Published : 28 Sep 2020 17:16 IST

బహిరంగ చర్చకు ట్రంప్‌-బైడెన్‌ సిద్ధం!

సెప్టెంబర్‌ 29న తొలి డిబేట్‌

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలంటేనే ప్రపంచం మొత్తానికి ఆసక్తి. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతోన్న సమయంలో దేశంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రిపబ్లికన్‌ నేత, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి అధికారం కోసం ప్రయత్నిస్తుండగా డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ గట్టి పోటీనే ఇస్తున్నారు. మరికొద్ది గంటల్లోనే వీరిద్దరూ ఒకేవేదికపై తలపడనున్నారు. సెప్టెంబర్‌ 29న ఇద్దరు నాయకులు ముఖాముఖిగా బహిరంగ చర్చలో పాల్గొని ప్రత్యర్థుల ప్రశ్నలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇప్పటివరకు ఇద్దరికీ ఉన్న ట్రాక్‌ రికార్డులతోపాటు ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఆర్థిక వ్యవస్థ, శాంతి భద్రతలు, విదేశాంగ విధానం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు.

అమెరికాలో అధ్యక్ష పదవికి పోటీపడుతున్న నాయకులు బహిరంగంగా చర్చించడం గతకొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం డొనాల్డ్‌ ట్రంప్‌, జోబైడెన్‌ ముఖాముఖి చర్చకు సిద్ధమయ్యారు. ఎన్నికల ముందు మూడుసార్లు జరిగే ఈ ముఖాముఖి చర్చలను ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ కమిషన్‌(సీపీడీ) నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా తొలి చర్చ సెప్టెంబర్‌ 29న జరుగుతుంది. ఫాక్స్‌ న్యూస్‌ యాంకర్‌ క్రిస్‌ వాల్లేస్‌ ఆధ్వర్యంలో తొలి డిబేట్‌ జరుగనుంది. అక్టోబర్ ‌15, 22 తేదీల్లో జరిగే మరో రెండు చర్చలను సీ-స్పాన్‌, ఎన్‌బీసీ వార్త సంస్థలు నిర్వహించనున్నాయి. ప్రెసిడెన్షియల్‌ డిబేట్‌ కోసం ఇప్పటికే తాను సన్నద్ధమవుతున్నట్లు ట్రంప్‌ తాజాగా వెల్లడించారు.

ఇక ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న నాయకుల మధ్య ఒకసారి ఇలాంటి చర్చ ఉంటుంది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌ మరోసారి పోటీలో ఉండగా, డెమొక్రాటిక్‌ తరుపున కమలా హారిస్‌ పోటీలో ఉన్నారు. అక్టోబర్‌ 7న జరిగే వీరి ముఖాముఖి చర్చను యూఎస్‌ఏ టుడే జర్నలిస్ట్‌ సుసాన్‌ పేజ్‌ నిర్వహిస్తారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష డిబేట్‌లకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామని సీపీడీ కో-ఛైర్మన్‌ ఫ్రాన్క్‌ ఫారెన్‌కోఫ్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని దాదాపు 5 నుంచి 15కోట్ల మంది చూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తొలి ప్రెసిడెన్షియల్‌ డిబేట్..!

అమెరికాలో అధ్యక్షపదవికి పోటీపడే అభ్యర్థులు బహిరంగంగా ముఖాముఖి చర్చల్లో పాల్గొనడం 1960నుంచి మొదలైంది. సెప్టెంబర్‌ 26, 1960 సంవత్సరంలో చికాగోలో నిర్వహించిన తొలి డిబేట్‌లో జాన్‌ ఎఫ్‌ కెన్నడీ, రిచర్డ్‌ నిక్సాన్‌ పాల్గొన్నారు. అలా ఆ సంవత్సరం ఇద్దరు అభ్యర్థులు నాలుగు సార్లు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చా కార్యక్రమాలను టీవీల్లో ప్రసారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో జాన్‌ కెన్నడీ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. అలా ఆ కార్యక్రమం అమెరికా రాజకీయాల్లోనే నూతన అధ్యాయానికి తెరతీసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అధ్యక్ష బరిలోఉండే అభ్యర్థులు ముఖాముఖి చర్చలో పాల్గొనే సంప్రదాయం కొనసాగుతోంది. అనంతరం వీటిని పక్షపాతరహితంగా నిర్వహించేందుకు 1987లో ప్రెసిడెన్షియల్‌ డిబేట్స్‌ కమిషన్‌ (సీపీడీ)ను ఏర్పాటు చేశారు. అయితే, సీపీడీ అక్కడి ప్రభుత్వం నుంచి కానీ, ఏ రాజకీయ పార్టీ, అభ్యర్థి నుంచి ఎటువంటి నిధులు స్వీకరించదు. ఎన్నికల ప్రచారంలో వ్యక్తిగతంగా కాకుండా ఇలాంటి బహిరంగ చర్చల్లో అభ్యర్థులు పాల్గొనడం ద్వారా తాము గెలుపొందితే, అనుసరించే విధానాలను, చేపట్టే కార్యక్రమాలను ఓటర్లు సులువుగా తెలుసుకునే వీలుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని