మాస్క్‌ను లెక్కచేయని ట్రంప్ సన్నిహితుడికి కరోనా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్‌హౌస్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్‌ మిడోస్ కరోనా వైరస్‌ బారిన పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

Published : 07 Nov 2020 14:10 IST

వాష్టింగ్టన్: వైట్‌హౌస్‌ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్‌ మిడోస్ కరోనా వైరస్‌ బారిన పడినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ప్రచార సహాయకుడు నిక్‌ ట్రైనర్‌కు కూడా వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. కాకపోతే, వారికి ఎప్పుడు వైరస్‌ సోకిందనే విషయంలో మాత్రం స్పష్టత లేదని స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, ట్రంప్‌ సన్నిహితుల్లో వైరస్‌ బారిన పడిన వారిలో మిడోస్‌ తాజా వ్యక్తి.

మిడోస్‌ నార్త్ కరోలినాకు చెందిన మాజీ శాసనసభ్యుడు. ట్రంప్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఎప్పుడూ ఆయన వెంటే కనిపించేవారు. ఇటీవల అధ్యక్షుడి మద్దతుదారులు పాల్గొన్న వైట్‌హౌస్‌ ఎలక్షన్ నైట్‌ పార్టీకి కూడా ఆయన హాజరు కావడం గమనార్హం. ఈ అధికారి కూడా ట్రంప్‌లా మాస్క్ ధరించకుండా బహిరంగ కార్యక్రమాల్లో దర్శనమిస్తుంటారు.

ఇక, అమెరికా అంతటా కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నప్పటికీ..మొదటినుంచి దాన్ని ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. ఆ వైరస్‌  ప్రభావాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు. చివరకు ఆయన కూడా ఆ వైరస్ బారిన పడ్డారు. శీతకాలం తీవ్రత పెరుగుతుండటంతో ఇటీవల అక్కడ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. చివరకు ఎన్నికల ప్రచారం, ఫలితాల్లో కూడా ఈ అంశమే కీలకపాత్ర పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని