డొనాల్డ్‌ ట్రంప్‌: అతనో విలువలు లేని వ్యక్తి..!

డొనాల్డ్‌ ట్రంప్ క్రూరమైన, నమ్మలేని వ్యక్తి అంటూ ట్రంప్ సొంత‌ సోదరి మేరీఅన్నే బ్యారీ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి.

Published : 23 Aug 2020 13:30 IST

తీవ్ర విమర్శలు చేసిన ట్రంప్‌ సోదరి బ్యారీ
రహస్య ఆడియో టేపుల సారాంశాన్ని బయటపెట్టిన అమెరికన్‌ మీడియా

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు కేవలం ప్రత్యర్థులనుంచే కాదు, తాజాగా సొంతగూటి నుంచి కూడా విమర్శలు మొదలయ్యాయి. డొనాల్డ్‌ ట్రంప్ క్రూరమైన, నమ్మలేని వ్యక్తి అంటూ ట్రంప్ సొంత‌ సోదరి మేరీఅన్నే బ్యారీ చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని సొంత ఇంటినుంచే విమర్శలు చేసిన ఆడియో టేపుల సారాంశం బయటకు రావడం ట్రంప్‌కు తలనొప్పిగా మారాయి.

‘టూ మచ్‌ అండ్‌ నెవర్‌ ఎనఫ్‌: హౌ మై ఫ్యామిలీ క్రియేటెడ్‌ ది వరల్డ్స్‌‌ డేంజరెస్‌ మ్యాన్‌’ అనే పేరుతో ట్రంప్‌ బంధువు (మేనకోడలు) మేరీ లియా ట్రంప్‌ రాసిన పుస్తకం ఈ మధ్యే ప్రచురితమైంది. ఆ సమయంలోనే ట్రంప్‌ సోదరి బ్యారీతో సంభాషించిన ఆడియో టేపుల ట్రాన్స్‌స్క్రిప్ట్‌ తాజాగా బయటకు వచ్చింది.

‘ట్రంప్‌ విలువలులేని, అబద్దాలు ఆడే వ్యక్తి’ అంటూ అతని సోదరి మేరీఅన్నే బ్యారీ తీవ్ర విమర్శలు చేసింది. అంతేకాకుండా అమెరికా అధ్యక్షపదవికి డొనాల్డ్‌ ట్రంప్ పనికిరాని వ్యక్తి అంటూ వ్యాఖ్యానించింది. ట్రంప్‌ సోదరి, మాజీ న్యాయమూర్తి మేరీఅన్నే బ్యారీ ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించింది. 2018-2019 మధ్యకాలంలో తన సమీప బంధువు రాసిన పుస్తకం కోసం బ్యారీతో సంభాషిస్తున్న సమయంలో ఆడియోలు రికార్డు చేసినట్లుగా భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంభాషణ సమయంలో అధ్యక్షుడు ట్రంప్‌పై బ్యారీ తీవ్ర విమర్శలు చేయడం చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ ఆడియోల ట్రన్స్‌స్క్రిప్ట్‌ను అమెరికాకు చెందిన ఓ అంతర్జాతీయ పత్రిక ప్రచురించింది.

అయితే, ట్రంప్‌ మీదున్న వ్యతిరేకతను బ్యారీ ఇప్పటివరకు ఎక్కడా వ్యక్తం చేయలేదు. తాజాగా బయటకు వచ్చిన ఈ రహస్య ఆడియో టేపుల సారాంశంలోనే అధ్యక్షపదవికి అతను అసమర్థుడంటూ చేసిన వ్యాఖ్యలు బయటకువచ్చాయి. అంతేకాకుండా ట్రంప్‌ పాలనా విభాగం తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలను బ్యారీ తప్పుపట్టింది. ముఖ్యంగా మెక్సికో నుంచి అమెరికాకు వలసవస్తోన్న పిల్లలను వారి తల్లిదండ్రుల నుంచి వేరుచేసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో అతను ఓ విలువలు లేని వ్యక్తి అని, కొన్ని సందర్భాల్లో క్రూరంగా ప్రవర్తిస్తాడంటూ వ్యాఖ్యానించినట్లు ఆడియో టేపుల్లో తేలింది.

ట్రంప్‌ బంధువు రాసిన పుస్తకంలో డొనాల్డ్‌ ట్రంప్‌‌ పెరిగిన తీరే అతన్ని నిర్లక్ష్య నాయకుడిగా మర్చింది అని రచయిత మేరీ అభిప్రాయపడింది. ఈ పుస్తకం ప్రచురణను నిలిపివేసేందుకు ట్రంప్‌ సోదరుడు రాబర్ట్‌ ప్రయత్నించినట్లు సమాచారం. అతను ఇటీవలే చనిపోయిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే, అమెరికాలో ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో ఇంటిపోరు బయటపడటం ట్రంప్‌కు కాస్త ఇబ్బంది కలిగించే విషయమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని