చేపల మార్కెట్లో కరోనా కలకలం

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతిఒక్కరు మాస్కులు ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి అని సూచించాయి. అయితే, పొరుగు దేశాలన్నీ కరోనా మహమ్మారితో అల్లాడుతున్నా.. కొన్నినెలలుగా కట్టడి చేస్తూ వచ్చిన థాయిలాండ్‌లో మాత్రం ఇప్పుడు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

Published : 22 Dec 2020 19:52 IST

బ్యాంకాక్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. మహమ్మారిని అడ్డుకునేందుకు అన్ని దేశాలు కృషి చేస్తున్నాయి. అందులో భాగంగానే ప్రతిఒక్కరు మాస్కులు ధరించడం, సామాజిక దూరం తప్పనిసరి అని సూచించాయి. అయితే, పొరుగు దేశాలన్నీ కరోనా మహమ్మారితో అల్లాడుతున్నా.. కొన్నినెలలుగా కట్టడి చేస్తూ వచ్చిన థాయిలాండ్‌లో మాత్రం ఇప్పుడు పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆ దేశంలోనే అతి పెద్ద చేపల మార్కెట్ కేంద్రంగా వైరస్ ప్రబలి వేలాది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

బ్యాంకాక్ సమీపంలోని సముత్ సఖోన్ ప్రావిన్స్‌‌లో అతి పెద్ద చేపల మార్కెట్ అయిన మాచాయ్ మార్కెట్ ఉంది. మయన్మార్ నుంచి వచ్చే వలస కార్మికులు అక్కడ పెద్ద సంఖ్యలో పనిచేస్తుంటారు.ఇక్కడ నిత్యం వందల కోట్ల డాలర్ల చేపల వ్యాపారం జరుగుతుంటుంది. ఇదే మార్కెట్లో రొయ్యలు అమ్మే 67 ఏళ్ల వృద్ధురాలికి మొదట కరోనా సోకినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. దీంతో అక్కడ సామూహిక పరీక్షలు ప్రారంభించగా.. తొలుత 689 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. ఇవాళ మరో 1,063 కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటి వరకు ఆ దేశంలో మొత్తం 5,716 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో మయన్మార్ నుంచి వలస వచ్చిన కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. తొలుత వైరస్ సోకిన వృద్ధురాలు ఇతర దేశాలకు ఎక్కడికీ ప్రయాణించలేదు. అయినా, ఆమెకు కరోనా ఎలా సోకిందన్నదానిపై అక్కడి అధికారులు ఆరా తీస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున పరీక్షలు చేస్తుండడమే కాకుండా మార్కెట్‌లో పనిచేసే కార్మికులను ఇళ్లు దాటి రావొద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. అయితే తదుపరి లాక్‌డౌన్‌కు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, నూతన సంవత్సర వేడుకలకూ ఎలాంటి అనుమతులివ్వలేదని థాయ్‌ ఉప ప్రధాని ప్రవిత్‌ వోంగ్సువాన్‌ తెలిపారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని