టిక్‌టాక్‌పై చర్యల దిశగా ఆస్ట్రేలియా!

చైనా దుందుడుకు వైఖరి టిక్‌టాక్‌పై తీవ్రంగా పడింది! డ్రాగన్‌ మెడలు వంచేందుకు చాలా దేశాలు ఇప్పుడిదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సమాచార భద్రత, భారతీయుల వ్యక్తిగత సమాచారం, గోప్యత, సార్వభౌమత్వానికి భంగం...

Published : 20 Jul 2020 19:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా దుందుడుకు వైఖరి టిక్‌టాక్‌పై తీవ్రంగా పడింది! డ్రాగన్‌ మెడలు వంచేందుకు చాలా దేశాలు ఇప్పుడిదే మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. సమాచార భద్రత, భారతీయుల వ్యక్తిగత సమాచారం, గోప్యత, సార్వభౌమత్వానికి భంగం వాటిల్లుతోందని టిక్‌టాక్‌ సహా 59 చైనీస్‌ యాప్‌లను భారత్‌ నిషేధించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం భారత్‌ బాటనే అనుసరించాలని అక్కడి కాంగ్రెస్‌ సభ్యులు కొందరు లేఖ రాశారు. నిషేధం దిశగా ప్రయత్నాలూ సాగుతున్నాయి!

తాజాగా ఆస్ట్రేలియా సైతం ఇదే అస్త్రం ప్రయోగించనుందని తెలిసింది. తమ దేశ పౌరుల సమాచారం బయటకు వెళ్తోందా? గోప్యతకు భంగం కలుగుతోందా? సార్వభౌమత్వానికి నష్టం వాటిల్లుతోందా అనే కోణంలో టిక్‌టాక్‌ను తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. చైనా కమ్యూనిస్టు పార్టీతో టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు సంబంధాలు ఉన్నాయా అని ఆరా తీస్తోంది. ఆ దేశం హోం మంత్రిత్వ శాఖ, అటార్నీ జనరల్‌ టిక్‌టాక్‌ ఆపరేషన్స్‌ గురించి చర్చించారని సమాచారం.

‘ఇప్పుడు తీసుకుంటున్న చర్యలకు తోడుగా మున్ముందు మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందో లేదో పరిశీలిస్తాం. ఆ విషయం చెప్పేందుకు మేమేమీ సంశయించం’ అని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ సైతం అన్నారు. టిక్‌టాక్‌పై మరింత పరిశీలన అవసరమా? ఈ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా విదేశీ జోక్యం ఉంటుందా తెలుసుకొనేందుకు పార్లమెంటరీ దర్యాప్తు చేయించాలని లేబర్‌ సెనెటర్‌ జెన్నీ మెక్‌ అలిస్టర్‌ పేర్కొన్నారు. తియానన్‌మెన్‌ స్క్వేర్‌, హాంకాంగ్‌ స్వేచ్ఛకు సంబంధించిన అంశాలను టిక్‌టాక్‌ తొక్కిపెట్టినట్టు తెలుస్తోందని వెల్లడించారు. ఇది ఆసీస్‌ చట్టాలకు వ్యతిరేకమే అని అన్నారు. పరిస్థితులన్నీ చూస్తుంటే నిషేధం వైపుగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది.

కరోనా వైరస్‌ విషయంలో డ్రాగన్‌కు వ్యతిరేకంగా ఆస్ట్రేలియా ఘాటుగా వ్యాఖ్యలు చేసింది. మహమ్మారి విషయంపై పారదర్శకంగా వ్యవహరించలేదని, వివరాలను వెల్లడించలేదని మోరిసన్‌ విమర్శించారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా చేసే గొడ్డుమాంసం ఎగుమతులను చైనా అడ్డుకుంది. తనిఖీల పేరిట తమ నౌకాశ్రయాల్లోనే నిలిపివేసింది. దాంతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని