Updated : 30 Oct 2020 11:33 IST

బైడెన్‌ వస్తే అమెరికా మరో వెనిజులా: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రత పెరిగిపోతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ మధ్య మాటల యుద్ధం హద్దులు మీరుతోంది. అధ్యక్ష అభ్యర్థులు హుందాగా ప్రవర్తించడం పోయి.. స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని ఇప్పటికే విమర్శలు రేగాయి.  చాలాసార్లు వీరిద్దరి వాదప్రతివాదనలు వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లాయి. కాగా,  తాజాగా ట్రంప్‌ మరోసారి నోరుపారేసుకున్నారు. బైడెన్‌ లాంటి ‘చెత్త’ అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలోనే చూడలేదని తీవ్రంగా విమర్శించారు.  ప్రస్తుత ఎన్నికలు అమెరికా కలలకు.. సోషలిస్టుల పీడకలలకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెలానియాతో కలిసి గురువారం టంపాలో ట్రంప్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒక వేళ బైడెన్‌ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజులా మాదిరిగా మారిపోతుందని అన్నారు. ‘‘ దురదృష్టవశాత్తు డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనెజులా లాగా తయారైపోతుంది. కానీ, తాను అధికారంలో ఉన్నంత వరకూ అమెరికా ఎట్టిపరిస్థితుల్లోనూ సోషలిస్టు దేశంగా మారదు’’ అని ట్రంప్‌ అన్నారు. మన పిల్లలు అమెరికా కలలను వారసత్వంగా పొందాలో? లేదా సోషలిజం మాయలో పడి భవిష్యత్తును నాశనం చేసుకోవాలో ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘ మనం మార్క్సిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను, వామపక్ష తీవ్రవాదులను ఓడించ బోతున్నాం. అమెరికా ప్రజల కోసం మనం పోరాడబోతున్నాం.’’ అంటూ ఓటర్లను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు. 

అత్యంత చెత్త ప్రత్యర్థిపై పోటీ చేయాల్సి రావడం బాధగా ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బైడెన్‌ సోషలిస్టు భావజాలంతో ఉన్నారని, ఆయన అధికారంలోకి వస్తే అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. మరోవైపు కీలక రాష్ట్రాల్లో ట్రంప్‌ కంటే బైడెన్‌ వైపే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతుండటంపై ఆయన స్పందించారు. ఎవరెన్ని చెప్పినా కష్టపడి పని చేసేవారికే ప్రజలు ఓటు వేస్తారని, రిపబ్లికన్‌ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగేళ్లు తాను శ్వేతసౌధంలో ఉండటం ఖాయమన్నారు. రికార్డు స్థాయిలో భారీ విజయం నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్‌ 3న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని