Published : 10/06/2021 13:37 IST

White Paint: తెల్లరంగుతో ఉష్ణోగ్రతలకు కళ్లెం

భవనాల్లో 5 డిగ్రీల సెల్సియస్‌ వరకూ తగ్గించొచ్చు

కొత్త పెయింట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు 

హిమమయంగా ఉండే టండ్రా నేలలు, మంచు పర్వతాలు, ఆకాశంలో స్వేచ్ఛగా విహరించే మేఘాలు.. ఇలా భూమిపై శ్వేతవర్ణం ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. అయితే కేవలం పుడమికి శోభను తెచ్చే సప్త వర్ణాల్లో ఒకటిగా ఇది మిగిలిపోవడంలేదు. ఇది ధరణి వేడిని చల్లార్చే అత్యంత ముఖ్యమైన రంగు. భూమిని తాకే సూర్యకాంతిని పరావర్తనం చెందించి, ఉష్ణోగ్రతలను తగ్గించే సహజసిద్ధ సాధనం. ఈ సూత్రాన్ని అనుకరించడం ద్వారా నగరాల్లో వేడిని తగ్గించే ఆలోచనను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. భూమి మొత్తం మహాసముద్రాలతోనే నిండిపోయి, శ్వేత వర్ణపు ప్రాంతాలనేవే లేకుంటే సరాసరి ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్‌కు చేరే ప్రమాదం ఉంటుంది. ప్రస్తుతం ఇది 15 డిగ్రీలుగా ఉంది. అయితే భూమి మీద ప్రస్తుతం మంచు విస్తృతి తగ్గిపోవడం, మానవ చర్యల వల్ల చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పుల వంటి కారణాల వల్ల ఉపరితల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతోంది. 2050 నాటికి భూమిపై కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలు గణనీయంగా తగ్గకుంటే.. 2100 సంవత్సరం నాటికి పుడమి ఉష్ణోగ్రత.. ఇప్పటితో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్‌ మేర పెరిగే ప్రమాదం ఉంది. భూమి పరావర్తన సామర్థ్యం తగ్గడం కూడా ఇందుకు కారణమవుతోంది. అందువల్ల మన భవితను నిర్దేశించడంలో శ్వేత వర్ణానిది కీలక పాత్ర.

బేరియం సల్ఫేట్‌తో.. 

గ్రీస్‌లోని శాంటోరిని దీవుల్లోని ప్రఖ్యాత శ్వేత భవనాలు.. ఏదో ఆకర్షణకు ఉద్దేశించినవి కావు. వేడిని పరావర్తనం చెందించేలా చూడటం వీటి లక్ష్యం. ఈ సామర్థ్యం తెల్ల రంగుకు ఉందన్న విషయంపై మానవుడికి శతాబ్దాల కిందటే అవగాహన ఉంది. సంప్రదాయబద్ధంగా భవనాలకు జిప్సమ్‌ అనే ఒకరకం తెల్ల రంగును ఉపయోగిస్తుంటారు. అందులో క్యాల్షియం సల్ఫేట్‌ ఉంటుంది. అయితే వేడిని తగ్గించడంలో బేరియం సల్ఫేట్‌ ఇంకా సమర్థంగా పనిచేస్తుందని తాజా పరిశోధన తేల్చింది. ఈ పదార్థంతో తయారయ్యే పెయింట్లు భవనాలను తాకే సౌర రేడియోధార్మికతను మరింత మెరుగ్గా అంతరిక్షంలోకి పరావర్తనం చెందిస్తాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అందులోని నానో రేణువులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా పరారుణ తరంగదైర్ఘ్యాలను ఇది సమర్థంగా తిప్పికొడుతోంది. అలా పరావర్తనం చెందిన సౌర శక్తి.. భూ వాతావరణంలో చిక్కుకుపోయి, భూతాపాన్ని పెంచడానికి బదులు అంతరిక్షంలోకి వెళ్లిపోతుంది. 

వేడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ రకం పెయింట్‌ను వేయడం వల్ల భవనాలను చల్లగా ఉంచొచ్చు. నిజానికి పట్టణాల్లో వేడిని నియంత్రించడం పెను సవాలే. అక్కడ భవనాలు, జనసాంద్రత వల్ల ఉష్ణోగ్రతలు భరించలేని స్థాయికి పెరుగుతుంటాయి. ముఖ్యంగా వేసవి నెలల్లో వేడి మరీ పెరుగుతుంది. బేరియం సల్ఫేట్‌ పెయింట్‌ వేసిన భవనాల్లో ఉష్ణోగ్రతలు 4.5 డిగ్రీల సెల్సియస్‌ మేర తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది. అందువల్ల ఏసీలపై ఆధారపడటం తగ్గుతుంది. ఫలితంగా విద్యుత్‌ ఖర్చులు ఆదా అవుతాయి. 

బేరియం సల్ఫేట్‌ను ముడి బేరైట్‌ ఖనిజం నుంచి సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా విద్యుత్‌ అవసరం. ఇది ఈ పెయింట్‌కు ఒకింత ప్రతికూలాంశంగా మారింది. 

ప్రకృతి నుంచీ.. 

భవనాల పరావర్తన సామర్థ్యాన్ని పెంచడానికి బేరియం సల్ఫేట్‌ ఒక్కటే మార్గం కాదు. ఇందుకోసం ప్రకృతి నుంచీ పాఠాలు నేర్చుకోవచ్చు. ఈ దిశగా.. తెల్లగా ఉండే జంతువుల ఉపరితలాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగించారు. జంతువుల కేశాలు, ఈకలు, సీతాకోకచిలుకల రెక్కలపై పరిశోధనల ద్వారా.. ఒక ఆకృతిలో వేడిని ప్రకృతి ఎలా నియంత్రిస్తుందన్నది తెలుసుకోవచ్చు. లెపిడియోటా స్టిగ్మా అనే ఒక రకం శ్వేత వర్ణపు బీటిల్స్‌ రెక్కలు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాయి. వాటిపై ఉన్న నానో ఆకృతులే ఇందుకు కారణం. అవి కాంతిని మెరుగ్గా పరావర్తనం చెందిస్తాయి. ఇలాంటి కిటుకులను అనుకరించడం ద్వారా నగరాలను చౌకలో చల్లగా ఉంచే మరిన్ని పరిజ్ఞానాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని