
భారత్‌పై మళ్లీ నోరు పారేసుకున్న ట్రంప్
వాయు కాలుష్యానికి కారణమంటూ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై నోరుపారేసుకున్నారు. భారత్‌ను చైనా, రష్యాలతో చేర్చి.. వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రపంచ వ్యాప్తంగా ఈ దేశాలే కారణమవుతున్నాయంటూ ఆరోపించారు. తమ దేశం ఈ విషయంలో చాలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ప్రగల్భాలు పలికారు. గతంలో కూడా ట్రంప్ పలుమార్లు ఈ విధమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
కీలక పోరు సాగే రాష్ట్రాల్లో ఒకటైన ఉత్తర కరోలినా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ట్రంప్.. అక్కడ వేలాది అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికా తన పరిపాలనలో పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే, శక్తివనరుల విషయంలో స్వయంసమృద్ధి సాధించిందని ప్రకటించారు. పర్యావరణ గణాంకాల విషయంలో తామే అత్యుత్తమమని చెపుతూ.. చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు హానికర పదార్థాలను అతిగా విడుదల చేస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయన్నారు. అదే సమయంలో పర్యావరణ హితం కోసం ప్లాస్లిక్ బదులుగా కాగితాన్ని వాడాలనే ఆలోచనను ఆయన ఎద్దేవా చేయటం గమనార్హం.
తాను అధ్యక్షుడైతే.. కోటిమందికి పైగా అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వం ఇస్తామని ట్రంప్ ప్రత్యర్థి జో బైడెన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బైడెన్ వలస విధానం అమెరికా సరిహద్దులనే చెరిపివేసేదిగా ఉందంటూ ట్రంప్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.