్మిది గంటలు ప్రశ్నించారు. ఇలా వివాదాలు వస్తున్నా.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వచ్చిన కుంద్రా రెండేళ్ల క్రితం అశ్లీల చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. హాట్‌షాట్స్‌ యాప్‌లో తన సినిమాలను ప్రసారం చేయడం ప్రారంభించారు. అయితే.. హాట్‌షాట్స్‌ కాకుండా చాలా అశ్లీల యాప్‌లను కుంద్రా నిర్వహిస్తున్నారని పోలీసుల ఆరోపణ.

ఆ షూటింగే పట్టిచ్చింది

నిజానికి రాజ్‌కుంద్రాను ముంబయి పోలీసులు సోమవారం అరెస్టు చేసినా, ఐదు నెలల నుంచి అతనిపై నిఘా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మలాడ్‌ వెస్ట్‌లోని ఓ బంగ్లాపై దాడి సమయంలో కుంద్రా పేరు పోలీసుల దృష్టికి వచ్చింది. దాడి సమయంలో బంగ్లాలో ఓ అశ్లీల చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు నగ్నంగా కనిపించారు. దీంతో అక్కడ ఉన్న 11 మందిని పోలీసులు అరెస్ట్టు చేశారు. విచారణ సందర్భంగా అశ్లీల చిత్రాల రాకెట్‌తో రాజ్‌కుంద్రాకు సంబంధం ఉందని పోలీసులకు తెలిసింది. అయితే బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో అప్పుడు అరెస్టు చేయలేదు.

అది అశ్లీలం కాదు: గహనా

రాజ్‌కుంద్రా సంస్థలో మూడు సినిమాల్లో నటించిన నటి గహనా వశిష్ఠ్‌ రాజ్‌కుంద్రాకు మద్దతుగా నిలిచారు. తాము అశ్లీల చిత్రాలు తీయలేదని, తాము తీసిన చిత్రాలు ఆ విభాగంలోకి రావని, పోలీసులే అక్రమంగా కేసులు బనాయించారని ఆమె ఆరోపించారు. ఫిబ్రవరిలో మలాడ్‌ వెస్ట్‌లో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో గహనా కూడా ఉన్నారు. ఇటీవల ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు.
వీడియో ఆడిషన్‌లో దుస్తులు విప్పమన్నారు: మోడల్‌ సాగరిక

రాజ్‌కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా మోడల్‌ సాగరికా సుమన్‌.. రాజ్‌కుంద్రాపై సంచలన ఆరోపణలు చేశారు. ‘‘గత ఏడాది ఆగస్టులో కామత్‌ ఫోన్‌ చేశారు. శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా భారీస్థాయిలో వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తున్నారని.. అందులో నటించేందుకు ఆడిషన్‌ ఇవ్వాలని కోరారు. వీడియోలో ఆడిషన్‌ ఇస్తే సరిపోతుందన్నారు. ఆడిషన్‌ సమయంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ఉమేశ్‌ కామత్‌తో పాటు రాజ్‌కుంద్రా, మరో వ్యక్తి ఉన్నారు. ఆడిషన్‌ సందర్భంగా కామత్‌.. నన్ను దుస్తులు విప్పమన్నారు. అందుకు నేను ఒప్పుకోలేదు. అసభ్యంగా మాట్లాడారు. తమ వెబ్‌సిరీస్‌లో నటిస్తే పేరు, డబ్బు వస్తుందని ఆశ చూపారు. అయినా ఆ ప్రతిపాదనను తిరస్కరించాను. నాలా మరో మహిళ బలికాకూడదనే ఇప్పుడు రాజ్‌కుంద్రాకు వ్యతిరేకంగా గళమెత్తాను’’ అని సాగరిక చెప్పారు.

కుంద్రా.. ప్లాన్‌-బి

కుంద్రా తన అశ్లీల చిత్రాలను ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ వేదిగ్గా ప్రసారం చేశారు. అయితే అది కేంద్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడంతో గూగుల్‌ ప్లే స్టోర్‌.. నోటీసులు పంపింది. ఈ విషయంపై కుంద్రాకు, అతని సహచరులకు మధ్య జరిగిన వాట్సప్‌ సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో యాప్‌ను నిషేధించినా బెంగపడాల్సినదేమీలేదని.. తనకు ప్లాన్‌-బి ఉందని తెలిపారు. ఇంకో యాప్‌ నుంచి అశ్లీల కంటెంట్‌ ప్రసారం అవుతుందని సహచరులకు భరోసా ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని