Published : 08 Nov 2020 02:07 IST

ఒబామాతో ‘జో’డీ నంబర్ ‌1గా..! 

 విదేశీ వ్యవహారాల్లో తలపండిన నిపుణుడు

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: ‘‘ఛాంప్‌.. మనిషిని అంచనా వేసేటప్పుడు అతడు ఎన్నిసార్లు కింద పడ్డాడన్నది చూడకూడదు. అతడు ఎంత వేగంగా లేచి నిలబడ్డాడు అన్నదే చూడాలి’’ అని ఓ తండ్రి తన బిడ్డకు చెప్పాడు. అది ఆ బాలుడి మనసుపై బలమైన ముద్ర వేసింది. నత్తితో బాధపడుతున్న ఆ 13 ఏళ్ల బాలుడి కుటుంబం.. కొన్నాళ్లకు తమ స్వస్థలం నుంచి వలస వెళ్లింది. అక్కడ కొత్త పాఠశాలలో చేరితే తోటి విద్యార్థులు అతడిని డాష్‌ అని గేలి చేసేవారు. దీంతో ఆ చిన్నారి పట్టుదలతో ఆ సమస్యను అధిగమించాడు. తదనంతర కాలంలో న్యాయ విద్యను పూర్తిచేసి కోర్టులో అనర్గళంగా వాదించాడు. తన వాక్పటిమ, పనితీరుతో చుట్టుపక్కల వారిని ఆకర్షించాడు. 29 ఏళ్ల వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికయ్యాడు. అక్కడి నుంచి దాదాపు 35 ఏళ్లపాటు తనకు ఎదురులేదని నిరూపించుకున్నాడు. అనంతరం కాలంలో ఆ దేశానికి ఉపాధ్యక్షుడయ్యాడు. అధ్యక్షుడికి ఉంటే ఇలాంటి భాగస్వామి ఉండాలి అనేలా పనిచేశారు. ఇప్పుడు అదే దేశానికి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసేందుకు వేగంగా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. ఆయనే అమెరికా రాజకీయాల్లో దాదాపు అర్ధ శతాబ్దం అనుభవశీలుడు... ‘లంచ్ ‌ప్యాకెట్‌ జో’, ‘వర్కింగ్‌ క్లాస్‌ జో’ ‘మిడిల్‌ క్లాస్‌ జో’ అంటూ పార్టీలకు అతీతంగా అందరూ పిలుచుకునే సన్నిహితుడు.. విదేశీ వ్యవహారాల్లో తలపండిన నిపుణుడు అమెరికా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌..!

పెన్సిల్వేనియాలో పుట్టి.. డెలావర్‌లో ఎదిగి..

పెన్సిల్వేనియాలోని స్క్రాంటన్‌‌లో 1942 నవంబర్‌ 20 జో బైడెన్‌ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జోసఫ్‌ ఓ చిన్న ఉద్యోగి. తల్లి కేథరిన్‌ గృహిణి. కష్టాలకు ఓర్చుకొని నిలబడే మనిషిగా వీరు బైడెన్‌ను తీర్చిదిద్దారు. ‘మనిషిని అంచనా వేసేటప్పుడు అతడు ఎన్నిసార్లు కింద పడ్డాడన్నది కాదు.. ఎంత వేగంగా లేచి నిలబడ్డాడనేది చూడాలి’ అంటూ తన తండ్రి చెప్పిన మాటలను ఇప్పటికీ జో గుర్తు చేసుకుంటూ ఉంటారు. వీరి కుటుంబం 1955లో డెలావర్‌లోని మేఫీల్డ్‌కు వలస వెళ్లింది. అక్కడే జో విద్యాభ్యాసం చేశాడు. అక్కడే ఆయనకు ప్రఖ్యాత అర్చ్‌మెర్‌ అకాడమీలో సీటు వచ్చింది. చదువులో ముందుండే బైడెన్..  క్రీడల్లోనూ సత్తా చాటేవాడు. ఆర్చ్‌మెర్‌ ఫుట్‌బాల్‌ టీమ్‌లో ఆయన సభ్యుడు. బక్కపలచగా ఉండే బైడెన్‌ ‘పాస్‌లు’ అందించడంలో దిట్ట. 1961లో డెలావర్‌ విశ్వవిద్యాలయంలో చరిత్ర, రాజనీతి శాస్త్రం కోర్సులో చేరాడు. అక్కడ మొదటి రెండేళ్లు చదువు కంటే పార్టీలు, ఫుట్‌బాల్‌, అమ్మాయిలతోనే సమయం వృథా అయ్యిందని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. కానీ, అదే సమయంలో బైడెన్‌కు రాజకీయాలపై ఆసక్తి కలిగింది.

బహమాస్‌ ట్రిప్‌లో ప్రేమ..

బైడెన్‌ కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక సారి బహమాస్‌ యాత్రకు వెళ్లారు. అక్కడికి సిరాక్యూస్‌ విశ్వవిద్యాలయంలో చదువుతున్న నీలియా హంటర్‌ వచ్చారు. ఆమెను తొలిచూపులోనే  ప్రేమించారు. 1966లో ఆమెను పెళ్లి చేసుకున్నారు. 1968లో సిరాక్యూస్‌ విశ్వవిద్యాలయం లా స్కూల్‌ నుంచి న్యాయవిద్యను పూర్తి చేశారు. వెంటనే విల్మింగ్టన్‌లో ఒక లా సంస్థలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. అప్పటి నుంచే ఆయన డెమొక్రటిక్‌ పార్టీలో చురుగ్గా పనిచేయడం ప్రారంభించారు. 1970లో తొలిసారి డెమొక్రటిక్‌ పార్టీ తరపున ‘న్యూ కాజిల్‌ కౌంటీ కౌన్సిల్‌’కు ఎన్నికయ్యారు. 1971లో సొంతంగా లా సంస్థను ఏర్పాటు చేశారు.

కుర్ర సెనేటర్‌.. ఆసుపత్రిలో ప్రమాణ స్వీకారం

నీలియా, బైడెన్‌లకు జోసఫ్‌(బ్యూ), హంటర్‌, నవోమీ (అమీ) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. 1972లో ఆయన డెలావర్‌కు సెనేటర్‌గా ఎంపికయ్యారు. అప్పట్లో అమెరికా చరిత్రలో అతిచిన్న వయస్సులోనే సెనేటర్‌గా ఎంపికైన వారిలో బైడెన్‌ ఐదో వ్యక్తి. అయితే, ఆ సంతోషం బైడెన్‌కు ఎక్కువ రోజులు నిలవలేదు. అదే ఏడాది క్రిస్మస్‌కు వారం ముందు బైడెన్‌‌ భార్యాబిడ్డలు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో భార్య నీలియా, ఏడాది వయసున్న కుమార్తె అమీ మరణించారు. కుమారులు బ్యూ, హంటర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాదంతో కుంగిపోయిన ఆయన.. ఓ దశలో ఆత్మహత్య చేసుకొందామనుకున్నారు. కానీ, కుటుంబం అండగా నిలవడంతో ఆయన ధైర్యం కూడదీసుకున్నారు. వాషింగ్టన్‌లో జరిగిన సెనేటర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి వెళ్లలేదు. తమ కుమారులు చికిత్స పొందుతున్న ఆసుపత్రి గదిలోనే ప్రమాణ స్వీకారం చేశారు. పిల్లలను ఆ స్థితిలో వదిలేసి తాను వాషింగ్టన్‌ వెళ్లలేకపోయారు. దీంతో విల్మింగ్టన్‌లోనే ఎక్కువ సమయం గడిపారు. పిల్లల కోసం నిత్యం విల్మింగ్టన్‌-వాషింగ్టన్‌ మధ్య అమ్ట్రాక్‌ రైలులో డైలీ సర్వీస్‌ చేసేవారు. 1977లో జిల్‌ ట్రేసీ జాకబ్స్‌ అనే టీచర్‌ను రెండో వివాహం చేసుకున్నారు.

విదేశీ వ్యవహారాల నిపుణుడిగా..

1973-2009 వరకు ఆయన సెనేటర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన విదేశీ వ్యవహారాల కమిటీకి ఛైర్మన్‌గా సుదీర్ఘకాలం పనిచేశారు. సోవియట్‌తో కలిసి అణ్వాయుధాల నియంత్రణకు సంబంధించిన ఒప్పందాల్లో.. బాల్కన్‌ దేశాల్లో శాంతి స్థాపనకు.. సోవియట్‌ మాజీ దేశాలను చేర్చుకొని ‘నాటో’ కూటమి విస్తరించడంలో బైడెన్‌దే కీలక పాత్ర పోషించారు. తొలి గల్ఫ్‌ యుద్ధాన్ని వ్యతిరేకించిన వారిలో బైడెన్‌ కూడా ఉన్నారు. ఇరాక్‌ యుద్ధం విషయంలో జార్జి డబ్ల్యూ బుష్‌ వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. అమెరికాలోని నేర నియంత్రణకు సంబంధించి కీలక చట్టాల తయారీలో బైడెన్‌ కీలక పాత్ర పోషించారు. క్రైమ్‌ కంట్రోల్‌ అండ్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చట్టాన్ని ప్రవేశపెట్టిందీ ఆయనే. దీంతో అమెరికాలో నేర నియంత్రణకు పోలీసు అధికారుల సంఖ్య మరో లక్ష పెరిగింది.

రెండుసార్లు అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడి..

బైడెన్‌ దాదాపు 34 ఏళ్ల నుంచి అధ్యక్ష పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన 1987లోనే డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థి పోటీలో తాను ఉన్నట్లు ప్రకటించారు. కానీ, అప్పట్లో ఆయన ప్రసంగంలోని కొన్ని భాగాలను బ్రిటిష్‌ లేబర్ పార్టీ నాయకుడు నెయిల్‌ నాక్‌ ప్రసంగం నుంచి తీసుకొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతోపాటు అప్పట్లో తీవ్రమైన తలనొప్పితో బైడెన్‌ బాధపడేవారు. దీంతో పోటీ నుంచి వైదొలిగారు. తలకు శస్త్రచికిత్స చేయించుకునే క్రమంలో ఊపిరితిత్తుల్లో సమస్య తలెత్తింది. దీంతో ఆయన మరో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో ఏడు నెలల తర్వాత మళ్లీ కోలుకుని సెనేట్‌లో అడుగు పెట్టారు.

20 ఏళ్ల తర్వాత 2007లో బైడెన్‌ మళ్లీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి తాను పోటీలో ఉన్నట్లు ప్రకటించారు. కానీ హిల్లరీ క్లింటన్‌, బరాక్‌ ఒబామా వంటి నేతలు బరిలో ఉండటంతో బైడెన్‌కు అనుకున్న స్థాయిలో మద్దతు లభించలేదు. ఐయోవా కాకస్‌లో ఆయనకు ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లు లభించడంతో పోటీ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత బరాక్‌ ఒబామా డెమొక్రాట్ల తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఎంపికయ్యారు. తనకు చేదోడు వాదోడుగా ఉండేందుకు అనుభవజ్ఞుడైన బైడెన్‌ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకొన్నారు. అటు నల్ల జాతీయుల.. ఇటు శ్వేత జాతీయుల ఓట్లు కొల్లగొట్టడానికి ఇది డెడ్లీ కాంబినేషన్‌గా మారింది.

వీరి జోడీ 2008 ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన జాన్‌ మెక్‌కెయిన్‌, సారా పలిన్‌లను ఓడించింది. దీంతో బైడెన్‌ అమెరికాకు 47వ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరి జోడీ అత్యంత సమన్వయంతో పనిచేసింది. బరాక్‌ తెరపై ఉంటే.. బైడెన్‌ తెరవెనుక పాలసీల తయారీ, ఇతర విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవడంలో చురుగ్గా వ్యవహరించారు. ఇరాక్‌, అఫ్గానిస్థాన్‌లకు సంబంధించి విధానాల తయారీలో ఈయనదే కీలక పాత్ర. ఆర్థిక సంక్షోభ సమయంలో ప్రభుత్వ ప్యాకేజీలను చట్టసభల్లో ఆమోదింప చేయడంలో నేర్పుగా వ్యవహరించారు. దీంతో 2012లో ఇదే జోడీ మరోసారి ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ సారి బైడెన్‌ మరింత క్రియాశీలంగా వ్యవహరించారు. పన్నుల పెంపు, ఖర్చుల తగ్గింపు చర్యలకు శ్రీకారం చుట్టారు. న్యూటౌన్‌ పాఠశాలలో షూటింగ్‌ ఘటన తర్వాత అమెరికాలో తుపాకుల వినియోగానికి అడ్డుకట్ట వేసేలా పలు సూచనలు చేశారు. 2016 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా దిగాలని ఆశించారు. కానీ, తన రాజకీయ వారసుడిగా భావించిన కుమారుడు బ్యూ (46) మరణంతో జో కుంగిపోయారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడబోనని అధికారికంగా ప్రకటించారు.

2018లోనే పోటీకి సిద్ధమై..

బైడెన్‌ 2018లో ఓ ఇంటర్వ్యూలో తాను 2020 అధ్యక్ష ఎన్నికల బరిలో ఉండటాన్ని కొట్టిపారేయలేమని చెప్పారు. అన్నట్లే ఆయన డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి రేసులోకి వచ్చారు. ఆయనకు 32 శాతం ఆమోదం లభించగా.. హిల్లరీకి 18 శాతం.. బెర్నీ శాండర్స్‌కు 16శాతం మంది మొగ్గు చూపారు. 

లైంగిక వేధింపుల ఆరోపణలు..

మహిళలతో అనుచితంగా ప్రవర్తించినట్లు బైడెన్‌పై ఆరోపణలు కూడా ఉన్నాయి. నెవాడ స్టేట్‌ అసెంబ్లీకి చెందిన మాజీ సభ్యురాలు లూసీ ఫ్లోరా ఆయనపై ఆరోపణలు చేశారు. ప్రచార సమయంలో తనను బైడెన్‌ ముద్దాడారని పేర్కొన్నారు. దీనికి బైడెన్‌ తనదైన శైలిలో జవాబిచ్చారు. ‘లెక్కలేనన్ని హ్యాండ్‌ షేక్స్‌, హగ్స్‌, అభిమానం చూపించే విధానాలు ఉంటాయి. అయితే ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకే యామీ లాపూస్‌ అనే మహిళ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. నిధుల సమీకరణ కార్యక్రమంలో బైడెన్‌ ఇబ్బందికరంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఇక బైడెన్‌తో కలిసి గతంలో పనిచేసిన తారా రెయిడీ కూడా ఇటువంటి ఆరోపణలే చేశారు. 1993లో బైడెన్‌ లైంగికంగా వేధించారని 2020 మార్చిలో ఆరోపణలు చేశారు. ఇలా మొత్తం ఎనిమిది మంది మహిళలు బైడెన్‌పై ఆరోపణలు చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని