ఆ మారణహోమానికి 12ఏళ్లు
అది 2008 నవంబరు 26..
సమయం: రాత్రి 8 గంటలు..
ప్రదేశం: ముంబయిలోని కొలాబా సముద్రతీరం..
10 మంది గుర్తుతెలియని వ్యక్తులు స్పీడ్‌బోట్లలో అక్కడకు చేరుకొన్నారు. ఆ తర్వాత రెండు బృందాలుగా విడిపోయారు. అనుమానం వచ్చిన స్థానిక మత్స్యకారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, అటువైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు.
సమయం: రాత్రి 9.30 గంటలు
ప్రదేశం: ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్
రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్‌లోకి ఇద్దరు ముష్కరులు చొరబడ్డారు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారి వద్ద ఉన్న ఏకే-47 తుపాకులు నిప్పులు కక్కాయి. ప్రజలపై తూటాల వర్షం కురిసింది. కన్పించిన వారిని పిట్టల్లా కాల్చి చంపారు. ఊహించని దాడికి ప్రజలు అల్లాడిపోయారు. భయంతో పరుగులు తీశారు. పోలీసులు అక్కడకు చేరుకునే లోపే 58 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అక్కడి నుంచి పారిపోయిన ముష్కరులు వీధుల్లోకి వచ్చి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ తర్వాత వరుసగా కామా హాస్పిటల్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, నారిమన్ లైట్ హౌస్ ఇలా వరుసగా 12 చోట్ల ఏకధాటిగా కాల్పులు, బాంబుల మోత మోగింది. దాదాపు 60 గంటల పాటు సాగిన ఈ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అనేకమంది ప్రజలు క్షతగాత్రులయ్యారు.
దేశ వాణిజ్య రాజధానిలో ముంబయిలో బాంబు పేలుళ్లు జరిగి నేటికి సరిగ్గా 12ఏళ్లు. లష్కరే తోయిబా ఉగ్రమూకకు చెందిన 10 మంది ముంబయిలో 12 చోట్ల నరమేధం సృష్టించారు. పోలీసులు స్పందించలోపే ఘోరం జరిగిపోయింది. అయితే, పేలుళ్లకు పాల్పడిన ముష్కరుల్లో 9 మందిని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. మిగిలిన ఒక ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ప్రాణాలతో పట్టుకున్నారు. ఈ కేసులో అతడికి శిక్ష పడటంతో ఆ తర్వాత నాలుగేళ్లకు ఉరితీశారు. ఉగ్రవాదులను అడ్డుకునే క్రమంలో అప్పటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్ హేమంత్ కర్కరే, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్‌లోని మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్, ముంబయి అదనపు పోలీస్ కమిషనర్ అశోక్ కాంతే తదితరులు అమరులయ్యారు.
ముష్కరుల దాడితో ముంబయి వణికిపోయింది. ఘటనా స్థలాల్లో రక్తం ఏరులైపారింది. శరీర అవయవాలు చెల్లాచెదురుగా పడి భయంగొల్పింది. హాహాకారాలు, క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోధనలు మిన్నంటాయి. ఆ భయానక రాత్రిని తల్చుకుంటే ముంబయి వాసులకు ఇప్పటికీ ఒళ్లు గగుర్పొడుతూనే ఉంటుంది. తమ వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలు నేటికీ కన్నీరుమున్నీరవుతున్నాయి.
ముంబయి పేలుళ్లు జరిగి 12ఏళ్లను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు అమరులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
♦ ‘పోలీసుల శౌర్యం, త్యాగాన్ని ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈ భయానక దాడిలో తమవారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న, ప్రోత్సహిస్తున్న దేశాలను ప్రపంచమంతా కలిసి ఏకాకి చేయాల్సిన సమయం వచ్చింది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు.
♦ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విటర్ వేదికగా ముంబయి దాడి ఘటనను గుర్తుచేసుకున్నారు. 26/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు. ‘ముష్కరులను అడ్డుకునే క్రమంలో మీ ధైర్యం, త్యాగానికి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది’ అని అమరవీరుల త్యాగాలను కొనియాడారు.
♦ దక్షిణ ముంబయిలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో కొత్తగా నిర్మించిన స్మారకం వద్ద మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, రాష్ట్ర మంత్రులు నివాళులర్పించారు. అమరవీరులకు అంజలి ఘటించారు.
-ఇంటర్నెట్‌డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Bangla Fuel Crisis: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న పెట్రోల్ ధరలు.. ఒకేసారి 52శాతం పెరుగుదల
-
Movies News
Social Look: ‘పచ్చళ్ల స్వాతి’గా పాయల్.. మాల్దీవుల్లో షాలిని.. శ్రీలీల డబ్బింగ్!
-
Sports News
CWG 2022: భారత్‌కు పతకాల పంట.. మొత్తం 61 పతకాలు..
-
India News
Kejriwal: మంత్రులకు ఉచిత విద్యుత్ ఇస్తుండగా.. సామాన్యులకు ఇస్తే తప్పేంటి..?
-
India News
UP: మహిళపై దాడి.. భాజపా నేతకు యోగి సర్కార్ ఝలక్..!
-
General News
Picnic: ఒక్కసారిగా వరద.. కొట్టుకుపోయిన 14 కార్లు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- China: చైనా విన్యాసాలు భస్మాసుర హస్తమే..!
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- Taapsee: నా శృంగార జీవితం అంత ఆసక్తికరంగా లేదు: తాప్సి
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- Hyderabad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్