ట్విటర్ హ్యాక్‌: ఇదో కఠినమైన రోజు..సీఈవో

సైబర్‌ నేరగాళ్ల ధాటికి ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం వణికిపోయింది. క్రిప్టో కరెన్సీ మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లు తాజాగా ప్రపంచ కుబేరులు, ప్రముఖులే లక్ష్యంగా వారి ధృవీకరణ ఖాతాలపై దాడికి పాల్పడడంతో ట్విటర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హ్యాకర్ల దాడిపై తాజాగా కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. ‘ఈ ఊహించని ఘటనను భయానక దాడిగా భావిస్తున్నాం. ఇది మాకెంతో కఠినమైన రోజు. నిజంగా ఏం జరిగిందో అనే విషయంపై విశ్లేషిస్తున్నాం. మేము ధృవీకరించుకున్న వెంటనే మీతో ఆ సమాచారాన్ని పంచుకుంటాం’ అని కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే ట్విటర్‌లో‌ పేర్కొన్నారు.

Published : 17 Jul 2020 01:48 IST

‘సమన్వయ సామాజిక ఇంజనీరింగ్‌ దాడి’గా అభివర్ణించిన జాక్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైబర్‌ నేరగాళ్ల ధాటికి ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ‘ట్విటర్‌’ వణికిపోయింది. క్రిప్టోకరెన్సీ మోసాలకు పాల్పడే సైబర్‌ నేరగాళ్లు తాజాగా ప్రపంచ కుబేరులు, ప్రముఖులే లక్ష్యంగా వారి ట్విటర్‌ అధికారిక ఖాతాలపై దాడికి పాల్పడడంతో ట్విటర్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ హ్యాకర్ల దాడిపై తాజాగా కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే స్పందించారు. ‘ఈ ఊహించని ఘటనను భయానక దాడిగా భావిస్తున్నాం. ఇది మాకెంతో కఠినమైన రోజు. నిజంగా ఏం జరిగిందో అనే విషయంపై విశ్లేషిస్తున్నాం. మేము ధ్రువీకరించుకున్న వెంటనే మీతో ఆ సమాచారాన్ని పంచుకుంటాం’ అని కంపెనీ సీఈవో జాక్‌ డోర్సే ట్విటర్‌లో‌ పేర్కొన్నారు. తమ అంతర్గత వ్యవస్థల సాయంతో ఉద్యోగులను కూడా లక్ష్యంగా చేసుకొని దాడికి ప్రయత్నించినట్లు భావిస్తున్నామని అని డోర్సే అభిప్రాయడ్డారు. వీటి కారణాలను విశ్లేషిస్తున్నామని.. సాధ్యమైనంత తొందరలో సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ట్విటర్‌ టీం కృషిచేస్తోందని ఆయన అన్నారు.

అంతకుముందు, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, అమెజాన్‌ సీఈవో జెఫ్ బెజోస్‌, బిల్‌గేట్స్‌, వారెన్‌బఫెట్‌, ఎలాన్‌ మస్క్‌తోపాటు మరికొందరి ట్విటర్‌ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. వీటితోపాటు బ్లూమ్‌బర్గ్‌, ఉబెర్‌, యాపిల్‌ కంపెనీల అధికారిక ట్విటర్‌ ఖాతాలు కూడా హ్యాకర్ల బారిన పడినట్లు సమాచారం. క్రిప్టో కరెన్సీ రూపంలో తమకు డొనేషన్లు కావాలంటూ వారి ఖాతాల్లో సైబర్‌ నేరగాళ్లు మెసేజ్‌లు పెట్టినట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ట్విటర్‌ సాంకేతిక బృందం వెంటనే ఆ అనుమానాస్పద ట్వీట్లను తొలగించింది. ప్రస్తుతం హ్యాక్‌కు గురైన ట్విటర్ ఖాతాలు మాత్రం యథావిధిగా పనిచేస్తున్నాయని పేర్కొంది.

ఇదిలా ఉంటే, బిట్‌కాయిన్‌ ఆశచూపి స్కామ్‌ చేసే ఘటనలు సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. 2017లో ఇలాంటి భారీ హ్యాక్‌ జరిగినప్పటికీ అది కొన్ని సంస్థల ఖాతాలపైనే జరిగింది. కానీ, ఈసారి ప్రపంచకుబేరులు, ప్రముఖుల అధికారిక ఖాతాలపై దాడిచేయడం అనూహ్య పరిణామమని సైబర్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనే అతిపెద్ద హ్యాకింగ్‌లలో దీనిని కూడా ఒకటిగా పేర్కొన్నారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని