Mehul Choksi: ఆంటిగ్వాకు ఛోక్సీ.. భారత్‌కు ఎప్పుడో?

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించినట్లే కన్పిస్తున్నాయి. నాడీ సంబంధ చికిత్స నిమిత్తం ఆంటిగ్వా వెళ్లేందుకు డొమినికా హైకోర్టు

Updated : 15 Jul 2021 11:22 IST

బెయిల్‌ మంజూరుతో ‘అప్పగింత’ కేసు మరింత ఆలస్యం

డొమినికా: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణం ప్రధాన నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్‌ ఛోక్సీ భారత్‌కు రాకుండా ఉండేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కన్పిస్తున్నాయి. నాడీ సంబంధ చికిత్స నిమిత్తం ఆంటిగ్వా వెళ్లేందుకు డొమినికా హైకోర్టు రెండు రోజుల క్రితం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో 51 రోజుల కస్టడీ అనంతరం నేడు ప్రత్యేక ఛార్టెడ్‌ విమానంలో తిరిగి ఆంటిగ్వా చేరుకున్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. 

ఈ ఏడాది మే 23న ఆంటిగ్వాలో ఉన్నట్టుండి అదృశ్యమైన ఛోక్సీ రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికాలో పోలీసులకు చిక్కిన విషయం తెలిసిందే. క్యూబా పారిపోయే ప్రయత్నంలో డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించడంతో అతడిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అయితే ఛోక్సీని కిడ్నాప్‌ చేసి బలవంతంగా డొమినికా తీసుకెళ్లారని ఆయన తరఫు న్యాయవాదులు బలంగా ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై డొమినికా హైకోర్టులో రెండు కేసులు విచారణ దశలో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే ఛోక్సీ గతంలో బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా.. పారిపోయే అవకాశం ఉన్నందున అతడి పిటిషన్‌ను డొమినికా కోర్టు తిరస్కరించింది. అయితే తాజాగా అనారోగ్య కారణాల దృష్ట్యా మరోసారి బెయిల్‌ కోసం ఛోక్సీ అభ్యర్థించారు. తీవ్రమైన హెమటోమాతో బాధపడుతున్న అతడికి వెంటనే న్యూరాలజిస్టు, న్యూరో సర్జికల్‌ కన్సల్టెంట్‌తో చికిత్స అందించాలని వైద్యులు సిఫార్సు చేశారు. అయితే ప్రస్తుతం ఆ వైద్య సేవలు డొమినికాలో అందుబాటులో లేకపోవడంతో ఆంటిగ్వా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఛోక్సీ కోరారు. 

దీంతో ఛోక్సీకి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 10 వేల కరీబియన్‌ డాలర్ల (సుమారు రూ.2.75 లక్షలు)ను పూచీకత్తుగా సమర్పించాలని అక్కడి కోర్టు ఆదేశించింది. ఛోక్సీ ఆరోగ్యం కుదుటపడి డొమినికా తిరిగి వచ్చేంతవరకు అక్రమంగా ప్రవేశించారన్న ఆరోపణపై కొనసాగుతున్న విచారణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో అతడిని భారత్‌కు తీసుకురావాలన్న ప్రయత్నాలకు విఘాతం కలిగినట్లయింది.

ఎన్నేళ్లు పట్టేనో..

ఛోక్సీని డొమినికా పోలీసులు అరెస్టు చేసిన విషయం బయటకు రాగానే.. అతడిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఇక్కడి దర్యాప్తు సంస్థలు ముమ్మర ప్రయత్నాలు చేశాయి. ఇందుకోసం ఓ ఉన్నతస్థాయి అధికారుల బృందం ఆ మధ్య డొమినికా వెళ్లి న్యాయస్థానంలో పత్రాలు కూడా సమర్పించింది. అయితే డొమినికాలో ఛోక్సీపై ఉన్న కేసుల్లో న్యాయస్థానం తీర్పు వస్తేనే ఆయన అప్పగింతకు అవకాశం లభిస్తుంది. తాజాగా అతడికి బెయిల్‌ మంజూరవడంతో అక్రమంగా ప్రవేశించారన్న కేసులో విచారణ వాయిదా పడింది. ఇది మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా స్పష్టత లేదు. దీంతో ఇప్పుడప్పుడే అతడిని భారత్‌కు తీసుకొచ్చే అవకాశాలు కన్పించట్లేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని