కాసేపు బయటకొచ్చిన ట్రంప్‌!

కరోనా బారిన పడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కోసం వాల్టర్‌ రీడ్ ఆస్పత్రి ఎదుట వేచి చూస్తున్న మద్దతుదారులను కనిపించేందుకు...............

Published : 05 Oct 2020 09:34 IST

వాషింగ్టన్‌: కరోనా బారిన పడి సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన కోసం వాల్టర్‌ రీడ్ ఆస్పత్రి ఎదుట వేచి చూస్తున్న మద్దతుదారులను కనిపించేందుకు కొద్ది సేపు బయటకు వచ్చారు. ఆస్పత్రి ఆవరణలో కారులోనే చక్కర్లు కొట్టారు. అమెరికా జాతీయ జెండాను పట్టుకొని ఉత్సాహపరుస్తున్న తన మద్దతుదారులకు అభివాదం చేశారు. తాను బాగానే ఉన్నానని చేతి సంజ్ఞల ద్వారా తెలియజేశారు. ఈ పర్యటన గురించి ఆయన ముందుగానే ట్విటర్‌ ద్వారా సంకేతం ఇచ్చారు. త్వరలోనే తన కోసం వేచి చూస్తున్న అభిమానులను ఆశ్చర్యంలో ముంచబోతున్నానని తెలిపారు. అన్నట్లుగానే కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారు. అయితే ట్రంప్‌ అలా బయటకు రావడం కొవిడ్‌ నిబంధనలకు విరుద్ధమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాను కొవిడ్‌ గురించి చాలా తెలుసుకున్నానని అంతకుముందు విడుదల చేసిన వీడియో సందేశంలో ట్రంప్‌ అన్నారు. స్కూల్‌కు వెళ్లి మరీ నేర్చుకున్నానని వ్యాఖ్యానించారు. వాల్టర్‌ రీడ్‌ ఆస్పత్రి వైద్యులు, ఇతర సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన కోసం బయట వేచిచూస్తున్న అభిమానులను ఆయన గొప్ప దేశభక్తకులుగా అభివర్ణించారు. వారిని త్వరలోనే ఆశ్చర్యానికి గురిచేస్తానని తెలిపారు. కొద్దిసేపట్లోనే ట్రంప్‌ ప్రత్యేక కారులో బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. 

అందుకే ఆస్పత్రికి..

ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం అందజేస్తున్న డాక్టర్‌ సియాన్‌ కాన్లే ఆదివారం కీలక విషయాలను వెల్లడించారు. ట్రంప్‌కు ఆక్సిజన్‌ అందజేయాల్సిన అవసరం ఏర్పడిందా అన్న ప్రశ్నను శనివారం దాటవేసిన ఆయన తాజాగా వివరణ ఇచ్చారు. శుక్రవారం తొలిసారి వైట్‌ హౌజ్‌లో ట్రంప్‌ ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోయాయని వివరించారు. తీవ్ర జ్వరమూ వచ్చిందన్నారు. దీంతో ఒక గంటపాటు ఆక్సిజన్‌ అందజేశామన్నారు. శనివారం రోజు రెండోసారి ఆక్సిజన్‌ స్థాయి పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలోనే వాల్టర్‌ రీడ్‌కు తరలించామన్నారు. ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌ హౌజ్‌ నిజాల్ని దాచిపెడుతోందని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కాన్లే ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. 

చికిత్సలో డెక్సామెథాసోన్‌..

రెండోసారి ఆక్సిజన్‌ శాతం పడిపోయిన తర్వాత డెక్సామెథాసోన్‌ అనే స్టెరాయిడ్‌ను ట్రంప్‌కు అందజేసినట్లు కాన్లే తెలిపారు. ఇది కేవలం తీవ్ర లక్షణాలు ఉన్న వారిలో మాత్రమే పనిచేస్తుందని గతంలో వైద్య నిపుణులు తేల్చారు. స్వల్ప, మోతాదు లక్షణాలున్న వారిలో ఇది ఏమాత్రం ఉపయోగకరంగా ఉండదని వెల్లడించారు. వెంటిలేటర్‌ దశకు చేరుకున్న వారిలో మరణాల రేటును ఇది మూడోవంతు తగ్గించిందని.. అదనపు ఆక్సిజన్‌ అవసరమైన వారిలో ఐదో వంతు తగ్గించిందని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో ట్రంప్‌ ఆరోగ్య పరిస్థితిపై నిజాలు దాస్తున్నారన్న ఆరోపణలు మళ్లీ వినిపిస్తున్నాయి. తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మాత్రమే ఇచ్చే డెక్సామెథాసోన్‌ను ట్రంప్‌కు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా డెక్సామెథాసోన్‌ను ఆర్థరైటిస్‌, అస్తమా వంటి జబ్బులకు వాడుతుంటారు. దీనితో పాటు యాంటీవైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌, మోనోక్లోనల్‌ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను కూడా ట్రంప్‌కు అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు