Supreme Court: చిన్నప్పటి సంతకం మారకుండా ఉంటుందా?

ఒకటో తరగతిలో పెట్టిన సంతకం ఎనిమిదో తరగతికి వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉంటుందా?

Published : 30 Aug 2021 13:14 IST

దీని ఆధారంగానే హత్య కేసుపై విచారణ
నోటీసులు ఇచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఒకటో తరగతిలో పెట్టిన సంతకం ఎనిమిదో తరగతికి వచ్చినప్పుడు కూడా అలాగే మారకుండా ఉంటుందా? దీన్ని ఆధారం చేసుకునే సుప్రీంకోర్టు ఓ హత్య కేసుపై విచారణ జరపనుంది. ఒక హత్య కేసులో నిందితుడిని మైనర్‌గా నిర్ధరించిన భాగపట్‌ జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు అతనికి తక్కువ శిక్ష విధించింది. పాఠశాల ఇచ్చిన ధ్రువపత్రాల ఆధారంగా ఈ తీర్పు వెల్లడించింది. అయితే ఈ సందర్భంగా సమర్పించినవి తప్పుడు పత్రాలంటూ బాధితులు కింది కోర్టులను ఆశ్రయించినా ఊరట కలగకపోవడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. నిందితుడు నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు ఒకటో తరగతిలో చేసిన సంతకం, 12 ఏళ్ల వయసులో 8వ తరగతిలో చేసిన సంతకం ఒకేలా ఉండడం అనుమానాలు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది ఆసక్తికరంగా ఉందని వ్యాఖ్యానించిన జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ ఎం.ఆర్‌.షాలతో కూడిన ధర్మాసనం నిందితునికి, అతని తల్లికి నోటీసులు ఇచ్చింది. ఆరువారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఆ వయసులో ఒకేలా సంతకాలు చేయడం జరగదని, అలా ఉన్నాయంటే నకిలీవేనని బాధితుల తరఫు న్యాయవాది వాదించారు. వైద్య పరీక్షలు నిర్వహించి వయసును నిర్ధరించాలని, అందుకు అనుగుణంగా శిక్ష వేయాలని కోరారు. ట్రాక్టర్ల ట్రాలీలు నిలుపు చేసే విషయమై జరిగిన ఘర్షణలో మరికొందరితో కలిసి నిందితుడు కూడా పాల్గొన్నాడని, అందులో ఇద్దరు మరణించారని కేసు నమోదయింది. సంఘటన జరిగిన సమయంలో అతడు మైనర్‌ కావడంతో తక్కువ శిక్ష విధిస్తూ జువెనైల్‌ బోర్డు తీర్పు చెప్పింది.?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని