ఇవాళ కృష్ణాష్టమి.. జైలు కావాలా? బెయిలా?

ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్‌ కావాలా?..............

Published : 12 Aug 2020 17:36 IST

సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

దిల్లీ: ఓ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టులో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేటుచేసుకుంది. శ్రీకృష్ణుడి జన్మస్థలం కావాలా? బెయిల్‌ కావాలా? అంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే సరదాగా వ్యాఖ్యానించారు. మరో పిటిషన్‌పై విచారణ సందర్భంగా మహాభారతాన్ని ఉదహరించారు. 

1994లో భాజపాకు చెందిన రాజకీయ నేత హత్య కేసులో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేంద్ర వాల్వి, మరో ఐదుగురు ఆ పార్టీ కార్యకర్తలు జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. వాల్వి బెయిల్‌ పిటిషన్‌ మంగళవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సీజేఐ ‘‘ఇవాళ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడు పుట్టింది జైలులోనే. మరి మీకు జైలు కావాలా? బెయిలు కావాలా?’’ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. అందుకు ఆయన బెయిల్‌ కావాలని చెప్పడంతో ‘‘మంచిది. మీకు పెద్దగా మతం పట్టింపులు లేవనుకుంటా’’ అంటూ బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తీర్పు వెలువరించారు.

సీఏఏకు సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగానూ సీజేఐ ఇలానే సరదా వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు సంబంధించి డాక్టర్‌ కఫీల్‌ ఖాన్‌ను వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరుపరచడాన్ని నేరుగా హాజరైనట్లు పరిగణిస్తారా? అన్న సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ సందేహానికి సీజేఐ సరదాగా సమాధానమిచ్చారు. ‘‘ఇక్కడ మహా భారత కాలం నుంచి వర్చువల్‌ విచారణలు జరుగుతున్నాయి’’ అంటూ చమత్కరించారు. వీడియో కాన్ఫరెన్స్‌ను హాజరుగానే పరిగణిస్తామని స్పష్టతనిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని