నేడు రెండో రోజు కొవిడ్‌ టీకా డ్రైరన్‌

నేటి కార్యక్రమంలో డమ్మీ టీకా వేసే ప్రక్రియ చేపడతామని అధికారులు వివరించారు.

Published : 29 Dec 2020 15:20 IST

దిల్లీ: భారత్‌లో ఎన్నికల నిర్వహణ తరహాలో అంతటి జాతీయ స్థాయి భారీ కార్యక్రమం కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. కొవిడ్‌ టీకా అత్యవసర వినియోగానికి అధికారిక అనుమతులు ఏ క్షణంలోనైనా లభించే అవకాశముంది. ఈ నేపథ్యంలో తొలివిడత 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ అందించే కార్యక్రమం క్షేత్రస్థాయిలో నిరాటంకంగా కొనసాగేందుకు.. రెండు రోజుల టీకా సన్నాహక కార్యక్రమం ‘డ్రైరన్‌’ సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా వాలంటీర్ల నమోదు జరిగిందని.. నేటి కార్యక్రమంలో డమ్మీ టీకా వేసే ప్రక్రియ చేపడతామని అధికారులు వివరించారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు, వ్యాక్సినేషన్‌ ముందస్తు, అనంతర జాగ్రత్తలను పరీక్షించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం నేడు ముగియనుంది.

ఎక్కడెక్కడంటే..

ఆంధ్రప్రదేశ్‌, కృష్ణా జిల్లాలో విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, కంకిపాడు మండలం ఉప్పులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సూర్యారావుపేటలోని పూర్ణా హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌, కృష్ణవేణి డిగ్రీ కళాశాల, తాడిగడప సచివాలయం-4, ప్రకాష్‌నగర్‌ పీహెచ్‌సీలతో సహా..  గుజరాత్‌లోని రాజ్‌కోట్‌, గాంధీనగర్‌లలో; పంజాబ్‌లోని లుథియానా, షహీద్‌ భగత్‌ సింగ్‌ నగర్‌; అస్సాంలోని సోనిత్‌పూర్, నల్బరీ ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ మాక్‌డ్రిల్‌ నేడు కొనసాగుతోంది.

తొలి రోజు ఏం జరిగిందంటే..

సోమవారం నాటి డ్రైరన్‌కు ముందు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ప్రతి టీకా కేంద్రంలో ప్రజలు వేచి ఉండేందుకు, టీకా వేసేందుకు, అనంతర పరిశీలన కోసం వేర్వేరు గదులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అన్ని మార్గదర్శకాలు, ప్రోటోకాల్‌ నిబంధనలను పాటిస్తూ టీకా సంబంధిత యాప్‌ కోవిన్‌ పనితీరును, సిబ్బంది వినియోగం, కోల్డ్‌ స్టోరేజిలో నిల్వ, తరలింపు తదితర ఏర్పాట్లను పరీక్షించారు. ఈ వివరాలను కోవిన్‌ యాప్‌లో నమోదు చేశారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు యాప్‌ ద్వారా ఎస్సెమ్మెస్‌ సందేశాలను పంపారు. వివిధ ప్రక్రియలు చేపట్టేందుకు పట్టిన సమయం, అవసరమైన మానవ వనరులు తదితర విషయాలను పర్యవేక్షించారు. డ్రైరన్‌ అనుభవాన్ని నిజమైన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఉపయోగిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ వివరించారు. కార్యక్రమంలో నమోదైన అంశాలకు సంబంధించిన రాష్ట్ర స్ధాయి నివేదికను.. స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌తో పాటు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు సమర్పించనున్నారు.

ఈ డ్రైరన్‌ నివేదిక ఆధారంగా కేంద్రం అవసరమైన మార్గదర్శకాలను ఇవ్వనుంది. జనవరిలో ప్రతిష్ఠాత్మక వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..

జూన్‌ కనిష్ఠానికి పాజిటివ్‌ కేసులు

భారత్‌లోకి కరోనా కొత్తరకం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని