US కంటే భారత్‌లోనే ట్రంప్‌ ఎక్కువ పన్నులు కట్టారట!

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చుట్టూ కొత్త కొత్త వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే అధికార బదిలీ అంత సులువు కాదని సంకేతాలిచ్చి ఇప్పటికే విమర్శలపాలైన ఆయన తాజాగా అక్కడి................

Updated : 28 Sep 2020 11:37 IST

న్యూయార్క్‌ టైమ్స్‌ ఆసక్తికర కథనం

వాషింగ్టన్‌: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చుట్టూ కొత్త కొత్త వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలు తనకు ప్రతికూలంగా వస్తే అధికార బదిలీ అంత సులువు కాదని సంకేతాలిచ్చి ఇప్పటికే విమర్శలపాలైన ఆయన తాజాగా అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగవేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఆధారాలతో సహా ప్రచురించిన ఓ కథనం చర్చనీయాంశంగా మారింది. బిలియన్‌‌ డాలర్ల సామ్రాజ్యానికి అధిపతి అయిన ట్రంప్‌ ఓ సంవత్సరంలో కేవలం 750 డాలర్ల పన్ను మాత్రమే చెల్లించారని ఆ కథనం కుండబద్దలు కొట్టింది.

ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన 2016లో 750 డాలర్లు మాత్రమే ఫెడరల్‌ ప్రభుత్వానికి పన్నుగా చెల్లించినట్లు న్యూయార్క్‌ టైమ్స్‌ పేర్కొంది. అలాగే శ్వేతసౌధంలో అడుగుపెట్టిన తొలి సంవత్సరం 2017లోనూ 750 డాలర్లు మాత్రమే చెల్లించినట్లు వెల్లడించింది. గత 20 ఏళ్ల ఆదాయ పన్ను రిటర్నుల రికార్డులను సంపాదించిన న్యూయార్క్‌ టైమ్స్‌ ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. గత 15 ఏళ్లలో మొత్తం 10 సంవత్సరాలు ట్రంప్‌ ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎలాంటి పన్ను కట్టలేదని తెలిపింది. విదేశాల్లోనూ పన్నులు చెల్లిస్తున్నట్లు ఓ సందర్భంలో ట్రంప్‌ స్వయంగా వెల్లడించారు. 2017లో ఆయన, ఆయన కంపెనీలు కలిపి భారత ప్రభుత్వానికి 1,45,400 డాలర్లు పన్ను రూపంలో చెల్లించినట్లు టైమ్స్‌ ఓ సందర్భంలో పేర్కొంది. ఈ లెక్కన అమెరికాలో చెల్లించిన దానితో పోలిస్తే 2017లో ట్రంప్‌ భారత్‌లో కట్టిన పన్నులే ఎక్కువ! 

దీనిపై స్పందించిన ట్రంప్‌ అవన్నీ తప్పుడు వార్తలంటూ కొట్టిపారేశారు. తాను పన్నులన్నీ చెల్లిస్తూ వస్తున్నానని తెలిపారు. రిచర్డ్‌ నిక్సన్‌ అధ్యక్ష హోదాలో ఉన్న నాటి నుంచి ఆ పదవిలో ఉన్న ప్రతిఒక్కరూ ప్రతి ఏడాది వారి ఆదాయపు పన్ను వివరాలను బహిర్గతం చేస్తూ వచ్చారు. ట్రంప్‌ మాత్రం ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పైగా ఆదాయపు పన్ను వివరాలు తెలియజేయాలని కోరిన వారితో ట్రంప్‌ న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. దీంతో ఆ వివరాల్లో అంతలా ఏముందనే అనుమానాలు తీవ్రమయ్యాయి. 2016లో కీలకంగా మారిన ఈ అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా రెండోసారి అధ్యక్ష రేసులో ఉన్న సమయంలోనూ ఇది ప్రత్యర్థులకు ప్రధాన అస్త్రంగా మారింది. 

ట్రంప్‌ ఆర్గనైజేషన్‌కు చెందిన న్యాయవాది ఆలెన్‌ గార్టెన్‌ న్యూయార్క్‌ టైమ్స్‌ కథనంపై స్పందించారు. ‘‘అన్నీ కాకపోయినా.. అందులో ఉన్న చాలా విషయాలు అవాస్తవాలు. గత పదేళ్లలో ట్రంప్‌ మిలియన్ల డాలర్ల వ్యక్తిగత పన్ను చెల్లించారు. 2015లో అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించారు’’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని