CJI: రాజ్యాంగ సంరక్షకుడిలా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అద్భుత పనితీరు కనబరుస్తున్నారని, నిజమైన రాజ్యాంగ సంరక్షుడి పాత్రను పోషిస్తున్నారని సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవే

Updated : 09 Oct 2021 11:46 IST

న్యాయవాది దుశ్యంత్‌ దవే వ్యాఖ్య

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ అద్భుత పనితీరు కనబరుస్తున్నారని, నిజమైన రాజ్యాంగ సంరక్షుడి పాత్రను పోషిస్తున్నారని సీనియర్‌ న్యాయవాది దుశ్యంత్‌ దవే పేర్కొన్నారు. లఖింపుర్‌ ఖేరి ఘటనపై శుక్రవారం విచారణ సందర్భంగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం వ్యవహరించిన తీరుపై.. ప్రముఖ పాత్రికేయుడు కరణ్‌థాపర్‌తో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ‘‘ఇంతకుముందు సీజేఐలుగా పనిచేసిన నలుగురు న్యాయమూర్తులు వ్యక్తులుగా మంచివారే. కానీ, రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తించడంలో, సంరక్షకుడి పాత్రను పోషించడంలో విఫలమయ్యారు. లఖింపుర్‌ ఖేరి కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రజలకిచ్చిన సందేశం ఎంతో సానుకూలంగా ఉంది. దేశ ప్రజలకు నిజమైన కాలపాదారు సుప్రీంకోర్టేనని స్పష్టం చేశారు. అసాధారణ రీతిలో విచారణ చేపట్టి... ఎంతో నమ్మకం కలిగించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం, అధికారులు చట్టప్రకారం వ్యవహరించకపోతే, తాము ఉత్తర్వులు జారీచేస్తామన్న గట్టి సంకేతం ఇచ్చారు. సర్వోన్నత న్యాయస్థానాన్ని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ముందుండి నడిపిస్తూ, రాజ్యాంగానికి నిజమైన కాపలాదారుగా దాన్ని నిలిపారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు ఆయన పనిచేస్తుండటం నాకెంతో సంతృప్తి కలిగిస్తోంది. అధికారంలో ఉన్నవారు న్యాయ వ్యవస్థపై నిరంతరం ఒత్తిడి తెస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో రాజ్యాంగబద్ధంగా పనిచేసే న్యాయమూర్తులకు లాయర్లు అండగా నిలవాలి. తాను చేసిన రాజ్యాంగబద్ధ ప్రమాణానికి కట్టుబడి ఉన్నట్టు సీజేఐ రోజురోజుకూ నిరూపించుకుంటున్నారు’’ అని దవే పేర్కొన్నారు.

నేటి నుంచి దసరా సెలవులు

సుప్రీంకోర్టుకు శనివారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కాగా 11 నుంచి 16వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. 17న ఆదివారం, 18, 19 తేదీలు మిలాద్‌ ఉన్‌ నబీ సెలవులు. తిరిగి 20వ తేదీన విచారణలు పునఃప్రారంభమవుతాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని