ట్రంప్‌ ఓటమిని అంగీకరించాల్సిందే: ఒబామా

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇకనైనా ఓటమిని అంగీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌నకు సూచించారు. దేశ హితం కోసం ట్రంప్‌ తన అహాన్ని, స్వప్రయోజనాన్ని పక్కనబెట్టాలని........

Published : 16 Nov 2020 13:56 IST

 

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్ని మార్చే అవకాశమే లేదని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఇకనైనా ఓటమిని అంగీకరించాలని అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన సూచించారు. దేశ హితం కోసం ట్రంప్‌ తన అహాన్ని, స్వప్రయోజనాన్ని పక్కనబెట్టాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత సీబీఎస్‌కు ఇచ్చిన తొలి ముఖాముఖిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు బైడెన్‌ గెలుపును పరోక్షంగా గుర్తిస్తూనే.. మరోవైపు ఓటమిని అంగీకరించేదే లేదని ట్రంప్‌ వ్యాఖ్యానించిన కొన్ని గంటల్లోనే ఒబామా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. 

అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి నియమ నిబంధనలను తుంగలో తొక్కి, సంప్రదాయాల్ని పక్కనబెడుతుంటే తాను చూస్తూ ఉండలేకపోయానని ఒబామా తెలిపారు. గతంలో అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించిన ఓ వ్యక్తిగా ట్రంప్‌ తీరు సవ్యంగా లేదని చెప్పడం తన బాధ్యతగా భావించానన్నారు. తన అభిమానులు సైతం అదే కోరుకున్నారన్నారు. అందుకే, ఎన్నికల ప్రచారంలో నోరు విప్పాల్సి వచ్చిందని వివరించారు.  

ప్రత్యర్థి దేశాలు అమెరికా బలహీనపడిందని భావిస్తున్నాయన్నారు. కేవలం ఈ ఎన్నికల తీరే కాకుండా గత కొన్నేళ్లుగా దేశ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలే అందుకు కారణమని తెలిపారు. ఇవన్నీ చూసిన ప్రత్యర్థులు అమెరికాను కొల్లగొట్టడం సాధ్యమేనన్న నిర్ణయానికి వచ్చారన్నారు.

దేశం పూర్తిగా రెండు భాగాలుగా విడిపోయిందని తాజా ఎన్నికలు నిరూపించాయని ఒబమా అన్నారు. ఈ స్థితిలో ఓ ప్రజాస్వామ్య దేశాన్ని ముందుకు నడపడం సాధ్యం కాదన్నారు. ఇకపై నిత్యం అసత్యాలు ప్రచారం చేసే అధ్యక్షుడు శ్వేతసౌధంలో ఉండబోరన్నారు. నియమ నిబంధనల్ని బేఖాతరు చేసే వ్యక్తి చేతిలో అధికారం ఉండబోదంటూ పరోక్షంగా ట్రంప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇకనైనా ప్రజలు ఏకతాటిపై ముందుకు సాగాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని