24 గంటల్లోపే మొదటి టీకా వేస్తాం: ట్రంప్

ఫైజర్‌ కరోనావైరస్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ప్రకటన చేసిన క్రమంలో..ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు.

Published : 12 Dec 2020 12:43 IST

వాషింగ్టన్‌: ఫైజర్‌ కరోనావైరస్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతినిస్తూ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) ప్రకటన చేసిన క్రమంలో..ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. 24 గంటల్లోపు మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభించనున్నామని ట్విటర్‌లో విడుదల చేసిన టెలివిజన్ ప్రసంగంలో వెల్లడించారు. ‘ఫెడ్ఎక్స్‌, యూపీఎస్‌తో మాకున్న భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశంలోని ప్రతి రాష్ట్రానికి టీకా రవాణాను ప్రారంభించాం. ఆయా రాష్ట్రాల్లో ఎవరికి మొదటి డోసు ఇవ్వాల్లో గవర్నర్లు నిర్ణయిస్తారు. కరోనా ముప్పు అధికంగా ఉన్న  వృద్ధులు, వైద్య సిబ్బందికి మొదట టీకా అందించాలని మేం కోరుకుంటున్నాం. ఇది మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించనుంది’ అని ట్రంప్ వెల్లడించారు. 

కరోనా వైరస్‌తో తీవ్రంగా అల్లకల్లోమైన అగ్రదేశం..టీకా కోసం వేయికళ్లతో ఎదురుచూసింది. ప్రస్తుతం ఫైజర్‌కు ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వడంతో..ఇప్పటికే ఆ దేశంలో దాదాపు మూడు లక్షల మంది ప్రాణలు బలిగొన్న మహమ్మారికి అంతిమ గడియలు మొదలైనట్టేనని అంతా భావిస్తున్నారు. తొలుత అందే మూడు మిలియన్ల డోసులను వైద్యారోగ్య, మిలిటరీ సిబ్బందితో పాటు వృద్ధులకు వారం రోజుల్లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, ఒప్పందం ప్రకారం మార్చి నాటికి అమెరికాకు ఫైజర్ 100 మిలియన్‌ డోసుల్ని అందించాల్సి ఉంది. అలాగే, ప్రజలందరికీ టీకా ఉచితంగానే అందజేస్తామని ట్రంప్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇవీ చదవండి:

ఫైజర్ టీకా వినియోగానికి అమెరికా అనుమతి

కరోనా: కోలుకుంటోన్న భారత్


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని