India-China border: చైనా సరిహద్దు వరకూ రెండు లైన్ల రహదారి అవసరం

దేశ సరిహద్దు ఆవల టిబెట్‌ ప్రాంతంలో చైనా సైన్యం భారీగా మోహరిస్తోందని... మన సైనిక వాహనాలు సరిహద్దుల వరకూ వెళ్లేందుకు వీలుగా రెండు లైన్ల రహదారిని నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం ..

Updated : 10 Nov 2021 13:53 IST

సైనిక వాహనాలు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణం చేపట్టాలి

సుప్రీంకోర్టులో కేంద్రం వాదనలు

దిల్లీ: దేశ సరిహద్దు ఆవల టిబెట్‌ ప్రాంతంలో చైనా సైన్యం భారీగా మోహరిస్తోందని... మన సైనిక వాహనాలు సరిహద్దుల వరకూ వెళ్లేందుకు వీలుగా రెండు లైన్ల రహదారిని నిర్మించాల్సి ఉందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేహ్రాదూన్, మేరఠ్‌లలోని సైనిక స్థావరాలను, ఆయుధాగారాలను కలుపుతూ రిషికేశ్‌-గంగోత్రి, తనక్‌పుర్‌-పిథోర్‌గఢ్‌ తదితర మార్గాలను ఉన్నతీకరించాలని ప్రభుత్వం తెలిపింది. 1962 నాటి యుద్ధ పరిస్థితులు తలెత్తితే, సమర్థ పోరాట ప్రదర్శనకు ఇవి అవసరమని పేర్కొంది. రెండు లైన్ల రహదారి నిర్మాణానికి సంబంధించిన ఈ కేసు మంగళవారం విచారణకు రాగా... జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. దేశ రక్షణతో పాటు.. పర్యావరణ పరిరక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని రహదారి నిర్మాణం చేపట్టాలంది. దేశ రక్షణ అవసరాలను విస్మరించలేమని, ఈ విషయంలో తమకు మరో అభిప్రాయమే లేదని విస్పష్టం చేసింది.

ఉత్తరాఖండ్‌లో యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయ నగరాలను కలుపుతూ 900 కిలోమీటర్ల రహదారి నిర్మించాలని కేంద్రం యోచించింది. దీన్ని వ్యతిరేకిస్తూ ‘సిటిజన్స్‌ ఫర్‌ గ్రీన్‌ దూన్‌’ స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో- 2018 నాటి సర్క్యులర్‌ ప్రకారం 5.5 మీటర్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గతేడాది సెప్టెంబరు 8న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వెడల్పు సరిపోదని, ఉత్తర్వులను సవరించాలని కేంద్రం కోరుతోంది.

చైనా భారీ నిర్మాణాలు చేపట్టింది

మంగళవారం విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ‘‘సరిహద్దులకు ఆవలి ప్రాంతంలో చైనా భారీస్థాయిలో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంది. హెలీప్యాడ్లు, రహదారులు, రైల్వే లైన్లు నిర్మించింది. అక్కడ స్థిరంగా ఉండాలన్నదే చైనా ఉద్దేశం. మన సైన్యానికి చెందిన భారీ వాహనాలు, ట్యాంకర్లు, యంత్రాంగం అక్కడికి వెళ్లడానికి వీలుగా రెండు లైన్ల రహదారి అవసరం. అందుకు అనుగుణంగా 7/7.5 మీటర్ల రోడ్డును నిర్మించాల్సి ఉంది’’ అని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లా: జస్టిస్‌ చంద్రచూడ్‌

ఈ సందర్భంగా జస్టిస్‌ చంద్రచూడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను చాలాసార్లు హిమాలయాల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లా. కొన్నిచోట్ల వచ్చీపోయే వాహనాలు ఒకే సమయంలో ప్రయాణించడం వీలుకాదు. సైనిక వాహనాలు సులభంగా ముందుకు సాగిపోయేందుకు ఆ రహదారులను ఉన్నతీకరించాల్సి ఉంది. దేశ రక్షణను, సైనిక అవసరాలను మనం విస్మరించగలమా? ప్రభుత్వం కేవలం రెండు లైన్ల రహదారినే నిర్మిస్తామంటోంది. 8 లైన్లో, 12 లైన్లో కాదుకదా’’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని