
Afghanistan: తాలిబన్ 2.0.. చాలా ప్రమాదకరం!
భారీగా ఆయుధాలు పోగేసుకుని.. ప్రత్యర్థులకు సవాలు
అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ విమానాశ్రయంలో అమెరికాకు చెందిన అత్యాధునిక యూహెచ్-60 బ్లాక్‌హాక్ హెలికాప్టర్ రన్‌వేపై కదులుతున్న దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఆ లోహ విహంగంలో తాలిబన్ ఫైటర్లు తిష్ట వేశారు. వారికి ఎలాంటి శిక్షణ లేకపోవడం వల్ల ఎంత ప్రయత్నించినా ఆ హెలికాప్టర్ పైకి ఎగరలేకపోయింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమ ఆయుధ పాటవాన్ని పెంచుకోవాలన్న ఆ ముఠా దురుద్దేశం ఈ చర్య ద్వారా బట్టబయలైంది.
అఫ్గాన్ రాజధాని కాబుల్ భద్రతను తాలిబన్ ముఠాలోని కొత్తగా ఏర్పాటైన ‘బద్రి 313’ యూనిట్ చూస్తోంది. వీరి ఆహార్యం.. ఆధునిక సైనిక దళాల్లోని సుశిక్షిత కమాండోలను తలపిస్తోంది. అమెరికా నుంచి చేజిక్కించుకొన్న ఆయుధాలు, తూటా రక్షణ కవచాలు, బాలిస్టిక్ హెల్మెట్లు, అత్యాధునిక కమ్యూనికేషన్ సాధనాలు, ప్రత్యేక బూట్లు, మోకాళ్లకు దెబ్బలు తగలకుండా ‘నీ ప్యాడ్లు’, అమెరికన్ తుపాకులు, చీకట్లో వీక్షణకు ఉపయోగపడే సాధనాలు, ప్రయాణాల కోసం దృఢమైన హమ్వీ వాహనాలు ఉన్నాయి. వీరు తాజాగా కాబుల్ విమానాశ్రయం వద్ద హల్చల్ చేస్తున్న ఫొటోలు మీడియాలో వచ్చాయి.
ఎక్కువగా పశు కాపరులు, రైతులతో కూడిన తాలిబన్ ముఠా సభ్యులు ఒకప్పుడు మొరటుగా కనిపించేవారు. వారి వద్ద ఎక్కువగా బైకులు, సైకిళ్లు, పికప్ ట్రక్కులు ఉండేవి. దాదాపు 70 ఏళ్ల కిందట డిజైన్ చేసిన ఏకే-47, 56 తుపాకులే వారి ప్రధాన ఆయుధాలు. ఇప్పుడు తాలిబన్ 2.0 భిన్నంగా కనిపిస్తోంది. వారి చేతిలో అత్యాధునిక ఆయుధాలు మిలమిల మెరుస్తూ కనిపిస్తున్నాయి. పోరాట వాహనాలు, విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్లు పోగేసుకున్నారు. అడుగడుగునా సాంకేతికత సంతరించుకున్న ఆ సాధన సంపత్తి ముష్కర ముఠా వద్ద ఉండటంతో ‘పిచ్చోడి చేతిలో రాయి’లా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ముఠాను ఓడించడం అంత సులువు కాదని నిపుణులు చెబుతున్నారు.
ఏమిటీ ‘బద్రి 313’
ఈ దళంలోని ఫైటర్లు.. సాధారణ తాలిబన్ ఫైటర్ల కన్నా మెరుగైన శిక్షణ పొందారు. పాక్ కనుసన్నల్లో నడిచే హక్కానీ నెట్వర్క్ ముఠా కూడా ఇందుకు సాయపడింది. పవిత్ర ఖురాన్లో ప్రస్తావించిన ‘బద్ర్ యుద్ధాని’కి గుర్తుగా ఈ పేరును ఖరారు చేశారు. నాటి యుద్ధంలో మహ్మద్ ప్రవక్త 313 మంది సాయంతో శత్రు సైన్యాన్ని మట్టికరిపించారని చెబుతారు. ఆహార్యంలో అమెరికా సైనికులను అనుకరిస్తున్న ‘బాదర్ 313’ ఫైటర్ల ఫొటోలు, వీడియోలను తాలిబన్లు విడుదల చేస్తున్నారు. తద్వారా తమ సైనిక పాటవం మెరుగుపడిందని, అఫ్గాన్‌ను సమర్థంగా రక్షించగలమన్న సంకేతాన్నిస్తున్నారు.
కుప్పలు.. కుప్పలు
2001లో తాలిబన్లను తరిమేశాక అమెరికా కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి అఫ్గాన్‌కు సైన్యం, వైమానిక దళాన్ని ఏర్పాటుచేసింది. 2003-16 మధ్యలో భారీ సంఖ్యలో అత్యాధునిక ఆయుధాలను ఆ దేశానికి తరలించింది. వీటిలో 3,58,530 తుపాకులు, 64వేల మెషీన్ గన్లు, 25,327 గ్రెనేడ్ లాంచర్లు, 22,174 హమ్వీ వాహనాలు, మందు పాతరలను తట్టుకొనే మ్యాక్స్‌ప్రో వాహనాలు 20, నవీస్టార్ ట్రక్కులు, ఎం-117 సాయుధ శకటాలు, విమాన విధ్వంసక తుపాకులు, మోర్టార్లు, శతఘ్నులు ఉన్నాయి. 2014లో నాటో దళాలు అఫ్గాన్ రక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యానికి అప్పగించేశాయి. ఈ క్రమంలో అమెరికా మరిన్ని ఆయుధాలను అక్కడకు చేర్చింది. 2017-21 మధ్యలో 20 వేల ఎం16ఎ4 రైఫిల్స్, 3,598 ఎం4 కార్బైన్లు, 3,012 హమ్‌వీలను తరలించింది. రష్యా కూడా 10వేల కలష్నికోవ్ తుపాకులను ఇచ్చింది. చైనా నలభై టి-54, టి-62 ట్యాంకులను అందించింది. అయినా అఫ్గాన్ సేన తాలిబన్లతో పోరాడలేక చేతులెత్తేసింది. దీంతో వాటిలో చాలావరకూ తాలిబన్ల పరమయ్యాయి.
లెక్కా పత్రం లేదు..
ఈ ఆయుధ సంపద.. తాలిబన్లకు ఇప్పటికిప్పుడు వచ్చిపడినవి కావు. అంతకుముందు నుంచీ అనేక మార్గాల్లో వారికి అవి అందుతూ వచ్చాయి. రెండేళ్ల కిందట అఫ్గాన్‌లో ఇద్దరు అమెరికా సైనికులు ఎం855 తూటాలతో నేలకొరిగారు. వాటిని అఫ్గాన్ సైన్యానికి అందించిన ఎం4 కార్బైన్, ఎం16ఎ4 రైఫిల్‌లో ఉపయోగిస్తుంటారు. దీన్నిబట్టి తాలిబన్లకు ఆయుధాలను చేరవేసే ప్రక్రియ అప్పటికే ప్రారంభమైనట్లు స్పష్టమవుతోంది. వీటి ద్వారానే వారు క్రమంగా బలపడుతూ.. వైరి పక్షాలను బెదిరించి, లొంగదీసుకున్నారు. ఇరాక్ భద్రతా దళాలకు, సిరియా తిరుగుబాటుదారులకూ అమెరికా భారీగా ఆయుధాలు ఇచ్చింది. వాటిలో అనేకం చేతులు మారి, ఉగ్రవాద ముఠాలకు అందాయి. కొన్నింటిని ముష్కరులు సామాజిక మాధ్యమాల్లో విక్రయానికీ పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయుధాలకు సంబంధించిన లెక్కను పక్కాగా నిర్వహించడం ఆధునిక మిలటరీ పద్ధతుల్లో ముఖ్యమైన అంశం. దీనిపై అమెరికా అలసత్వం వహించింది.
ఎంత ప్రమాదకరం..
తాలిబన్లు సంప్రదాయంగా వాడే ఏకే-47 కన్నా తాజాగా సమకూర్చుకున్న ఎం16ఎ4 రైఫిల్ ఎంతో మెరుగైంది. సరైన శిక్షణ పొందిన వ్యక్తి ఈ తుపాకీ సాయంతో 600 మీటర్ల దూరంలోని లక్ష్యంపైకి గురితప్పకుండా తూటాలను ప్రయోగించొచ్చు. ఏకే-47 మాత్రం 400 మీటర్ల దూరంలోని లక్ష్యాలనే గురి తప్పకుండా ఛేదించగలవు. ఎం16ఎ4, ఎం4 కార్బైన్‌లలో లక్ష్యాన్ని స్పష్టంగా చూడటానికి ‘హోలోగ్రఫిక్ సైట్’ వ్యవస్థ కూడా ఉంది. అమెరికా ప్రత్యేక బలగాలు వాడే శక్తిమంతమైన ‘ఎఫ్ఎన్ స్కార్ రైఫిల్’ కూడా తాలిబన్ల వద్ద ఉన్నట్లు సమాచారం.
రాత్రివేళా పోరాడగలరు..
తాలిబన్ చేతిలో ఇప్పుడు దాదాపు 16వేల నైట్ విజన్ గాగుల్స్ ఉన్నాయి. వీటి కారణంగా ఈ ముష్కర ముఠాకు రాత్రివేళ పోరాడే సామర్థ్యం మెరుగుపడింది. వీటికి తోడు 1.62 లక్షల కమ్యూనికేషన్ సాధనాలు ఉండటం వల్ల తాలిబన్లకు మరింత మెరుగ్గా సమన్వయం చేసుకుంటూ దాడులు నిర్వహించే సత్తా లభించింది.
సొంత వాయు సేన..
ఈ ఏడాది జూన్‌లో అఫ్గాన్ వైమానిక దళం వద్ద 167 విమానాలు, పోరాట హెలికాప్టర్లు, సాధారణ హెలికాప్టర్లు, నిఘా కోసం వాడే స్కాన్ ఈగిల్ డ్రోన్లు ఉన్నాయి. భారత్ కూడా నాలుగు ఎంఐ-24 పోరాట హెలికాప్టర్లు, మూడు చీతా హెలికాప్టర్లను అందించింది. వీటిలో ఎన్ని తాలిబన్లకు చిక్కాయన్నదానిపై స్పష్టత లేదు.
అంత సులువేమీ కాదు..
అమెరికా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నప్పటికీ వాటిలో కొన్నింటి వినియోగం, నిర్వహణలో తాలిబన్లకు ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా విమానాలు, హెలికాప్టర్ల వాడకం కష్టం. ఒకవేళ వీటిని వాడినా.. సకాలంలో సర్వీసింగ్ చేపట్టకుంటే అవి మూలనపడతాయి. వీటి నిర్వహణ కోసం పాక్, చైనా, రష్యా వంటి దేశాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పరారైన అఫ్గాన్ వాయుసేన పైలట్లను బెదిరించి దారికి తెచ్చుకుంటే మాత్రం తాలిబన్లు మరింత ప్రమాదకరంగా తయారవుతారు.
- ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.