ఫౌచీపై నోరు పారేసుకున్న ట్రంప్‌

అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగౌరవపరిచే వ్యాఖ్యలతో నోరుపారేసుకున్నారు.

Published : 20 Oct 2020 11:20 IST

‘ఆయన 500 సంవత్సరాలుగా ఇక్కడే’ అంటూ విమర్శలు

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోరుపారేసుకున్నారు. దేశంలో కరోనా వైరస్‌ కట్టడి విషయంలో ట్రంప్‌  విధానాల్లో లోపాలను నిర్మోహమాటంగా చెప్పే ఫౌచీ తీరు అధ్యక్షుడికి కంటగింపుగా మారింది. మాస్కుల వాడకంపై నిర్లక్ష్యం, అలాగే కొవిడ్ చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ అని తేలకముందే శ్వేత సౌధానికి వచ్చి మాస్క్‌ను పక్కనపెట్టేయడం.. ఇలా అధ్యక్షుడి ప్రతి చర్యను ఫౌచీ తప్పుపడుతూనే ఉన్న విషయం తెలిసిందే. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ట్రంప్‌ మీడియాతో మాట్లాడుతూ ఆయనపై అక్కసు వెళ్లగక్కారు.

‘‘ఏదేమైనా మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి అని ప్రజలు అంటున్నారు. కొవిడ్‌తో వారు అలసిపోయారు. ఫౌచి, ఇతరులు చెప్పే మాటలు విని అలసిపోయారు’’ అంటూ పరుష పదజాలాన్ని వాడారు. ‘ఆయన 500 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. మనం ఆయన మాటలు విని ఉంటే ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మరణాలు సంభవించేవి’ అంటూ మండిపడ్డారు. కాగా, ఈ విమర్శల అనంతరం ట్రంప్‌ సొంత పార్టీకి చెందిన సెనెటర్‌ లామర్ అలెగ్జాండర్ నుంచి ఫౌచీకి మద్దతు లభించడం గమనార్హం. ‘ డాక్టర్ ఫౌచీ అత్యంత నిపుణులైన ప్రభుత్వ సేవకుల్లో ఒకరు. రొనాల్డ్ రీగన్‌ నుంచి మొదలుకొని మొత్తం ఆరుగురు అధ్యక్షుల వద్ద ఆయన సేవలు అందించారు. ఆయన సూచనలను ఎక్కువ మంది అమెరికన్లు విన్నట్లయితే తక్కువ సంఖ్యలో కరోనా కేసులు ఉండేవి, పాఠశాలలకు, ఉద్యోగాలకు, తినడానికి సురక్షితమైన పరిస్థితులు ఉండేవి’ అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, కరోనా కారణంగా తీవ్రంగా ప్రభావితమైన అగ్రదేశంలో 84,56,653మంది వైరస్ బారిన పడగా, 2,25,222 మంది మరణించారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని