ట్రంప్‌ ప్రచారానికి రష్యా విమానాలు..!

ట్రంప్‌కు రష్యాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది.. గతంలో ఆయన గెలిస్తే రష్యా సాయం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తి.. దర్యాప్తు దాకా దారితీసింది.. ఈ సారి ట్రంప్‌ ప్రచారంలో ఓ పొరబాటు చోటు చేసుకోవడంతో మరోసారి రష్యా పేరు బయటకు వచ్చింది.

Published : 15 Sep 2020 12:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రంప్‌కు రష్యాకూ ఏదో అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఆయన గెలిస్తే రష్యా సాయం చేసిందనే ఆరోపణలు వెల్లువెత్తి.. దర్యాప్తు దాకా దారితీసింది.. ఈసారి ట్రంప్‌ ప్రచారంలో ఓ పొరబాటు చోటు చేసుకోవడంతో మరోసారి రష్యా పేరు బయటకు వచ్చింది.

ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం ట్రంప్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ పార్టీకి చెందిన నేషనల్‌ కమిటీ అండ్‌ ది క్యాంపెయిన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో ప్రజలు అమెరికా సైనిక దళాలకు మద్దతు తెలిపాలని కోరారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, ఆ ప్రకటనలో అమెరికా విమానాల ఫొటోలకు బదులు రష్యా విమానాల ఫొటోలను వాడారు. దీనిని ఎవరూ సరి చూసుకోకుండానే విడుదల చేశారు.

ఈ ప్రకటనను ట్రంప్‌ ‘మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌’ కమిటీ తయారు చేసింది. ముగ్గురు అమెరికా సైనికులు నడిచి వెళుతుంటే.. వారిపై నుంచి మూడు రష్యా జెట్‌ విమానాలు దూసుకెళుతున్నట్లు ఉంది. ప్రకటనలో చూపించిన విమానాల చిత్రాలు మిగ్‌-29లుగా రక్షణ రంగ నిపుణుడు పెర్రీస్ప్రే గుర్తించారు. ఈ రకం విమానాలను రష్యా మాత్రమే తయారు చేస్తుంది. రెండు ఇంజిన్లతో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.  రష్యాకు చెందిన రుస్లన్‌ పాల్కోవ్‌ కూడా వీటిని మిగ్‌-29లుగా నిర్ధారించారు. అదే చిత్రంలోని ఒక సైనికుడు సోవియట్‌‌ హయాంలో తయారైన ఏకే-74 రైఫిల్‌ను ధరించినట్లు గుర్తించారు.  దీంతో ఆ చిత్రంలోని వారు అసలు అమెరికా సైనికులేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ డిజిటల్‌ ప్రచార చిత్రం సెప్టెంబర్‌ 8-12 వరకు ఆన్‌లైన్‌లోనే ఉంది. కనీస అవగాహన కూడా లేకుండా సేకరించిన ఇటువంటి చిత్రాలతో ఏకంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం నిర్వహించడం హాస్యాస్పదంగా మారింది. రిపబ్లికన్‌ పార్టీలో ఇవేమీ కొత్తకాదు. గత అక్టోబర్‌లో ఆ పార్టీ రిప్రజెంటేటీవ్‌ బ్రయాన్‌ మాస్ట్‌ రష్యాకు చెందిన ఓ నౌక ఫొటోను ట్వీట్‌ చేసి ‘హ్యాపీ బర్త్‌డే టూ యూఎస్‌ నేవీ’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత నాలిక్కరుచుకొని ఆ ట్వీట్‌ను తొలగించారు

ఇక మిగ్‌ 29 విమానాలను అమెరికాకు చెందిన ఎఫ్‌-15, ఎఫ్‌-16లను ఎదుర్కోవడానికి సోవియట్‌ హయాంలో తయారు చేశారు. భారత్‌ కూడా ఈ మిగ్‌ 29 విమానాలను వినియోగిస్తోంది. చైనాతో ఘర్షణ నేపథ్యంలో కొన్ని నెలల కిందటే ఇటువంటివి మరికొన్ని విమానాల కొనుగోలుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని