Published : 07 Nov 2020 01:23 IST

ట్రంప్‌నకు మద్దతు కరువయ్యిందా..?

సొంతపార్టీ నేతలే మౌనంగా ఉన్నారన్న ట్రంప్‌ జూనియర్‌

వాషింగ్టన్‌: అమెరికా ఓట్ల కౌంటింగ్‌ కొనసాగుతున్న వేళ.. గెలుపు ఎవరిదనే విషయంపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఓట్ల లెక్కింపు ఆపాలని కోరుతూ..అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ న్యాయపోరాటం చేస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు సొంత పార్టీనుంచే మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ..వారిపై పోరాడుతున్న తమకు రిపబ్లికన్‌ పార్టీ నుంచే మద్దతు లభించడం లేదని ట్రంప్‌ కుమారుడు ట్రంప్‌ జూనియర్‌ ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పార్టీలో కీలక నేతగా ఉన్న నిక్కీ హేలీ, ఈ వ్యవహారంపై మాట్లాడక పోవడంపై ట్రంప్‌ జూనియర్‌ మండిపడ్డారు. 2024లో ఎన్నికల్లో అధ్యక్ష పదవిపై ఆశలుపెట్టుకున్న కొందరు రిపబ్లికన్‌లు, ప్రస్తుతం ట్రంప్‌ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా మౌనంగా ఉన్నారని ఆమెను పరోక్షంగా విమర్శించారు.

‘ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఎన్నికల ప్రక్రియపై నిజంగా పోరాడుతున్నది, ఎవరు మౌనంగా కూర్చున్నారనే విషయాన్ని ప్రతిఒక్కరూ గమనించాలి. గతకొన్ని దశాబ్దాలుగా రిపబ్లికన్లు వెనుకబడి ఉండడం వల్లే ఇతర పక్షాలు ఇలా వ్యవహరిస్తున్నాయి. ఇలాంటి చర్యలకు ముగింపు పలికేందుకు ప్రతిఒక్కరు కృషిచేయాలి’ అని ట్విటర్‌లో ట్రంప్‌ జూనియర్‌ అభిప్రాయపడ్డారు.

బయట నుంచి అంతంతే..!

ఎన్నికల ఫలితాలు కీలక దశకు చేరుకున్న సమయంలో.. కేవలం సొంతపార్టీ నుంచే కాకుండా ట్రంప్‌నకు బయటనుంచి కూడా మద్దతు లభించడం లేదనే వాదన ఉంది. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల్లో జోబైడెన్‌ ఆధిక్యంలో ఉండటం, ట్రంప్‌నకు కాస్త ఆధిక్యం తగ్గడం కనిపిస్తోంది. బైడెన్‌ ఆధిక్యం ఉన్నచోట్ల కౌంటింగ్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తోన్న ట్రంప్‌ ప్రచార బృందం వీటిపై ఇప్పటికే న్యాయస్థానాల్లో పోరాడుతోంది. ఓట్ల లెక్కింపును వెంటనే ఆపాలని కోర్టులను ఆశ్రయించినప్పటికీ.. మిషిగన్‌, జార్జీయా కోర్టుల్లో ట్రంప్‌ బృందానికి చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో ఇంకా పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్‌ పార్టీ కీలక నేతల నుంచి ట్రంప్‌నకు మద్దతు లభించడం లేదు. ముఖ్యంగా నిక్కీ హేలీ వంటి సీనియర్‌ నేతలు మౌనంగా ఉండటాన్ని ట్రంప్‌ కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అయితే, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఎలాంటి రుజువులు లేకుండానే ట్రంప్‌ విమర్శలు చేయడంతో చాలా మంది రిపబ్లికన్‌ నేతలు మాట్లాడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతున్న సమయంలోనూ అమెరికాలో కొన్ని మీడియా సంస్థలు ఆయన ప్రసంగాన్ని నిలిపివేశాయి.

ట్రంప్‌ను‌ బహిరంగంగానే విమర్శించే నిక్కీ..

ఇదిలాఉంటే, 2024లో అధ్యక్ష పదవికి పోటీ నిక్కీహేలీ పోటీపడే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పర్యాయమే నిక్కీ హేలీ అధ్యక్షపదవికి పోటీ పడతారని కూడా తొలుత వార్తలు వచ్చాయి. అయితే, వీటిని నిక్కీ హేలీ పలుసార్లు ఖండించారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. గతంలో ట్రంప్‌ తీసుకున్న కొన్ని చర్యలను నిక్కీ హేలీ పలుసందర్భాల్లో  విమర్శించారు. డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడు కావడానికి ముందు నిక్కీ హేలీ దక్షిణ కరోలినా గవర్నరుగా పనిచేశారు. 2010, 2014 రెండు పర్యాయాలు ఈ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అయితే, 2016లో ట్రంప్‌ ప్రభుత్వంలో చేరే వరకు ద.కరోలినా గవర్నరుగా ఉన్నారు. అనంతరం ఐక్యరాజ్యసమితిలో కీలక పదవిలో కొనసాగారు. నిక్కీహేలీ భారత సంతతికి చెంది వ్యక్తి కావడం విశేషం.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని