Updated : 06 Nov 2020 11:50 IST

ట్రంప్‌ అనుకున్నదంతా అవుతోంది..!

 చివర్లో పుంజుకుంటున్న బైడెన్‌..!
 జార్జియా, నెవాడా, పెన్సిల్వేనియాలో ఉత్కంఠ

ఇంటర్నెట్‌డెస్క్‌: మెయిల్‌ఇన్‌ బ్యాలెట్ల లెక్కింపుతో తన ఆధిపత్యానికి గండిపడుతుందన్న ట్రంప్‌ భయం వాస్తవరూపం ధరించింది. జార్జియా, పెన్సిల్వేనియాల్లో మెయిల్‌ ఓట్లను లెక్కించే కొద్దీ డెమొక్రాటిక్‌ పార్టీ వేగంగా పుంజుకుంటోంది.  ఇప్పటి వరకు ట్రంప్‌ వైపు మొగ్గు చూపుతున్న రాష్ట్రాలు ఓట్ల లెక్కింపు చివరికి వచ్చేసరికి భిన్నంగా మారుతున్నాయి. 

జార్జియాలో గండికొట్టిన ఫుల్‌టోన్‌ కౌంటీ

జార్జియా, పెన్సిల్వేనియాల్లో నిన్నటి వరకు స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న ట్రంప్‌ నేడు కొంత వెనుకబడ్డారు. ఫలితంగా బైడెన్‌, ట్రంప్‌ మధ్య తేడా ఒక్క శాతం కంటే తక్కువకు వచ్చింది. జార్జియాలో పోరు నువ్వానేనా అన్నట్లు సాగుతోంది. ఇక్కడ ఇద్దరికి 49.4శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ఫుల్‌టోన్‌ కౌంటీలో దాదాపు 20వేల ఆబ్సెంట్‌ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. వీటిల్లో 8,351 నిన్న రాత్రి రాగా.. బైడెన్‌కు ఏకంగా 6,410 ఓట్లు లభించాయి. ట్రంప్‌నకు 1,941 ఓట్లు మాత్రమే వచ్చాయి. లెక్కింపు జరిగే కొద్దీ ట్రంప్‌ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది.

ట్రంప్‌ దాదాపు 1700 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బైడెన్‌ విజయం సాధించి.. అరిజోనాలో ఫలితం వ్యతిరేకంగా వస్తే శ్వేత సౌధంలో అడుగుపెట్టడానికి ఒక్క ఓటు అవసరం అవుతుంది. అదే అరిజోనాలో గెలిచేస్తే స్పష్టమైన మెజార్టీ వచ్చేస్తుంది. మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలు కేవలం నామమాత్రమే అవుతాయి. ఇక్కడ ఇంకా దాదాపు 14,000 ఓట్లను లెక్కించాల్సి ఉంది. దీంతోపాటు మరో 8,900 మిలటరీ, విదేశాల నుంచి వచ్చే బ్యాలెట్స్‌ రేపటి వరకు వస్తాయని అంచనావేస్తున్నారు. దీంతోపాటు లెక్కించాల్సిన వాటిల్లో అట్లాంటా కౌంటీలో ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో డెమొక్రాట్లకు పట్టుంది. బైడెన్ ‌గనుక ఇది గెలిస్తే అదో రికార్డే అవుతుంది. 1992 తర్వాత ఇక్కడ డెమొక్రాటిక్‌ పార్టీ గెలవలేదు. 

పెన్సిల్వేనియాలో టెన్షన్‌..

పెన్సిల్వేనియాలో ట్రంప్‌ భయం నిజం అవుతున్నట్లు కనిపిస్తోంది. చివర్లో మెయిల్‌ఇన్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కించే కొద్దీ ఆయన ఆధిపత్యం మెల్లగా కరిగిపోతోంది. నిన్నటి వరకు ట్రంప్‌ ఇక్కడ ఒకశాతానికి పైగా ఆధిపత్యంలో ఉండగా.. ఇప్పుడు అది 0.4శాతానికి తగ్గిపోయింది. పెన్సిల్వేనియాలో పోస్టల్‌ బ్యాలెట్లు అత్యధికంగా డెమొక్రాట్లవేనని విశ్లేషకులు భావిస్తున్నారు. తాజా లెక్కల ప్రకారం మెయిల్‌ బ్యాలెట్లలో 60శాతం నుంచి 90శాతం వరకు ఓట్లు బైడెన్‌ పక్షానికే వస్తున్నట్లు అంచనా. దీంతో ట్రంప్‌ ఆధిక్యం 26వేలకు పడిపోయింది. 

రిపబ్లికన్లకు భయం దేనికి..

రిపబ్లికన్లు తమ మద్దతుదారులను బూత్‌కు వచ్చి ఓటు వేయడాన్ని ప్రోత్సహించారు. అదే సమయంలో కరోనా వ్యాప్తి కారణంగా డెమొక్రాట్లు తమ మద్దతుదారులను మెయిల్‌ఇన్‌ బ్యాలెట్లకు ప్రోత్సహించారు. అందుకే ఈ ఏడాది మెయిల్‌ ఇన్‌ బ్యాలట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. తొలుత బూత్‌కువచ్చి ఓటింగ్‌ చేసిన ఓట్లను కౌంట్‌ చేయడంతో చాలా రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యం కనిపించింది. మెయిల్‌ఇన్‌ బ్యాలెట్లను లెక్కించే కొద్దీ ఆయన ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా పెన్సిల్వేనియాలో ఇటువంటి పరిస్థితి నెలకొంది. అందుకే ట్రంప్‌ వర్గం పదేపదే అక్కడ కౌంటింగ్‌ను నిలిపివేయాలని కోరుతోంది.

 

జార్జియాలో తగ్గిన ట్రంప్‌ ఆధిక్యం..!

 

వీడని పీఠముడి

 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని