దిగొచ్చిన ట్రంప్‌

ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని సదరు యంత్రాంగాన్ని ఆదేశించారు.......

Updated : 24 Nov 2020 12:34 IST

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు అంగీకారం

వాషింగ్టన్‌: ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని సదరు యంత్రాంగాన్ని ఆదేశించారు. పరోక్షంగా ఓటమిని అంగీకరిస్తూనే.. ఎన్నికల ఫలితాలపై తాను చేస్తున్న పోరాటం కొనసాగుతుందన్నారు. 

దేశ ప్రయోజనాల దృష్ట్యా అధికార బదిలీకి కావాల్సిన ప్రక్రియను ప్రారంభించాలంటూ ట్రంప్‌ అధికారుల్ని ఆదేశించారు. ఈ సందర్భంగా అధికార బదిలీలో కీలక పాత్ర పోషించే ‘జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌’(జీఎస్‌ఏ) విభాగం చీఫ్‌ ఎమిలీ మర్ఫీపై అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు.

‘‘మన దేశం పట్ల విశ్వాసం, నిబద్ధత కలిగిన ఎమిలీ మర్ఫీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత కొన్ని రోజులుగా ఆమెను తీవ్రంగా వేధిస్తున్నారు. ఇకపై ఇది కొనసాగాలని నేను అనుకోవడం లేదు. ఫలితాలపై మా న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంటుంది. అంతిమంగా మేమే విజయం సాధిస్తామని నేను నమ్ముతున్నాను. అయినప్పటికీ, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిబంధనల ప్రకారం అధికార బదిలీకి అనుసరించాల్సిన ప్రక్రియను ప్రారంభించాలని ఎమిలీని కోరుతున్నాను. మా అధికార బృందానికి కూడా నేను అదే చెప్పాను’’ - ట్రంప్‌, అమెరికా అధ్యక్షుడు

ట్రంప్‌ అధికారిక ప్రకటనకు ముందే బైడెన్‌ గెలుపును జీఎస్‌ఏ గుర్తించింది. అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ బైడెన్‌ బృందానికి మర్ఫీ లేఖ రాశారు. ఎన్నికల్లో విజేతపై స్పష్టత రాగానే జీఎస్‌ఏ వారి గెలుపును అధికారికంగా గుర్తించడం ఆనవాయితీ. దాంతో అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలుత ప్రభుత్వ భవనాలు, అధికారులు, పరికరాల వినియోగానికి బైడెన్‌ బృందానికి అనుమతి ఇవ్వాలి. అందుకు కావాల్సిన నిధులను కేటాయించాలి. ట్రంప్‌ ఓటమిని అంగీకరించకపోవడంతో మర్ఫీ ఈ ప్రక్రియను ఆలస్యం చేశారు. దీంతో వివిధ వర్గాల నుంచి ఆమె తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఈ సందర్భంగా ఆమె వివరణ ఇచ్చారు. 

‘‘నా విచక్షణాధికారాల మేరకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నాపై ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. అలాగే జీఎస్‌ఏలో పనిచేసే అధికారులపైనా ఎలాంటి ప్రభావం లేదు. అధికార బదిలీ ప్రక్రియను జాప్యం చేయాలని మమ్మల్ని ఎవరూ ఆదేశించలేదు’’ అని మర్ఫీ వివరించారు.

ట్రంప్‌ నిర్ణయాన్ని బైడెన్‌ స్వాగతించారు. అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇదొక ముందడుగు అని వ్యాఖ్యానించారు. ‘‘బైడెన్‌, కమలా హారిస్‌ గెలిచారని జీఎస్‌ఏ చీఫ్‌ అధికారికంగా అంగీకరించారు. రాబోయే పాలకవర్గం అన్ని వనరుల్ని సద్వినియోగం చేసుకునేందుకు అనుమతించారు. అధికార బదిలీ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఇదో కీలక చర్య. ఈరోజు తీసుకున్న నిర్ణయం దేశం ఎదుర్కొంటున్న కరోనా మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడం వంటి అనేక సవాళ్ళకు పరిష్కారం కనుగొనేందుకు మార్గం సుగమం చేస్తుంది’’ అని బైడెన్‌ బృందం ఓ ప్రకటనలో పేర్కొంది.   


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని