Updated : 18/09/2020 14:15 IST

జో బైడెన్‌ వైపే అమెరికన్‌ ఇండియన్ల మొగ్గు: సర్వే

వాషింగ్టన్‌: భారతీయ ఓటర్లు తనవైపే ఉన్నారని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం ఆత్మరక్షణలో పడ్డారు. భారతీయ అమెరికన్ల ఓట్లు తమవేనంటూ రిపబ్లికన్లు ధీమాగా ఉండటం ఇకపై చెల్లదని ఇటీవలి ఓ సర్వేలో వెల్లడైంది. ఇండియా స్పోరా, ఆసియా అమెరికన్స్‌ అండ్‌ పసిఫిక్‌ ఐలాండర్స్‌ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మెజారిటీ భారతీయ అమెరికన్లు జో బైడెన్‌కే తమ ఓటు అని చెబుతున్నట్టుగా తెలుస్తోంది.

భారతీయుల మద్దతు.. ఎవరికెంతంటే

ఈ సర్వే ప్రకారం 66 శాతం మంది భారతీయ అమెరికన్లు బిడెన్‌కు మద్దతిస్తుండగా.. కేవలం 28శాతం మాత్రమే తాము ట్రంప్‌ పక్షమని చెప్పారు. ఎన్నికల సమయానికి ఈ సంఖ్య 30 శాతానికి మించదని పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన ట్రంప్‌ తన దుందుడుకు చర్యలతో సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంటున్నారని వారు అంటున్నారు. హెచ్‌-1బీ వీసా జారీపై నిషేధాజ్ఞలు తదితర నిర్ణయాల ప్రభావం భారతీయ ఓటర్లపై పడింది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ ఉదంతం, కరోనా వైరస్‌ కట్టడి తదితర విషయాల్లో ఆయన ప్రతిష్ట మసకబారింది. ఇక 2009 నుంచి 2017 వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ (77) భారతీయులతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. అదేవిధంగా కమలా హ్యారిస్‌ను వ్యూహాత్మకంగా తొలి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకుని చరిత్ర సృష్టించారు. ఒకరకంగా ట్రంప్‌పై వ్యతిరేకతే బైడెన్‌కు కలసివచ్చే మరో అంశమని చెప్పవచ్చు.

బలపడుతున్న భారతీయులు

అమెరికాలో ఓటు హక్కు కలిగిన భారతీయ అమెరికన్ల సంఖ్య 18 లక్షలకు పైమాటేనని అంచనా. మరీ ముఖ్యంగా టెక్సాస్‌ (1,60,000)తో సహా పెన్సిల్వేనియా (61,000), మిచిగన్ (45,000), ఫ్లోరిడా (87,000), ఉత్తర కరోలినా (36,000), జార్జియా (57,000) తదితర రాష్ట్రాల్లో అధిక సంఖ్యలో ఉన్న భారతీయులు ఫలితాలను నిర్ణయించే కీలకంగా మార్చవచ్చని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరో వైపు జూన్‌ వరకు అందిన గణాంకాల ప్రకారం.. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఇక్కడి భారతీయులు 30 లక్షల డాలర్లకు పైగా విరాళం అందజేసినట్టు తెలిసింది. అమెరికాలో భారతీయ జనాభా పెరుగుదల, వారు ఆర్థికంగా, రాజకీయంగా చురుకైన భాగస్వామ్యం తీసుకోవటంతో  వీరి నిర్ణయం అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే కీలకం కావచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయులపై విద్య, ఉద్యోగాలు, ఆర్థిక స్థితి, ఆరోగ్యం, పర్యావరణం తదితర అంశాలు అధికంగా ప్రభావం చూపనున్నాయని తెలిసింది.

ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల మద్దతు, మెప్పు కోసం రెండు ప్రధాన పార్టీలు ప్రయత్నించటంలో ఆశ్చర్యం లేదని ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు రంగస్వామి వివరించారు. కాగా తమ ప్రాముఖ్యతను ఇరు పార్టీలు గుర్తించటం ఆనందంగా ఉందని.. భారతీయ అమెరికన్ల ప్రాబల్యం ఇంకా పెరగనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని